...
...
Next Story

Ind Vs Pak: ఇరగదీసిన ఇషాన్.. ఒక్కడే అదుర్స్.. ఇండియాకు పాక్ స్పిన్ ట్రాప్.. భారత్ స్కోరు ఎంతంటే?

టీ20 ప్రపంచకప్ పోరులో ఇండియాకు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ స్పిన్ ట్రాప్ సెట్ చేసింది. స్పిన్నర్లకు కోపరేట్ చేసిన పిచ్ పై పాక్ ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. కానీ ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్, ఆఖర్లో మెరుపులతో ఇండియా స్కోరు 170 దాటింది.

Published on: Feb 15, 2026, 20:41:48 IST
Advertisement

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఇండియా మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఒక్కడే అదరగొట్టాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.

అభిషేక్ డకౌట్

ఇషాన్ కిషన్ (PTI)
ఇషాన్ కిషన్ (PTI)

ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌటయ్యాడు. వరుసగా అతను ఆడిన రెండో మ్యాచ్ లోనూ సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. స్పిన్ తో అభిషేక్ కు బ్రేక్ వేద్దామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్వయంగా బౌలింగ్ చేసి వికెట్ సాధించాడు.

ఇషాన్ తుపాన్

అభిషేక్ శర్మ వికెట్ పడగొట్టిన ఆనందం పాకిస్థాన్ కు ఎక్కువ సేపు ఉంచకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తుపాను స్టేడియాన్ని ముంచెత్తింది. పాకిస్థాన్ స్పిన్నర్లతోనే బౌలింగ్ ఎటాక్ కొనసాగించినా ఇషాన్ కిషన్ ఏ మాత్రం తగ్గలేదు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 40 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.

ఆ వికెట్ తో

ఇషాన్ ఓ వైపు చెలరేగగా.. మరో ఎండ్ లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (24 బంతుల్లో 25) స్పీడ్ గా ఆడలేకపోయాడు. అయినా ఇండియా టీమ్ 8.3 ఓవర్లలో 88 పరుగులతో బెటర్ గానే నిలిచింది. కానీ ఆ తర్వాతి బంతికే ఇషాన్ ను సయీం అయూబ్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 32) కూడా నెమ్మదిగానే ఆడటంతో స్కోరుబోర్డుకు బ్రేక్ పడింది.

ఒకే ఓవర్లో రెండు

టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లో ఇండియాకు పాకిస్థాన్ స్పిన్ ట్రాప్ సెట్ చేసింది. ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించింది. స్పిన్నర్లు సల్మాన్ అఘా, సయీం అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ చేశారు. పేసర్ షహీన్ రెండు ఓవర్లు మాత్రమే వేశాడు.

మిస్టరీ స్పిన్నర్

డిఫరెంట్ బౌలింగ్ స్టైల్ తో వైరల్ గా మారిన పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ వికెట్ ను సాధించాడు. రనప్ తో వచ్చి క్రీజులో ఆగి బౌలింగ్ చేసే అతణ్ని ఇండియన్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు. కానీ ఆఖర్లో సూర్యకుమార్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చేశాడు.

ఆఖర్లో శివమ్ దూబె (17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 27), రింకు సింగ్ (4 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ తో 11 నాటౌట్) మెరుపులతో ఇండియా స్కోరు 170 దాటింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks