Smartphone : టాయిలెట్ సీట్​ కన్నా మీ స్మార్ట్​ఫోన్​తోనే రోగాలు ఎక్కువ! ఇవి తెలిస్తే షాక్ అవుతారు..

Mobile phone hygiene tips : మనం ప్రాణప్రదంగా చూసుకునే స్మార్ట్‌ఫోన్లలో టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని మైక్రోబయాలజిస్ట్ నీతూ సురేష్‌కుమార్ హెచ్చరించారు. నిరంతరం ఫోన్ తాకడం వల్ల వచ్చే ఆరోగ్య ముప్పులు, దాన్ని శుభ్రం చేసుకునే సులువైన మార్గాలు ఈ కథనంలో..

Published on: Jul 16, 2026, 06:43:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉదయం కళ్లు తెరిచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, నిద్ర పట్టదు. కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా ఫోన్ స్క్రీన్ స్క్రోల్ చేయడం నేటి డిజిటల్ యుగంలో చాలామందికి అలవాటుగా మారింది. అయితే, చూడటానికి ఎంతో నిగనిగలాడుతూ, శుభ్రంగా కనిపించే మీ స్మార్ట్‌ఫోన్.. కంటికి కనిపించని కోట్లాది సూక్ష్మక్రిములకు నిలయమనే చేదు నిజాన్ని నిపుణులు బట్టబయలు చేస్తున్నారు. దుబాయ్‌లో మైక్రోబయాలజిస్ట్‌గా పనిచేస్తున్న నీతూ సురేష్‌కుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సమాచారం ఇప్పుడు నెటిజన్లను ఉలిక్కిపడేలా చేస్తోంది.

టాయిలెట్ సీట్​ కన్నాా మీ స్మార్ట్​ఫోన్​తోనే రోగాలు ఎక్కువ! (Pixabay)
టాయిలెట్ సీట్​ కన్నాా మీ స్మార్ట్​ఫోన్​తోనే రోగాలు ఎక్కువ! (Pixabay)

మనం వాడే మొబైల్ ఫోన్లు టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయనే షాకింగ్ విషయాన్ని ఆమె వివరించారు. భారతదేశంలోనూ మెజారిటీ ప్రజలు స్మార్ట్‌ఫోన్లను గంటల తరబడి వాడుతుండటంతో ఈ ముప్పు మన ఇళ్లకూ పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

జెర్మ్స్ మాగ్నెట్‌గా మారిన స్మార్ట్‌ఫోన్లు..

ఫోన్లు ఇంతలా బ్యాక్టీరియా కేంద్రాలుగా మారడానికి మన జీవనశైలే ప్రధాన కారణమని నీతూ పేర్కొన్నారు. మనం వెళ్లే ప్రతి చోటుకూ ఫోన్‌ను తీసుకెళ్లడం వల్ల అది ఒక 'జెర్మ్స్ మాగ్నెట్' (క్రిములను ఆకర్షించే అయస్కాంతం) లా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే రోజువారీ జీవితంలో ఫోన్‌ను ఎక్కడెక్కడ పెడుతున్నామో ఒకసారి గమనిస్తే:

ఆఫీసుల్లో అందరూ కూర్చునే కామన్ డెస్క్‌లపై పెట్టడం.

వంట చేసేటప్పుడు కిచెన్ కౌంటర్లపై ఉంచడం.

జిమ్‌కు వెళ్లినప్పుడు వర్కవుట్ ఎక్విప్‌మెంట్‌పై పడేయడం.

ప్రయాణాల్లో బ్యాగులు, జేబుల్లో ఉంచడం.

అన్నిటికంటే ప్రమాదకరంగా.. వాష్‌రూమ్‌లకు కూడా వెంటబెట్టుకు వెళ్లడం.

అసలు ప్రమాదం..

అయితే అసలు ప్రమాదం ఫోన్‌ను ఎక్కడ పెట్టామనే దానికంటే, ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామనే దానితోనే ముడిపడి ఉంది.

"వాష్‌రూమ్‌లలోనో, ఆఫీస్ డెస్క్‌లపైనే పెట్టిన ఫోన్‌ను అదే చేత్తో పట్టుకుని తింటుంటాం. వంట చేసేటప్పుడు ముట్టుకుంటాం. చివరకు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు నేరుగా మన ముఖానికి, చర్మానికి దగ్గరగా ఉంచుతాం," అని నీతూ సురేష్‌కుమార్ హెచ్చరించారు.

ఈ నిరంతర స్పర్శ వల్ల ఒక చోట ఉన్న బ్యాక్టీరియా చాలా సులభంగా మన చేతులకు, అక్కడి నుంచి నోట్లోకి, ముఖానికి బదిలీ అవుతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘క్రాస్-కంటామినేషన్’ అంటారు. ఇది చర్మ సమస్యల నుంచి ఇన్ఫెక్షన్ల వరకు దారితీసే ప్రమాదం ఉంది. మీ ఫోన్ మీరు అనుకుంటున్న దానికి కంటే చాలా రెట్లు మురికిగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

మీ ఫోన్‌ను సురక్షితంగా క్లీన్ చేయడం ఎలా?

ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని భయపెట్టడం తన ఉద్దేశం కాదని, రోజువారీ అలవాట్లలో చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నీతూ సూచించారు. స్మార్ట్‌ఫోన్లను సురక్షితంగా క్లీన్ చేయడానికి రెండు సులువైన చిట్కాలను ఆమె పంచుకున్నారు.

మొదటి పద్ధతి: మార్కెట్లో దొరికే ఫోన్-సేఫ్ డిసిన్ఫెక్టెంట్ వైప్స్ ఉపయోగించి క్రమంతప్పకుండా ఫోన్‌ను తుడవాలి.

రెండవ పద్ధతి: ఒక మెత్తటి కాటన్ గుడ్డ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌పై కొద్దిగా హ్యాండ్ శానిటైజర్ వేసి, ఫోన్ స్క్రీన్, వెనుక భాగాన్ని మృదువుగా క్లీన్ చేయాలి. ద్రవపదార్థాలు నేరుగా ఫోన్ స్పీకర్ రంధ్రాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

ఈ చిన్న అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా క్రిములు మీ చేతులకు, ముఖానికి, తినే ఆహారానికి చేరకుండా అడ్డుకోవచ్చు. అనేక రోగాల నుంచి తప్పంచుకోవచ్చు!

మీ స్మార్ట్​ఫోన్ ఎంత క్లీన్‌గా ఉంటే, ఆరోగ్యం అంత సేఫ్‌గా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More