iPhone 18 pro : ఐఫోన్ 18 ప్రో లీక్స్.. భారీగా ధర పెంపు! పవర్​ఫుల్​ చిప్​సెట్?

iPhone 18 pro : యాపిల్ తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడళ్లు ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ భారీ అప్‌గ్రేడ్లతో రానున్నాయి. 2ఎన్​ఎం ప్రాసెసర్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా, అధునాతన ఏఐ ఫీచర్లతో వచ్చే సెప్టెంబర్‌లో ఇవి లాంచ్ కానున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. ధరలు సైతం పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు..

Published on: Jul 21, 2026, 12:26:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరీ ముఖ్యంగా ఐఫోన్ 18 సిరీస్​ అప్పుడే హాట్​ టాపిక్​గా మారిపోయింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, సంస్థ తదుపరి మోడళ్లు ‘ఐఫోన్ 18 ప్రో’, ‘ఐఫోన్ 18 ప్రో మాక్స్’కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, ఈసారి యాపిల్ తన ప్రో వేరియంట్లలో విప్లవాత్మక కెమెరా సాంకేతికతను, అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ను పరిచయం చేయబోతోంది. సెప్టెంబర్ 2026లో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ ఫోన్ల ధరలు మునుపటి కంటే భారీగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఐఫోన్ 18 ప్రో లీక్స్..
ఐఫోన్ 18 ప్రో లీక్స్..

ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 ప్రో వేరియంట్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ చూసేయండి..

ధరలు భారీగా పెరిగే అవకాశం!

వచ్చే ఐఫోన్ ప్రో సిరీస్ ధరల విషయంలో టెక్ రంగానికి చెందిన విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెమొరీ, కృత్రిమ మేధ (ఏఐ) హార్డ్‌వేర్ తయారీ వ్యయం పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

అంచనాల ప్రకారం అమెరికా మార్కెట్‌లో కొత్త మోడళ్ల ప్రాథమిక ధరలు ఇలా ఉండే అవకాశం ఉంది:

ఐఫోన్ 18 ప్రో: దాదాపు 1,099 నుంచి 1,299 డాలర్లు (సుమారు రూ. 1,05,000 నుంచి రూ. 1,25,000)

ఐఫోన్ 18 ప్రో మాక్స్: దాదాపు 1,299 నుంచి 1,499 (సుమారు రూ. 1,05,000 నుంచి రూ. 1,44,000)

తయారీ ఖర్చులు పెరిగినందున యాపిల్ సుమారు 200 డాలర్ల వరకు ధరలను పెంచవచ్చని కొందరు విశ్లేషిస్తుంటే, వినియోగదారులపై భారం పడకుండా పాత ధరలకే అందించే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.

ఐఫోన్ 18 ప్రో ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు..

ఈసారి యాపిల్ అందిస్తున్న ప్రీమియం హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్లే ధరల పెంపునకు దారితీస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు:

నెక్ట్స్ జనరేషన్ ఏ20 ప్రో చిప్‌సెట్ వాడకం

అధునాతన ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లు

సరికొత్త సాంకేతికతతో కూడిన కెమెరా హార్డ్‌వేర్

సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ ఇచ్చే టెక్నాలజీ

వేగవంతమైన కనెక్టివిటీ విభాగాలు

గ్లోబల్ మార్కెట్‌లో పెరిగిన మెమొరీ చిప్‌ల ధరలు

కెమెరా విభాగంలో ఊహించని మార్పులు!

ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఐఫోన్ 18 ప్రో మాక్స్ సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇందులో ప్రైమరీ కెమెరాగా ‘సోనీ ఐఎంఎక్స్905’ సెన్సార్‌ను అందించనున్నారని, దీనికి తోడు ‘వేరియబుల్ అపెర్చర్’ సాంకేతికతను జోడించనున్నారని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఫోన్లలో సాఫ్ట్‌వేర్ ద్వారా బ్లర్ ఎఫెక్ట్ ఇస్తుంటారు. కానీ వేరియబుల్ అపెర్చర్ ద్వారా లెన్స్‌లోకి ఎంత కాంతి వెళ్లాలో భౌతికంగా సర్దుబాటు చేసుకోవచ్చు.

ఈ కొత్త కెమెరా హార్డ్‌వేర్ వల్ల లభించే ఉపయోగాలు:

తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన ఫోటోలు తీయవచ్చు.

సహజ సిద్ధమైన డెప్త్ ఆఫ్ ఫీల్డ్ లభిస్తుంది.

డైనమిక్ రేంజ్, పోర్ట్రెయిట్ ఫోటోల నాణ్యత ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

యాపిల్ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన కెమెరా అప్‌గ్రేడ్‌గా నిలవనుందని టెక్ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు.

సరికొత్త 'ఏ20 ప్రో' చిప్‌సెట్..

పర్ఫార్మెన్స్ పరంగా ఐఫోన్ 18 ప్రో స్మార్ట్​ఫోన్ సిరీస్ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో యాపిల్ సొంతంగా తయారు చేసిన 'ఏ20 ప్రో' ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 2-నానోమీటర్ (2ఎన్​ఎం) సాంకేతికతతో తయారయ్యే మొబైల్ చిప్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ చిప్‌సెట్ వల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ గణనీయంగా పెరగడమే కాకుండా, బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్, ఏఐ టాస్క్‌లు, గేమింగ్, హీటింగ్ కంట్రోల్ విషయంలో ఈ ప్రాసెసర్ అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 18 ప్రో ప్రత్యేకతలు (లీక్స్)

ప్రాసెసర్: 2ఎన్​ఎం ఏ20 ప్రో ప్రాసెసర్

కెమెరా: సోనీ ఐఎంఎక్స్905 సెన్సార్, వేరియబుల్ అపెర్చర్‌తో (ప్రో మాక్స్ మోడల్‌లో)

డిజైన్: ప్రీమియం టైటానియం బాడీ, చిన్నగా మారనున్న డైనమిక్ ఐలాండ్

సాఫ్ట్‌వేర్: ఐఓఎస్ 27, అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు

ఇతర ఫీచర్లు: శాటిలైట్ కనెక్టివిటీ, మెరుగైన బ్యాటరీ లైఫ్

యాపిల్ తన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే కొత్త ఐఫోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి ఐఫోన్ 18 ప్రో సిరీస్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే అనౌన్స్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ మాత్రం.. ఇంకొన్ని నెలల తర్వాత బయటకు రావొచ్చు.

అయితే కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకు ఈ ఫీచర్లు, ధరల వివరాలను కేవలం పరిశ్రమ అంచనాలుగా మాత్రమే పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More