CJP March : రక్తసిక్తమైన పార్లమెంట్ మార్చ్! ఏం జరిగింది? ఎలా జరిగింది? గ్రౌండ్ రిపోర్ట్..
Jantar Mantar protest : నీట్ పేపర్ లీకేజీపై దిల్లీలో తలపెట్టిన 'చలో సంసద్' నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించి అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? హెచ్‌టీ గ్రౌండ్ రిపోర్ట్..
"భారతదేశంపై క్రూరంగా దాడి జరిగింది" – దిల్లీలో పార్లమెంట్ వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రదర్శించిన దమనకాండపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) సోమవారం సాయంత్రం తీవ్ర ఆగ్రహంతో స్పందించిన తీరు ఇది. నీట్-యూజీ ప్రవేశ పరీక్షల అక్రమాలను నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన 'చలో సంసద్' మార్చ్ దిల్లీ వీధుల్లో తీవ్ర రణరంగంగా మారింది.
శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించాలనే సీజేపీ పిలుపు మేరకు, ఉదయం విద్యార్థులు పోలీసులకు గులాబీ పువ్వులు ఇస్తూ పార్లమెంట్ మార్చ్‌ను ప్రారంభించారు. అయితే, సాయంత్రానికల్లా పరిస్థితి పూర్తిగా మారిపోయింది! పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులు పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా, భారీగా మోహరించిన భద్రతా బలగాలు వారిని కనుచూపు మేరలోనే అడ్డుకున్నాయి.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన నిరసన వేదికను పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు. సీజేపీ సోషల్ మీడియాలో పంచుకున్న చిత్రాల ప్రకారం.. ధ్వంసమైన వేదిక శిథిలాల మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం, విగ్రహం, భారత రాజ్యాంగ ప్రతి, శ్రీరామచరితమానస్, బైబిల్ గ్రంథాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
గులాబీలతో మొదలై.. రక్తసిక్తంగా మారింది!
ఈ నిరసన ప్రదర్శనకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని దిల్లీ పోలీసులు ఆదివారం రాత్రి ప్రకటించినప్పటికీ, వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు, పోలీసులు జంతర్ మంతర్ చుట్టూ ఇనుప బారికేడ్లతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో నిరసనకారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు అడుగులు వేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు సభ లోపల ఉన్నారు.
జనం ఒక్కసారిగా పెరిగిపోవడంతో, విద్యార్థులు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు బారికేడ్లు ఎక్కడానికి ప్రయత్నించారు. దీనితో భద్రతా దళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. పోలీసులు లాఠీలతో నిరసనకారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో దిల్లీ పోలీసులు విద్యార్థులను చెక్క లాఠీలతో కొట్టడం, పలువురు విద్యార్థుల తలలు పగిలి రక్తం కారడం, తీవ్రంగా గాయపడిన వారిని తోటి విద్యార్థులు మోసుకెళ్లడం కనిపించింది. కిందపడిపోయిన వారిని కూడా పోలీసులు విడిచిపెట్టకుండా కొట్టారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారులను కూడా వదలకుండా దాడి చేశారని సీజేపీ ఆరోపించింది.
"మమ్మల్ని ఉగ్రవాదులకంటే ఘోరంగా చూశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాపై రక్షకభటులే రాక్షసంగా విరుచుకుపడ్డారు," అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోలీసుల లాఠీఛార్జీలో ప్రముఖ సోషల్ మీడియా క్రియేటర్, ‘పీయింగ్ హ్యూమన్’ ఛానెల్ నిర్వాహకుడు రామిత్ వర్మ తీవ్రంగా గాయపడ్డారు. తల పగిలి తీవ్రంగా రక్తం కారుతున్న స్థితిలో ఆయన మాట్లాడుతూ.. "నా తలను పగలగొట్టారు" అని ఆవేదనతో చెప్పారు.
సోనమ్ వాంగ్‌చుక్ భార్యపై దాడి?
ఈ ఘర్షణలో ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మోపై కూడా దిల్లీ పోలీసులు దాడి చేశారని, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చేశారని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్, వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపించారు.
వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా, గత శనివారం పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.
విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు దౌర్జన్యానికి నిరసనగా, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి బెడ్‌పై నుంచే సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్లు చేతితో రాసిన లేఖ ద్వారా స్పష్టం చేశారు.
మరోవైపు, తమపై దాడులు, చేసి నిరసనకారుల దుస్తులు కూడా చింపేశారని మహిళా నిరసనకారులు ఆరోపించారు.
అయితే నిరసనకారులు చేసిన అనేక ఆరోపణలను దిల్లీ పోలీసులు ఖండించారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ఈ ప్రచారంలో నిజం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు" అని పేర్కొన్నారు. పరిస్థితిని ప్రొఫెషనల్‌గా హ్యాండిల్ చేశామని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించారు.
దీనిపై జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ నేహా బోరా తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారా? మేమందరం మీ హింసను ప్రత్యక్షంగా అనుభవించాం. దిల్లీ పోలీస్, మీకు సిగ్గుండాలి!" అని మండిపడ్డారు.
ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సమీపంలో నిరసనకారులపై దిల్లీ పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రోడ్లపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో విద్యార్థులు ఊపిరి ఆడక, కళ్లు మండుతూ పరుగులు తీశారు. కొందరు పోలీసులు ప్రదర్శనకారుల వైపు తుపాకులు ఎక్కుపెట్టి నిలబడటం కూడా వీడియోల్లో కనిపించింది.
అయితే తమపై నిరసనకారులు రాళ్లు రువ్వడంతో యాక్షన్ తీసుకున్నామని దిల్లీ పోలీసులు చెప్పారు. దానికి ఎలాంటి ఆధారాలు కనిపించకపోగా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా కనిపించాయి. పోలీసుల తరఫు నుంచే నిరసనకారులవైపు రాళ్లు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు కొన్ని లాఠీలకు మేకులు కూడా అమర్చి ఉండటాన్ని చూసి నిరసనకారులు షాక్ అయ్యారు.
ఈ ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అతిషి తీవ్రంగా స్పందించారు. "ఈ దేశ యువత రోడ్లపైకి వచ్చారు. శాంతియుత నిరసనకారులపై మానవత్వ రహితంగా లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ వాడటం సిగ్గుచేటు. నేను విద్యార్థులకు అండగా ఉంటాను," అని ప్రకటన విడుదల చేశారు.
తగ్గని నిరసన జ్వాలలు..
సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానం మేరకు సీజేపీ ప్రతినిధులు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు తెలిపారు:
ఆసుపత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే విడుదల చేయాలి.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
నీట్ అక్రమాల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించాలి.
అయితే, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన ఇవ్వలేదని సీజేపీ నేతలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగేదే లేదని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. దీనితో దిల్లీలో నిరసన జ్వాలలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
-గ్రౌండ్ రిపోర్టు, హిమానీ భండారి, కరిష్మ అయల్దసానీ, జిగ్నాస సిహ్నా, శివం ప్రతాప్ సింగ్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


