...
...
Next Story

MI vs RCB : సు….దీర్ఘంగా సాగిన ఎంఐ- ఆర్సీబీ మ్యాచ్​! ధురంధర్​ రన్​టైన్​ కన్నా ఎక్కువే! అసలిది టీ20యేనా?

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ చరిత్ర సృష్టించింది! ఏలాంటి అంతరాయం లేకుండా అత్యధిక సమయం సాగిన మ్యాచ్‌గా నిలిచింది. బాలీవుడ్ భారీ చిత్రం 'ధురంధర్: ది రివెంజ్' రన్-టైమ్‌ని కూడా అధిగమించింది.

Published on: Apr 13, 2026, 13:08:03 IST
Advertisement

MI vs RCB IPL 2026 : ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఎంఐ- ఆర్సీబీ మ్యాచ్​ క్రికెట్​ అభిమానులను ఒకింత చిరాకు పెట్టింది! మ్యాచ్​ మధ్యలో ఆటగాళ్లు చాలాసార్లు బ్రేక్​ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఫస్ట్​ ఇన్నింగ్స్​లో ముంబై ఇండియన్స్​ కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా తీసుకున్న బ్రేక్​లతో అందరు విసుగెత్తిపోయారు. ఫలితంగా ఈ టీ20 మ్యాచ్​ చాలా సుదీర్ఘంగా సాగిందన్న ఫీలింగ్​ కలిగింది. మీకు కూడా ఇదే అనిపించిందా? అనిపించడం మాత్రమే కాదు.. అది నిజం కూడా! ఇన్నేళ్ల ఐపీఎల్​ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన టీ20 మ్యాచ్​గా నిలిచింది ఈ ముంబై ఇండియన్స్​ వర్సెస్​ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు పోరు. దీనిపై ఇప్పుడు సోషల్​ మీడియాలో విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. చాలా మంది ఈ టీ20 మ్యాచ్​ని ఆదిత్య ధర్​ ధురంధర్​ రన్​టైమ్​తో పోల్చి మరీ మీమ్స్​ వేస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు..

సు...దీర్ఘంగా సాగిన ఐపీఎల్​ మ్యాచ్.. (BCCI)
సు...దీర్ఘంగా సాగిన ఐపీఎల్​ మ్యాచ్.. (BCCI)

ఐపీఎల్ ప్రారంభమై 19 ఏళ్లు కావస్తున్నా, ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ జరగలేదు. వర్షం వల్ల మ్యాచ్ ఆగలేదు, ఓవర్లు తగ్గించలేదు, ఆఖరికి 'సూపర్ ఓవర్' కూడా అవసరం పడలేదు. సరిగ్గా రాత్రి 7:30 గంటలకు మొదటి బంతి పడింది. కానీ మ్యాచ్ ముగిసేసరికి సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటిపోయింది! అంటే ఎంఐ వర్సెస్​ ఆర్సీబీ మధ్య జరిగిన ఈ ఐపీఎల్​ 2026 మ్యాచ్​ పూర్తవ్వడానికి 4 గంటల 22 నిమిషాల సమయం పట్టింది.

ఏలాంటి అంతరాయాలు లేకుండా ఇంత సుదీర్ఘంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.

ఇటీవలే విడుదలైన ఆదిత్య ధర్​ ధురంధర్​- ది రివేంజ్​ రన్​టైమ్​ 3 గంటల 50 నిమిషాలు. అంటే ఆ సినిమా టైమ్​ కన్నా ఈ మ్యాచే టైమే ఎక్కువ!

మొత్తంగా నిడివి పరంగా చూస్తే, ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో సుదీర్ఘమైన మ్యాచ్! 2020లో ముంబై ఇండియన్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ 5 గంటల 4 నిమిషాల పాటు సాగింది. అయితే, ఆ మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడటం వల్ల అంత సమయం పట్టింది. అలాగే 2023లో దిల్లీ-కోల్‌కతా, ఆర్సీబీ-గుజరాత్ మ్యాచ్‌లు కూడా 4 గంటల 50 నిమిషాల పైనే సాగాయి. కానీ, ఆ మ్యాచ్‌లన్నీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే చాలా ఆలస్యంగా మొదలయ్యాయి.

గణాంకాల విశ్లేషణ: సుదీర్ఘ మ్యాచ్‌ల జాబితా..

దిల్లీ వర్సెస్​ కేకేఆర్ (2023): సుమారు 4 గంటల 50 నిమిషాలు

ఆర్సీబీ వర్సెస్​ జీటీ (2023): సుమారు 4 గంటల 38 నిమిషాలు

ఎంఐ వర్సెస్ ఆర్సీబీ (2026): సుమారు 4 గంటల 22 నిమిషాలు

సీఎస్కే వర్సెస్​ ఎంఐ (2018): సుమారు 4 గంటల 15 నిమిషాలు

సమయానికి మొదలై, సూపర్ ఓవర్ లేకుండా సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లు:

ఎంఐ వర్సెస్​ ఆర్సీబీ (2026): 4 గంటల 22 నిమిషాలు (ప్రస్తుత రికార్డు)

ఎంఐ వర్సెస్ పంజాబ్ (2019): 4 గంటల 11 నిమిషాలు

సీఎస్కే వర్సెస్ ఆర్​ఆర్ (2019): 4 గంటల 11 నిమిషాలు

ఎల్​ఎస్​జీ వర్సెస్ సీఎస్కే (2025): 4 గంటల 00 నిమిషాలు

అన్నింటికంటే పెద్దది: 2023 ఐపీఎల్ ఫైనల్

అన్ని రకాల అడ్డంకులు, వర్షం, రిజర్వ్ డేలను పరిగణనలోకి తీసుకుంటే, 2023లో చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనది. ఆదివారం మొదలవ్వాల్సిన ఆ మ్యాచ్ వర్షం వల్ల సోమవారానికి వాయిదా పడింది. సోమవారం రాత్రి మొదలై, మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటలకు ముగిసింది. ప్రెజెంటేషన్ సెర్మనీ ముగిసేసరికి తెల్లవారుజామున 3 గంటలైంది. అంటే ఒక మ్యాచ్ పూర్తి కావడానికి ఏకంగా 30 గంటల 5 నిమిషాల సమయం పట్టింది.

శిక్షల నుంచి తప్పించుకున్న కెప్టెన్లు!

సాధారణంగా ఐపీఎల్‌లో 'స్లో ఓవర్ రేట్' విషయంలో బీసీసీఐ చాలా కఠినంగా ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయకపోతే కెప్టెన్లకు భారీ జరిమానాలు విధిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ (పంజాబ్), శుభ్‌మన్ గిల్ (జీటీ), రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్కే) శిక్షలు ఎదుర్కొన్నారు. అయితే, నిన్నటి మ్యాచ్ అర్ధరాత్రి వరకు సాగినా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌లపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వీరిద్దరూ ఈసారికి లక్కీగా తప్పించుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సోషల్​ మీడియాలో పేలుతున్న ట్రోల్స్​..

పాండ్యా పటీదార్​లను బీసీసీఐ వదిలేసినా.. సోషల్​ మీడియాలో మాత్రం ఎవరు వదలడం లేదు. ‘అసలు ఇది టీ20 మ్యాచేనా?’ అంటూ విరుచుకుపడుతున్నారు. సగంలోనే టీవీ కట్టేసి పడుకున్నాము అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

కారణాలు ఏంటి?

ఇన్నింగ్స్​లు ఆలస్యం అవ్వడం సర్వసాధారణం. అయితే వీటికి ఇంకొన్ని రూల్స్​ తోడవుతున్నాయి. ఉదాహరణకు.. వైడ్​, నో-బాల్​కి ఇప్పుడు రివ్యూలు తీసుకునే ఆప్షన్​ ఉంది. థర్డ్​ అంపైర్​ నిర్ణయం చాలా లేటుగా వస్తోంది. ముంబై వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​లో ఇది స్పష్టంగా కనిపించింది. వీటికి తోడు బ్యాటర్లు విజృంభిస్తున్న వేళ బౌలర్లతో మాట్లాడుతూ లేదా వ్యూహాలు రచిస్తూ కెప్టెన్లు ఇంకా ఆలస్యం చేస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఐపీఎల్ 2026లో ముంబై-ఆర్సీబీ మ్యాచ్ ఎందుకు అంత సుదీర్ఘంగా సాగింది?

ఓవర్ల మధ్య సమయం ఎక్కువగా తీసుకోవడం, స్ట్రాటజిక్ టైమౌట్లు, డీఆర్ఎస్ రివ్యూల వల్ల సమయం పెరిగింది. ఏలాంటి బాహ్య అంతరాయం లేకుండా 4 గంటల 22 నిమిషాల పాటు సాగడం ఒక రికార్డు.

2. 'ధురంధర్: ది రివెంజ్' సినిమా రికార్డును ఇది ఎలా బ్రేక్ చేసింది?

'ధురంధర్' సినిమా నిడివి 3 గంటల 50 నిమిషాలు. ఈ క్రికెట్ మ్యాచ్ అంతకంటే 32 నిమిషాలు ఎక్కువ సేపు సాగింది. అంటే ఒక పూర్తి సినిమా కంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ ఎక్కువ సమయం ప్రేక్షకులను అలరించింది.

3. ఐపీఎల్ చరిత్రలో సూపర్ ఓవర్లతో కలిపి అత్యంత సుదీర్ఘ మ్యాచ్ ఏది?

2020లో జరిగిన ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్. ఇది 5 గంటల 4 నిమిషాల పాటు సాగింది. ఇందులో విజేతను తేల్చడానికి రెండు సూపర్ ఓవర్లు అవసరమయ్యాయి.

4. స్లో ఓవర్ రేట్ అంటే ఏxటి? దానికి శిక్ష ఏంటి?

నిర్ణీత సమయంలోగా బౌలింగ్ జట్టు తమ ఓవర్లను పూర్తి చేయకపోవడాన్ని స్లో ఓవర్ రేట్ అంటారు. దీనివల్ల కెప్టెన్‌కు రూ. 12 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe