Family SUV : టాటా పంచ్ ఎస్యూవీ కొనొచ్చా? 3ఏళ్ల వినియోగం తర్వాత పర్సనల్, హానెస్ట్ రివ్యూ..
టాటా పంచ్ ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! నేను టాటా పంచ్ ఎస్‌యూవీని 3ఏళ్ల నుంచి వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ టాటా పంచ్ ఎస్‌యూవీపై ఇక్కడ నా పర్సనల్, హానెస్ట్ రివ్యూని చెక్ చేయండి.
మధ్యతరగతి ప్రజలకు కారు కొనడం అనేది ఒక కల! అందుకోసమే రూపాయి రూపాయి పోగు చేస్తుంటారు. బడ్జెట్లో మంచి కారు కొనాలని చూస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇప్పుడు బడ్జెట్లో మంచి మంచి మోడల్స్‌ని తీసుకోస్తున్నాయి. వాటిల్లో టాటా పంచ్ ఎస్యూవీ ఒకటని అనడంలో సందేహం లేదు. ఇండియాలో ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో టాటా పంచ్ ముందు వరుసలో ఉంటుంది. మరి మీరు ఈ కారు తీసుకోవచ్చా? పంచ్ ఓనర్‌గా నా 3ఏళ్ల- 2 నెలల ఎక్స్‌పీరియెన్స్‌ని, పర్సనల్ అండ్ హానెస్ట్ రివ్యూని ఇక్కడ ఇస్తాను. కచ్చితంగా చెక్ చేయండి.

టాటా పంచ్ ఎస్యూవీ- నేను ఎప్పుడు కొన్నాను?
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. టాటా పంచ్ అనే మైక్రో ఎస్‌యూవీని తొలిసారిగా 2021లో లాంచ్ చేసింది. రూ. 10లక్షల లోపు బడ్జెట్లో మంచి ఫ్యామిలీ కారు కోసం నేను 2022 తొలినాళ్లల్లో నా వేటను మొదలుపెట్టాను. నేను హైదరాబాద్‌లో ఉంటాను కాబట్టి, ట్రాఫిక్‌లో మేన్యువల్ బండి నడపడం ఇబ్బందే అని నాకు అర్థమైంది. అందుకే ఆటోమేటిక్ కారు కొనాలని ఫిక్స్ అయ్యాను.
మార్కెట్లో అప్పటికే కియా సెల్టోస్‌కి మంచి డిమాండ్ ఉంది. కానీ అందులోని వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ధర నా బడ్జెట్ కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అప్పుడే టాటా పంచ్‌పై నా దృష్టి పడింది.
టాటా పంచ్ ఎస్‌యూవీలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కోసం వెతికాను. ఆ సమయంలో అడ్వెంచర్ రిథమ్ వేరియంట్ నాకు ‘బెస్ట్ బై’ అనిపించింది.
2022 ఆగస్టులో టాటా పంచ్‌ని బుక్ చేశాను. కొవిడ్ అనంతర సప్లై చెయిన్ ఇబ్బందుల కారణాల వల్ల డెలివరీ కాస్త ఆలస్యమైంది. చివరిగా, 2022 డిసెంబర్లో నేను నా మొదటి కారును డెలివరీ తీసుకున్నాను ( ఆ ఫీలింగే వేరు!).
టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ వేరియంట్ షోరూమ్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు రూ. 9.5లక్షల వరకు ఖర్చు అయ్యింది.
టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్- ఇంజిన్ ఏంటి?
2022లో నేను టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్ ఏఎంటీ తీసుకున్నప్పుడు అందులో 1199 సీసీ, 3 సిలిండర్- 1.2 లీటర్ రెవొట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్‌కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ 87 బీహెచ్పీ పవర్‌ని, 115 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
టాటా పంచ్ ఎస్యూవీ- ఫీచర్స్ ఏంటి?
టాటా పంచ్ అడ్వెంచర్ రిథమ్‌లో అన్ని అత్యాధునిక ఫీచర్లు లేనప్పటికీ.. బడ్జెట్ రేంజ్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని నాకు అనిపించింది. అవి..
- 7 ఇంచ్ టచ్‌స్క్రీన్
- డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే
- రేర్ పార్కింగ్ సెన్సార్
- ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి.
సన్‌రూఫ్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్), రేర్ ఏసీ, రేర్ వైపర్ వంటివి ఇందులో లేవు. నా ప్రయారిటీలో సన్‌రూఫ్ లేదు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ టీపీఎంఎస్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని ఇప్పటికీ అనిపిస్తుంది.
ఇక రేర్ ఏసీ విషయం గురించి నెక్ట్స్ సెక్షన్లో చెబుతాను.
వాస్తవానికి 2023, 24లో టాటా పంచ్‌ని టాటా మోటార్స్ స్వల్పంగా అప్డేట్ చేసింది. ఫలితంగా తక్కువ ధరకే సన్‌రూఫ్ వేరియంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, 2024లో టాటా పంచ్ అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్ వేరియంట్లను టాటా మోటార్స్ సైలెంట్‌గా డిస్కంటిన్యూ చేసేసింది.
టాటా పంచ్- కేబిన్ లోపల ఎలా ఉంది?
బయట నుంచి చూడటానికి ఈ టాటా పంచ్ ఒక చిన్న కారుగా ఉంటుంది. కానీ మధ్యతరగతి కుటుంబానికి సరిపడా స్పేస్ ఇందులో ఉంటుంది. ఐదుగురు ప్రశాంతంగా కూర్చోవచ్చు. (ఎవరైనా లావుగా ఉంటే, వెనుక సీట్లో కాస్త అడ్జెస్ట్ అవ్వాల్సి వస్తుంది).
డైమెన్షన్స్ పరంగా నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటి ఉంది. నా స్నేహితుడు 6 అడుగల ఎత్తు ఉంటాడు. అతను కూర్చుని డ్రైవ్ చేసినప్పుడు కూడా హెడ్ రూఫ్ బాగానే అనిపించింది.
నా కారులో రేర్ ఏసీ లేదు. కానీ ఫ్రెంట్ ఏసీని ఆన్ చేసి పెట్టినప్పుడు క్యాబిన్ కూల్ అవ్వడానికి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడం (వేసవి కాలంలో కూడా) నాకు చాలా బాగా అనిపించింది! అంటే.. నా ఒపీనియన్ ప్రకారం ఈ మైక్రో ఎస్‌యూవీలో అసలు రేర్ ఏసీ అవసరమే లేదు.
ఇక వెనుక వైపు లగేజ్‌కి కూడా చాలా స్పేస్ ఇచ్చింది టాటా మోటార్స్. వెనుక రో-ని ఫోల్డ్ చేసే ఆప్షన్ కూడా ఉండటంతో స్పేస్ మరింత పెరుగుతుంది. నేను ఇల్లు మారినప్పుడు ఏసీతో పాటు అనేక వస్తువులను సులభంగా నా కారులోనే షిఫ్ట్ చేశాను.
మొత్తం మీద.. టాటా పంచ్ క్యాబిల్ స్పేషియస్గా, అన్ని అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది.
టాటా పంచ్ ఎస్యూవీ- మైలేజ్ ఎంత ఇస్తోంది?
మైలేజ్‌ని రెండు రకాలుగా విభజించాలి. ఒకటి సిటీ డ్రైవ్, ఇంకొకటి హైవే డ్రైవ్. దాని కన్నా ముందు ఈ 3ఏళ్ల రెండు నెలల్లో ఈ వెహికిల్ ఎంత తిరిగిందో మీకు చెప్పాలి.
2022 డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి 15 వరకు నా కారు 26,400 కి.మీలు తిరిగింది. (అవును! ఇది తక్కువే అని మీరు అభిప్రాయపడటంలో తప్పు లేదు. అవసరం ఉన్నప్పుడే కారు తీయడం నాకు అలవాటు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్‌తో పాటు వెళ్లే చోట పార్కింగ్ స్పేస్ ఉంటుందో లేదో అని భయపడుతుంటాను.)
నిజం చెప్పాలంటే.. ట్రాఫిక్ వల్ల మాటిమాటికి క్లచ్- బ్రేక్ ప్రెస్ చేయాల్సి వస్తోంది కాబట్టి.. నగరంలో టాటా పంచ్ నాకు గరిష్ఠంగా సగటున 12-13 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తోంది.
ఇక హైవే డ్రైవ్‌లోనే అసలు విషయం ఉంది! అందులోనే అసలు మజా ఉంది!
ఈ మూడేళ్లల్లో నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి చాలాసార్లు వెళ్లివచ్చాను. హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కూడా వెళ్లాను. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు (ఎన్‌హెచ్ 44 చాలా బాగుంటుంది), హైదరాబాద్ నుంచి శ్రీరంగం కూడా వెళ్లాను. హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ వరకు నా టాటా పంచ్ ఎస్‌యూవీలోనే ఫ్యామిలీ ట్రిప్‌కి (మీరు పైన చూసిన ఫొటో దీనికి సంబంధించినదే) వెళ్లాను. అంతేకాదు రాజమండ్రి నుంచి బెంగళూరు కూడా సింగిల్ స్ట్రెచ్‌లో డ్రైవ్ చేశాను.
ప్రతి ట్రిప్‌లోనూ కిలోమీటర్లు, మైలేజ్‌ని చెక్ చేయడం నాకు అలవాటు. ఏసీ ఉంచి, ఏసీ తీసేసి కూడా మైలేజ్‌ని చెక్ చేస్తూ ఉంటాను.
నా పంచ్ ఎస్యూవీ చాలా వరకు యావరేజ్‌గా 17 కేఎంపీఎల్ మైలేజ్‌ని ఇచ్చింది. ఉదాహరణకు.. గత నెల ఫిబ్రవరిలో హైదరాబాద్- బెంగళూరు ట్రిప్‌కి వెళ్లాను. మొత్తం 1382 కి.మీకి 17 కేఎంపీఎల్ మైలేజ్ వచ్చింది.
ఇక ఏసీ ఆఫ్ చేసి చూసినప్పుడు ఓ సందర్భంలో 22 కేఎంపీఎల్ మైలేజ్ కూడా వచ్చింది (ఆటోమేటిక్ కారుకు ఇది చాలా ఎక్కువ!). మొత్తం మీద చూసుకుంటే.. హైవే, లాంగ్ ట్రిప్స్‌లో నా టాటా పంచ్ మైలేజ్ సగటున 16.5 కేఎంపీఎల్ (రోడ్లు అద్వానంగా ఉన్నప్పటికీ)కి మించి తగ్గడం నేను చూడలేదు.
ఇంకో విషయం.. ఒకే స్ట్రెచ్‌లో 620 కి.మీలు నడిపినా.. ఈ కారులో అలసట అనిపించలేదు. 120 కి.మీ స్పీడ్‌లో (దాని కన్నా వేగంగా వెళ్లడం నాకు ఇష్టం లేదు) నడిపినా.. బాడీ రోల్ అవ్వలేదు. వేరే కార్లలో ఆ స్పీడ్‌లో బాడీ రోల్ అవుతుండటాన్ని నేను గమనించాను. అది డ్రైవర్‌కి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.
అయితే, రెగ్యులర్‌గా తీయకపోవడం వల్ల కంపెనీ ఇచ్చిన బ్యాటరీ 2ఏళ్ల 5 నెలలకే పని చేయడం ఆపేసింది.
టాటా పంచ్ ఎస్యూవీ- పర్సనల్ రివ్యూ..
మొత్తం మీద చెప్పాలంటే.. మధ్యతరగతి కుటుంబానికి ఈ టాటా పంచ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్! 3ఏళ్ల 2 నెలల వినియోగం తర్వాత నేను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను.
ఈ మూడేళ్లల్లో సర్వీస్ విషయంలోనూ పెద్దగా సమస్యలు ఎదురవ్వలేదు (కానీ సర్వీస్ సెంటర్లలో రద్దీ బాగా ఉంటుంది).
ఇంత మాట్లాడి సేఫ్టీ గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? టాటా కారును నేను పరిగణించడానికి ప్రధాన కారణమే.. సేఫ్టీ! టాటా పంచ్‌కి కూడా 5 స్టార్ రేటింగ్ ఉందని తెలిసే తీసుకున్నాను. (ఫ్యామిలీ భద్రత ముఖ్యం బాసు)
కానీ నాకు మూడు విషయాల్లో ఫిర్యాదులు ఉన్నాయి. ఒకటి.. ఇండికేటర్లు. పవర్ స్టీరింగ్ చాలా స్మూత్‌గా ఉండం వల్ల.. ఇండికేటర్ వేసి- స్వల్పంగా స్టీరింగ్ తిప్పినా ఇండికేటర్ వెంటనే ఆగిపోతోంది. ఫలితంగా, టర్న్ తీసుకునేంత వరకు ఇండికేటర్‌ని మాటిమాటికి ఆన్ చేయాల్సి వస్తోంది.
ఇంకొకటి.. హైట్‌లో నడపడం ఇబ్బందిగా ఉంటోంది. ఏదైనా ఎత్తైన ప్రాంతాన్ని ఎక్కుతున్నప్పుడు.. సరైన హార్స్ పవర్ లేకపోవడంతో బండి వెనక్కి వెళ్లిపోతోంది! వెంటనే యాక్సలరేషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండట్లేదు. ఆ సమయంలో హ్యాండ్ బ్రేక్‌తో మేనేజ్ చేయాల్సి వస్తోంది.
"హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటే బాగుండు" అని నాకు అనిపిస్తోంది.
మరొకటి.. మేన్యువల్తో పోల్చితే ఆటోమేటిక్ కార్లలో గేర్ షిఫ్టింగ్ కాస్త ఇబ్బందే! మొదట్లో నాకు ఇబ్బంది కలగలేదు కానీ.. ఇప్పుడు గేర్ షిఫ్టింగ్‌లో కాస్త ల్యాగ్ అనిపిస్తోంది.
2026 టాటా పంచ్‌ని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. జీఎస్టీ కట్స్‌తో పాటు ఇతర కారణాల వల్ల ధరలు దిగిరావడంతో వాల్యూ ఫర్ వేరియంట్లోనే అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. సన్‌రూఫ్ కూడా ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ వేరియంట్లోనే లభిస్తోంది. సేఫ్టీ ఫీచర్లు కూడా పెరిగాయి.
బడ్జెట్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. టాటా పంచ్ ఎస్‌యూవీని ట్రై చేయొచ్చని నేను రికమెండ్ చేస్తాను.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


