...
...
Next Story

E20 petrol : ప్రభుత్వానికి 'ఈ20' సెగ! ఎన్డీఏ ఓటర్లలోనే తీవ్ర అసంతృప్తి- సర్వేలో షాకింగ్ విషయాలు..

E20 petrol controversy : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ20 పెట్రోల్ వాడకంపై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మైలేజీ తగ్గిపోవడం, ఇంజన్లు పాడైపోతాయనే భయంతో.. అధికార ఎన్డీయే ఓటర్లే దీనికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది.

Published on: Jul 14, 2026, 07:58:20 IST
Advertisement

పెట్రోల్​లో 20శాతం ఇథనాల్​ని కలిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ20 ఫ్యూయల్​పై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న తరుణంలో తాజాగా వెలువడిన ఒక సర్వే.. అధికార ఎన్డీఏకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది! కేంద్ర ప్రభుత్వ విధానాలను సాధారణంగా సమర్థించే అధికార ఎన్డీయే ఓటర్లు సైతం ఈ20 పెట్రోల్​ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రఖ్యాత పోలింగ్ ఏజెన్సీ ‘సీ-ఓటర్’ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.

ఈ20 పెట్రోల్​పై ఎన్డీఏ ఓటర్లలోనే అసంతృప్తి!
ఈ20 పెట్రోల్​పై ఎన్డీఏ ఓటర్లలోనే అసంతృప్తి!

ఈ సర్వే ప్రకారం.. దాదాపు 52.5 శాతం మంది ఎన్డీయే మద్దతుదారులు తమ వాహనాల్లో ఈ20 పెట్రోల్ వాడటానికి సిద్ధంగా లేరని తేల్చి చెప్పారు. కేవలం 18.1 శాతం మంది మాత్రమే ఈ కొత్త ఇంధనానికి జై కొట్టగా, 29.5 శాతం మంది ఇంకా ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. ఇక విపక్షాల మద్దతుదారుల్లో ఈ వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉంది! వారిలో 57.9 శాతం మంది ఈ20 పెట్రోల్‌ను తిరస్కరించగా, ఇతర పార్టీల మద్దతుదారుల్లో 55 శాతం మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తంగా చూస్తే, దేశంలో 55.1 శాతం మంది వాహనదారులు ఈ20 వాడకాన్ని వ్యతిరేకిస్తుండగా, కేవలం 17.1 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారు!

గడ్కరీ సవాల్.. ఆందోళనకారుల కౌంటర్

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టిగా సమర్థించారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల నష్టపోయిన ఒక్క వ్యక్తిని చూపించినా తాము పరిశీలిస్తామంటూ ఆయన ఒక సవాల్ విసిరారు.

"కేంద్ర మంత్రి సవాల్‌ను మేము స్వీకరిస్తున్నాం, ఈ ఇంధనం వాడి నష్టపోయిన ఆరుగురు వ్యక్తులను ఆయన ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము," అని ఆందోళనకారులు ప్రతిస్పందించారు.

వాహనదారులు ఈ20 పెట్రోల్‌ను వద్దనడానికి అత్యంత ప్రధానమైన కారణం మైలేజీ పడిపోతుందనే భయమే. సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 52.8 శాతం మంది ఈ20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోతుందని బలంగా నమ్ముతున్నారు. వీరిలో ఎన్డీయే మద్దతుదారులు 51.2 శాతం మంది ఉండగా, విపక్షాల మద్దతుదారులు 55.4 శాతం మంది ఉన్నారు.

ఇథనాల్‌కు పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ శక్తి సామర్థ్యం ఉండటం వల్ల మైలేజీ కచ్చితంగా తగ్గుతుందని నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు.

మరోవైపు, ఇథనాల్ వల్ల ఇంజన్లు త్వరగా పాడైపోతాయనే ఆందోళన కూడా జనంలో బలంగా నాటుకుపోయింది. ఇథనాల్ మిశ్రమం వల్ల చాలా వాహనాల ఇంజన్ భాగాలు దెబ్బతింటాయని 54.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 10.9 శాతం మంది మాత్రమే దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని భావిస్తున్నారు.

పాత వాహనాల యజమానులకు అన్యాయం!

కొత్తగా వచ్చే వాహనాలు ఈ20 ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్నప్పటికీ, మార్కెట్లో తిరుగుతున్న పాత వాహనాల పరిస్థితి ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. పాత వాహనాలు ఈ అధిక ఇథనాల్ ఇంధనాన్ని తట్టుకోలేవని, ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్‌ను తప్పనిసరి చేయడం పాత వాహనదారులకు అన్యాయం చేయడమేనని 56.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ధర తగ్గించినా వద్దంటున్నారు.. ఎందుకంటే?

వాహనదారులకు తమకు నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఈ సర్వేలో స్పష్టమైంది. బంకుల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో పాటు సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని 75.9 శాతం మంది కోరుకుంటున్నారు.

ప్రభుత్వం ఇథనాల్ పెట్రోల్‌ను సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరకు విక్రయించాలని 74.5 శాతం మంది కోరుకుంటున్నప్పటికీ, ధర తగ్గించినంత మాత్రాన తాము ఈ20 వాడబోమని చాలా మంది తేల్చి చెబుతున్నారు. కేవలం 40.8 శాతం మంది మాత్రమే ధర తగ్గితే ఈ20 కి మారతామని చెప్పగా, మిగిలిన 40.4 శాతం మంది ధర తగ్గించినా తాము సాధారణ పెట్రోల్‌నే వాడతామని స్పష్టం చేయడం గమనార్హం.

ఈ సీ-ఓటర్ స్నాప్ పోల్ జులై 8- జులై 9 మధ్య దేశవ్యాప్తంగా కంప్యూటర్ సహాయంతో టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా 1,641 మంది అడల్ట్స్​ అభిప్రాయాలను సేకరించి రూపొందించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe