Car Insurance guide : కొత్త కారు కొంటున్నారా? ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ చెక్​లిస్ట్​ మర్చిపోకండి..

Car Insurance : కొత్త కారు కొనేటప్పుడు కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సరిపోదు. కారు విలువ, రిపేర్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీరో డిప్రిసియేషన్, రిటర్న్-టు-ఇన్‌వాయిస్, ఇంజన్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్స్‌తో కూడిన కాంప్రహెన్సివ్ ప్లాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.

Published on: Jun 16, 2026, 10:43:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Car Insurance Checklist : సరికొత్త కారును ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఉండే సంతోషమే వేరు! అయితే, అదే సమయంలో కారు భద్రత కోసం సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం అంతే ముఖ్యం. చాలామంది అవగాహన లేక డీలర్ ఇచ్చిన పాలసీనో లేదా కేవలం చట్టపరమైన నిబంధనల కోసం తక్కువ ధరకు వచ్చే థర్డ్ పార్టీ పాలసీనో తీసుకుంటారు. కానీ కొత్త కారు కొనేటప్పుడు థర్డ్ పార్టీ పాలసీతో పాటు సొంత నష్టాన్ని కవర్ చేసే 'ఓన్ డ్యామేజ్' కవర్ కలిపి ఉన్న ‘కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను ఎంచుకోవడమే అత్యంత సురక్షితం. కారు విలువ, దాని రిపేర్ ఖర్చులు ఎక్కువగా ఉండే ప్రారంభ సంవత్సరాల్లో సరైన యాడ్-ఆన్స్​తో కూడిన పాలసీ మాత్రమే మీ వాహనానికి పూర్తి రక్షణ ఇస్తుంది.

కొత్త కారు ఇన్సూరెన్స్ టిప్స్​..
కొత్త కారు ఇన్సూరెన్స్ టిప్స్​..

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. మీ కారు వల్ల ఇతరులకు లేదా వారి ఆస్తులకు జరిగే నష్టాన్ని మాత్రమే ఇది చెల్లిస్తుంది. కానీ, మీ సొంత కారుకు జరిగే నష్టానికి ఇందులో ఒక్క రూపాయి కూడా రాదు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం మీరు కొత్త కారు కొన్నప్పుడు పాలసీలు బండిల్‌గా వస్తాయి. ఇందులో 3 ఏళ్ల కాలపరిమితికి థర్డ్ పార్టీ కవర్, అలాగే 1 ఏడాది కాలపరిమితికి ఓన్-డ్యామేజ్ కవర్ కలిసి ఉంటాయి. ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు లేదా దొంగతనం జరిగినప్పుడు మీ కారు రిపేర్ ఖర్చులను ఈ ఓన్-డ్యామేజ్ కవర్ భరిస్తుంది.

కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మీ కారు దొంగతనానికి గురైనా లేదా పూర్తిగా ధ్వంసమైనా ఇన్సూరెన్స్ కంపెనీ గరిష్టంగా ఎంత మొత్తం చెల్లిస్తుందో నిర్ణయించే ఐడీవీ (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ)ని లాక్ చేస్తారు. దీనితో పాటు ప్రతి కార్ ఓనర్ తప్పనిసరిగా రూ. 15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను కూడా కలిగి ఉండాలి.

కారు ఇన్సూరెన్స్ చెక్‌లిస్ట్‌లో ఉండాల్సిన ముఖ్యమైన యాడ్-ఆన్స్ ఇవే..

యాడ్-ఆన్స్ అనేవి మీ అవసరాలకు అనుగుణంగా అదనపు ప్రీమియం చెల్లించి తీసుకునే రక్షణ కవర్లు. కొత్త కారుకు గరిష్ట రక్షణ కల్పించడానికి ఈ కింది యాడ్-ఆన్స్ మీ చెక్‌లిస్ట్‌లో ఖచ్చితంగా ఉండాలి.

జీరో డిప్రీసియేషన్ : క్లెయిమ్ సమయంలో మార్చిన విడిభాగాల తరుగుదల ఖర్చును ఇన్సూరెన్స్ కంపెనీ మినహాయించదు. దీనివల్ల మీకు దాదాపు పూర్తి రిపేర్ ఖర్చు చేతికి వస్తుంది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న కార్లకు ఇది బాగా సరిపోతుంది.

రిటర్న్ టు ఇన్‌వాయిస్ : ఒకవేళ మీ కారు దొంగతనానికి గురైనా లేదా రిపేర్ చేయలేనంతగా పూర్తిగా ధ్వంసమైనా.. మార్కెట్ విలువతో సంబంధం లేకుండా కారు కొన్నప్పుడు బిల్లుపై ఉన్న పూర్తి ఇన్‌వాయిస్ మొత్తాన్ని (రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్‌తో సహా) ఈ కవర్ ద్వారా పొందవచ్చు.

ఇంజన్ ప్రొటెక్షన్ : వరద నీరు చేరడం వల్ల లేదా ఆయిల్ లీకేజీల వల్ల కారు ఇంజన్ పాడైపోతే వచ్చే భారీ ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. సాధారణ పాలసీలు ఈ రకమైన కెమికల్ లేదా వాటర్ డ్యామేజ్‌లను కవర్ చేయవు.

నో-క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ : మీరు ఏడాది పొడవునా ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోతే వచ్చే బోనస్ డిస్కౌంట్​ని, ఒకవేళ చిన్న క్లెయిమ్ చేసుకున్నా కూడా దెబ్బతినకుండా ఈ కవర్ కాపాడుతుంది.

రోడ్‌సైడ్ అసిస్టెన్స్ : ప్రయాణాల మధ్యలో కారు టైర్ పంచర్ అయినా లేదా బ్రేక్‌డౌన్ అయి ఆగిపోయినా టోయింగ్ సేవలను, ఇతర అత్యవసర సహాయాన్ని ఈ కవర్ అందిస్తుంది.

స్మార్ట్ నిర్ణయాలు తీసుకోండిలా..

కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అందుబాటులో ఉన్న అన్ని యాడ్-ఆన్లను గుడ్డిగా కొనేయకూడదు! మీ డ్రైవింగ్ విధానం, మీరుండే ప్రాంతాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు, మీరు వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే నగరంలో ఉంటే ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ చాలా అవసరం. కారు లోన్​పై తీసుకున్నట్లయితే రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్ మంచి రక్షణ ఇస్తుంది. హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారికి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉపయోగపడుతుంది.

పాలసీ తీసుకునే ముందు ఆన్‌లైన్‌లో వివిధ కంపెనీల ప్రీమియం ధరలను, యాడ్-ఆన్ ఖర్చులను సరిపోల్చడం మంచిది. అలాగే వాలంటరీ డిడక్టబుల్ (క్లెయిమ్ సమయంలో కొంత మొత్తాన్ని మీరే భరిస్తానని అంగీకరించడం) ఎంచుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల ఫీచర్లు, ధరలను పక్కపక్కనే పెట్టి సులభంగా కంపేర్ చేయవచ్చు.

డబ్బులు చెల్లించే ముందు ఈ 6 విషయాలు సరిచూసుకోండి..

ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు కట్టే ముందు కేవలం ఒక నిమిషం కేటాయించి ఈ కింది వివరాలను తనిఖీ చేసుకుంటే.. భవిష్యత్తులో క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా కాపాడుకోవచ్చు:

మీ కారు అసలు విలువకు తగినట్లుగానే ఐడీవీ ఉందా? ప్రీమియం తగ్గించుకోవడం కోసం ఐడీవీని మరీ తక్కువగా సెట్ చేయకండి.

మీ పాత కారుకు సంబంధించిన నో-క్లెయిమ్ బోనస్ ఏదైనా ఉంటే, పాత కారు అమ్మిన 90 రోజులలోపు దానిని కొత్త కారు పాలసీకి బదిలీ చేసుకున్నారా?

ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన క్యాష్‌లెస్ గ్యారేజ్ నెట్‌వర్క్ మీ ఇల్లు, ఆఫీస్ పరిసరాల్లో అందుబాటులో ఉందో లేదో చూసుకోండి.

పాలసీలో ఏయే అంశాలకు ఇన్సూరెన్స్ వర్తించదో స్పష్టంగా చదవండి.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అందులో చేర్చి ఉందా లేదా చూసుకోండి.

మీ వ్యక్తిగత పత్రాలు (ఆర్​సీ, లైసెన్స్), కారు ఇంజన్, ఛాసిస్ నంబర్ వివరాలు పాలసీ బాండ్‌పై తప్పులు లేకుండా కరెక్ట్‌గా నమోదయ్యాయో లేదో చెక్ చేసుకోండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More