iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో లీక్స్.. భారీ బ్యాటరీ, అదిరే ఫీచర్లు, అధిక ధర!
iPhone 18 Pro launch : యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. లాంచ్ టైమ్ సమీపిస్తున్న కొద్ది సోషల్ మీడియాలో అనేక లీక్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని ఇక్కడ చూసేయండి..
ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను విశేషంగా ఆకర్షించే యాపిల్ వార్షిక లాంచ్ ఈవెంట్‌కు సమయం దగ్గరపడుతోంది! ప్రతి ఏటా సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్లను పరిచయం చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి కూడా యాపిల్ సరికొత్త 'ఐఫోన్ 18 ప్రో' సిరీస్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి కేవలం సాధారణ అప్‌గ్రేడ్‌లు మాత్రమే కాకుండా, స్మార్ట్‌ఫోన్ రంగాన్నే మలుపు తిప్పేలా తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను సైతం యాపిల్ పరిచయం చేయబోతున్నట్లు గ్లోబల్ టెక్ వర్గాల సమాచారం.

ప్రముఖ బ్లూమ్‌బెర్గ్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ అంచనా ప్రకారం.. యాపిల్ తన వార్షిక కీనోట్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 8 లేదా 9, 2026న నిర్వహించే అవకాశం ఉంది. అందులోనూ సెప్టెంబర్ 9వ తేదీనే ఈ లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, సెప్టెంబర్ 18 నుంచి ప్రపంచవ్యాప్తంగా మరియు భారత మార్కెట్లో ఈ ఫోన్ల డెలివరీలు, విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
అయితే ఈసారి యాపిల్ తన లాంచ్ వ్యూహాన్ని మార్చబోతోంది. సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18ఈ, సరికొత్త ఐఫోన్ ఎయిర్ మోడళ్లను వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో లాంచ్ చేసి, ఈ సెప్టెంబర్ ఈవెంట్‌ను కేవలం ప్రీమియం ప్రో మోడళ్లకు, ఫోల్డబుల్ ఐఫోన్‌కు మాత్రమే పరిమితం చేయాలని చూస్తోంది.
భారతదేశంలో ఐఫోన్ 18 ప్రో ధరలు ఎలా ఉండబోతున్నాయి?
టెక్నాలజీ పెరిగేకొద్దీ ఐఫోన్ తయారీ ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. సరికొత్త 2ఎన్ఎం (నానోమీటర్) ఆర్కిటెక్చర్‌తో తయారవుతున్న చిప్‌సెట్, పెద్ద బ్యాటరీలు, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా సెన్సార్లు, ఖరీదైన మెమరీ విడిభాగాల కారణంగా ఈసారి ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు మునుపటి కంటే ఎక్కువగా ఉండనున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. భారతదేశంలో ప్రో మోడళ్ల ధరలను యాపిల్ దాదాపు రూ. 5,000 వరకు పెంచే ఆలోచనలో ఉంది. అదే జరిగితే, భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ. 1,39,900గా ఉండే అవకాశం ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ అయిన ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర దాదాపు రూ. 1,54,900 నుంచి ప్రారంభం కానుంది.
ఇది భారతీయ ఐఫోన్ ప్రియుల జేబుకు మరింత భారంగా మారనుంది.
ఐఫోన్ 18 ప్రో- కెమెరా విభాగంలో సరికొత్త విప్లవం..
ఐఫోన్ ఫోటోగ్రఫీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యాపిల్ ఈసారి కెమెరా విభాగంలో కీలక మార్పులు చేస్తోంది. వెనుక భాగంలో ట్రిపుల్ 48-మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను అలాగే కొనసాగిస్తూనే, ప్రైమరీ కెమెరాకు ‘వేరియబుల్ అపెర్చర్’ లెన్స్‌ను అమర్చబోతున్నారు. దీనివల్ల తక్కువ వెలుతురు ఉన్న సమయంలోనూ అత్యద్భుతమైన డెప్త్-ఆఫ్-ఫీల్డ్‌తో స్పష్టమైన ఫోటోలను షూట్ చేయవచ్చు.
దీనితో పాటు మరింత బ్రైట్‌గా ఉండే టెలిఫోటో కెమెరా, కొత్త స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్, సెల్ఫీల కోసం 24-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పరిచయం చేయనున్నారు. ఐఫోన్ 16 సిరీస్‌లో పరిచయమైన 'కెమెరా కంట్రోల్' బటన్‌ను ఈసారి పూర్తిగా ప్రెజర్-సెన్సిటివ్ (నొక్కినప్పుడు వైబ్రేషన్ ఇచ్చేలా) కంట్రోల్‌గా రీడిజైన్ చేయనున్నారు.
ఐఫోన్ 18 ప్రో- డిజైన్, డిస్‌ప్లే..
ఐఫోన్ 18 ప్రో సిరీస్ పాత ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, వెనుక ప్యానెల్ మునుపటి కంటే చాలా బెటర్‌గా ఉండి, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. కెమెరా లెన్స్‌ల పరిమాణం పెరగడం, పెద్ద బ్యాటరీల కారణంగా ఫోన్ మందం స్వల్పంగా పెరగనుంది. ఈ సిరీస్‌ను సరికొత్త ‘డార్క్ చెర్రీ’ రంగుతో పాటు లైట్ బ్లూ, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లో తీసుకురానున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే, ఐఫోన్ 18 ప్రో 6.3 ఇంచుల స్క్రీన్‌తో, ప్రో మాక్స్ మోడల్ 6.9 ఇంచుల స్క్రీన్‌తో రానున్నాయి. అయితే, డిస్‌ప్లే పైభాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజును యాపిల్ ఈసారి మరింత తగ్గించనుంది. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని సెన్సార్లను నేరుగా డిస్‌ప్లే కింద అమర్చడం ద్వారా స్క్రీన్ స్పేస్‌ను పెంచనున్నారు. ఇవి అత్యంత తక్కువ పవర్ వినియోగించుకునే ఎల్టీపీఓ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలతో రాబోతున్నాయి.
పవర్‌ఫుల్ ఏ20 ప్రో చిప్.. ఆన్-డివైజ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అత్యంత కీలకమైన మార్పు ప్రాసెసర్. తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎమ్‌సీ సంస్థ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన 2ఎన్ఎం సాంకేతికత ఆధారంగా రూపొందించిన 'A20 ప్రో' చిప్‌ను ఈ ఫోన్లలో వాడనున్నారు. ఇది మునుపటి కంటే అత్యంత వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను, సున్నితమైన గేమింగ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా.. ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫోన్ లోపలే రన్ అయ్యే అత్యంత శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
ఐఫోన్ 18 ప్రో- భారీ బ్యాటరీ.. సుదీర్ఘ లైఫ్!
చాలా కాలంగా ఐఫోన్ యూజర్లు ఎదురుచూస్తున్న అతిపెద్ద అప్‌గ్రేడ్ బ్యాటరీ బ్యాకప్. ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్‌లో ఏకంగా 5,500ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు లీకులు చెబుతున్నాయి. దీనివల్ల ఫోన్ బరువు సుమారు 240 గ్రాములకు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సింగిల్ ఛార్జ్‌తో రెండు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్లు సరికొత్త ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ కానున్నాయి. ఇందులో మరింత స్మార్ట్‌గా మారిన సిరి వాయిస్ అసిస్టెంట్, సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


