Changes from April 1 : నెలవారీ జీతాల నుంచి ట్యాక్స్​ వరకు- ఏప్రిల్​ 1 నుంచి కనిపించే భారీ మార్పులు ఇవే..

ఏప్రిల్ 1, 2026 నుంచి భారత కార్మిక, పన్ను చట్టాల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. శాలరీ స్ట్రక్చర్​ నుంచి పన్ను రిటర్న్స్ దాఖలు చేసే విధానం వరకు ప్రతిదీ మారనుంది. మీ పే-స్లిప్, పీఎఫ్ కంట్రిబ్యూషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలా ప్రభావితం అవుతాయో ఈ కథనంలో చూడండి..

Published on: Mar 29, 2026, 09:31:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత కార్మిక- పన్ను చట్టాలలో తీసుకువచ్చిన సమూల సంస్కరణలు ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. శాలరీ స్ట్రక్చర్​ ఎలా ఉండాలి అనే అంశం నుంచి ఒక యజమాని తన ఉద్యోగికి ఇవ్వాల్సిన బకాయిలను గరిష్టంగా ఎంతకాలం తన వద్ద ఉంచుకోవచ్చు అనే వరకు అన్ని విషయాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో పని చేసే ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే..

ఏప్రిల్​ 1 నుంచి భారీ ఆర్థిక మార్పులు..
ఏప్రిల్​ 1 నుంచి భారీ ఆర్థిక మార్పులు..

మీ పే-స్లిప్ ఇకపై పూర్తిగా మారిపోనుంది..

దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు బేసిక్ శాలరీని చాలా తక్కువగా, అంటే మొత్తం జీతంలో 25% నుంచి 40% మధ్య మాత్రమే ఉంచుతూ వచ్చాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్​), గ్రాట్యుటీకి చెల్లించాల్సిన వాటాను తగ్గించుకోవడానికి, ఉద్యోగి చేతికి వచ్చే జీతాన్ని ఎక్కువగా చూపించడానికి కంపెనీలు ఈ పద్ధతిని అనుసరించేవి. కానీ, ఇకపై ఆ పద్ధతి చెల్లదు.

21 నవంబర్ 2025న అమల్లోకి వచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లలో ఒకటైన 'కోడ్ ఆన్ వేజెస్, 2019' కింద, "వేతనాలు" అనే పదానికి ఒకే రకమైన నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (డీఏ), రిటైనింగ్ అలవెన్స్ కలిసి ఒక ఉద్యోగి మొత్తం సీటీసీలో కనీసం 50% ఉండాలి. ప్రైవేట్ రంగంలో డీఏ, రిటైనింగ్ అలవెన్సులు తక్కువగా ఉంటాయి కాబట్టి, చాలా కంపెనీలు ఈ నిబంధనను పాటించడానికి బేసిక్ పేను పెంచక తప్పదు. ఒకవేళ అలవెన్సులు 50% కంటే ఎక్కువగా ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని కూడా చట్టపరంగా వేతనంగానే పరిగణిస్తారు.

ఈ నియమం భారతదేశంలోని ప్రతి సంస్థకూ వర్తిస్తుంది. అది 20 మంది ఉన్న స్టార్టప్ అయినా లేదా 50,000 మంది ఉన్న భారీ కంపెనీ అయినా సరే, ఈ నిబంధన పాటించాల్సిందే.

ఏప్రిల్​ 1 నుంచి కనిపించే ఆర్థిక మార్పులు ఇవి..
ఏప్రిల్​ 1 నుంచి కనిపించే ఆర్థిక మార్పులు ఇవి..

రిటైర్మెంట్ కోసం ఎక్కువ.. ప్రస్తుత చేతికి తక్కువ!

బేసిక్ శాలరీ పెరగడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్, గ్రాట్యుటీ అనేవి బేసిక్ పే ఆధారంగానే లెక్కిస్తారు కాబట్టి, ఆ రెండు మొత్తాలు పెరుగుతాయి.

ఉద్యోగుల విషయానికి వస్తే, దీనివల్ల నెలవారీ చేతికి వచ్చే జీతం స్వల్ప కాలంలో కొంచెం తగ్గొచ్చు. కానీ, దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మీ రిటైర్మెంట్ నిధి భారీగా పెరుగుతుంది. పెరిగిన ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ సంవత్సరాల తరబడి జమ అయ్యి దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పొదుపుగా మారుతుంది. అలాగే, ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చే గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది, ఎందుకంటే గ్రాట్యుటీని చివరిగా తీసుకున్న బేసిక్ పే ఆధారంగా లెక్కిస్తారు.

యజమానులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సంస్కరణల వల్ల పీఎఫ్, గ్రాట్యుటీ రూపంలో కంపెనీలపై పడే చట్టపరమైన ఖర్చులు సుమారు 5% నుంచి 15% వరకు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, రిటైల్, బీపీఓ, హాస్పిటాలిటీ రంగంలోని కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఉద్యోగం మానేస్తున్నారా? రెండు రోజుల్లోనే మీ బకాయిలు అందుతాయి!

బహుశా ఉద్యోగులకు అత్యంత అనుకూలమైన సంస్కరణ ఇదే. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ సమయాన్ని భారీగా తగ్గించారు. పాత పద్ధతిలో.. ఉద్యోగం మానేసిన వారు తమ జీతం, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర బకాయిల కోసం 30 నుంచి 90 రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఇది కొత్త ఉద్యోగంలో చేరే సమయంలో వారికి ఆర్థిక ఇబ్బందులను కలిగించేది.

కానీ 'కోడ్ ఆన్ వేజెస్, 2019' లోని సెక్షన్ 17(2) ప్రకారం, ఒక ఉద్యోగి రాజీనామా చేసినా, తొలగించినా లేదా మరే ఇతర కారణం చేత విడిపోయినా, వారి చివరి పని దినం నుంచి రెండు పని దినాలలోపే వేతన సంబంధిత బకాయిలన్నీ కంపెనీ చెల్లించాలి. సెటిల్‌మెంట్ ఆలస్యం చేయడం అనేది ఇకపై కేవలం చెడ్డ పద్ధతి మాత్రమే కాదు, అది చట్ట ఉల్లంఘన అవుతుంది. బాధితులు లేబర్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించి, ఆలస్యమైన పేమెంట్లకు వడ్డీని కూడా క్లెయిమ్ చేయవచ్చు.

అయితే, గ్రాట్యుటీ (దీనికి 30 రోజుల సమయం ఉంటుంది), ఈపీఎఫ్ బదిలీలు ఈ 'రెండు రోజుల నిబంధన' కిందకు రావు.

65 ఏళ్ల పాత ఆదాయపు పన్ను చట్టానికి రిటైర్మెంట్..

ఆరు దశాబ్దాలకు పైగా అమల్లో ఉన్న, వేలకొద్దీ సవరణలతో 800 సెక్షన్ల గందరగోళంగా మారిన 'ఆదాయపు పన్ను చట్టం, 1961' స్థానంలో ఏప్రిల్ 1, 2026 నుంచి 'కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025' అమల్లోకి వస్తుంది.

ఆగస్టు 2025లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ కొత్త చట్టం పన్ను రేట్లు లేదా మినహాయింపులను మార్చదు. కానీ చట్టాన్ని చాలా స్పష్టమైన భాషలో తిరిగి రాశారు. సెక్షన్లను 819 నుంచి 536కు, చాప్టర్లను 47 నుంచి 23కు తగ్గించారు. సామాన్య పన్ను చెల్లింపుదారులకు కూడా చట్టం సులభంగా అర్థం కావాలనేది ప్రభుత్వం లక్ష్యం.

ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే: 31 మార్చి 2026 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం (1961) పరిధిలోనే ఉంటుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న అప్పీళ్లు, విచారణలు ముగిసే వరకు పాత చట్టం ప్రకారమే నడుస్తాయి.

గుడ్‌బై 'అసెస్‌మెంట్ ఇయర్'.. వెల్కమ్ 'టాక్స్ ఇయర్'!

పాత పన్ను విధానంలో అత్యంత గందరగోళానికి గురిచేసే అంశం - 'ప్రీవియస్ ఇయర్' (ఆదాయం సంపాదించిన సంవత్సరం), 'అసెస్‌మెంట్ ఇయర్' (పన్ను లెక్కించే సంవత్సరం). ఇకపై ఆ గందరగోళం ఉండదు.

కొత్త చట్టం ఈ రెండు పదాలను తొలగించి కేవలం 'టాక్స్ ఇయర్' అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2027 మధ్య సంపాదించిన ఆదాయాన్ని కేవలం 'టాక్స్ ఇయర్ 2026-27' అని పిలుస్తారు. రిటర్న్స్ దాఖలు చేసేది కూడా ఇదే సంవత్సరానికే అవుతుంది.

రిటర్న్స్ సరిదిద్దుకోవడానికి అదనపు సమయం..

ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి ఇచ్చే సమయాన్ని 9 నెలల నుంచి 12 నెలలకు పెంచారు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. 9 నెలల గడువు దాటిన తర్వాత రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేస్తే మాత్రం ప్రత్యేక రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఖర్చు లేకుండా రివైజ్ చేయాలనుకునే వారు పాత పద్ధతిలోనే 9 నెలల లోపు పూర్తి చేయాలి.

విదేశీ ప్రయాణాలు చేసే వారికి టీసీఎస్ ఊరట..

విదేశీ టూర్లు వెళ్లేవారు లేదా విదేశాల్లో విద్య, వైద్యం కోసం ఖర్చు చేసే వారికి కేంద్ర బడ్జెట్ 2026లో ప్రకటించిన టీసీఎస్ తగ్గింపు ఏప్రిల్ 1 నుండి వర్తిస్తుంది.

గతంలో విదేశీ టూర్ ప్యాకేజీలపై రూ. 7 లక్షల లోపు 5%, ఆ పైన 20% టీసీఎస్ ఉండేది. ఏప్రిల్ 1 నుంచ ఎటువంటి పరిమితి లేకుండా అన్నింటికీ 2% ఫ్లాట్ రేటు వర్తిస్తుంది. అలాగే విదేశీ విద్య, వైద్యం కోసం పంపే నిధులు (ఎల్​ఆర్​ఎస్​ కింద రూ. 10 లక్షలు దాటితే) కూడా ఇదే 2% సరళీకృత రేటుకు మారుతాయి. దీనివల్ల మీ పన్ను భారం తగ్గదు గానీ, ముందే కట్టాల్సిన నగదు తక్కువగా ఉండి మీ దగ్గర డబ్బులు అందుబాటులో ఉంటాయి.

సావరిన్ గోల్డ్ బాండ్స్​పై పన్ను మార్పు..

గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టేవారు ఒక ముఖ్యమైన మార్పును గమనించాలి. ఇప్పటివరకు ఎస్‌జీబీ మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభాలపై ఎటువంటి పన్ను ఉండేది కాదు. మీరు ఆ బాండ్‌ను నేరుగా ఆర్బీఐ దగ్గర కొన్నా లేదా స్టాక్ మార్కెట్‌లో కొన్నా ఈ మినహాయింపు ఉండేది.

కానీ ఏప్రిల్ 1 నుంచి, ఈ పన్ను మినహాయింపు కేవలం ఆర్బీఐ ద్వారా నేరుగా కొన్న వారికి మాత్రమే ఉంటుంది. మీరు స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి బాండ్లు కొనుగోలు చేసి ఉంటే, మెచ్యూరిటీ లాభాలపై ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (12.5%) లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More