...
...
Next Story

PMOS : పీసీఓఎస్​ కాదు.. ఇకపై పీఎమ్​ఓఎస్​! పేరు ఎందుకు మార్చారు అంటే..

PCOS : మహిళల్లో ఉండే పీసీఓఎస్​ సమస్యను ఇప్పుడు పీఎమ్​ఓఎస్​గా పిలువనున్నారు. దశాబ్ద కాలం పాటు సాగిన చర్చలు, పరిశోధనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు పేరును ఎందుకు మార్చారు? పేరు మార్పుతో ప్రయోజనాలు ఏంటి?

Published on: May 13, 2026 02:30 PM IST
Advertisement

PCOS renamed to PMOS 2026 : ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మంది మహిళల్లో ఒకరిని వేధిస్తున్న హార్మోన్ల సమస్య ‘పీసీఓఎస్’ (Polycystic Ovary Syndrome) పేరును మారుస్తూ వైద్య నిపుణులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఇకపై ‘పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్’ (Polyendocrine Metabolic Ovarian Syndrome - PMOS) అని పిలవనున్నారు.

పీసీఓఎస్​ కాదు.. ఇకపై పీఎమ్​ఓఎస్​!
పీసీఓఎస్​ కాదు.. ఇకపై పీఎమ్​ఓఎస్​!

గత 14 ఏళ్లుగా రోగులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ పేరు మార్పు ఖరారైంది. దీనికి సంబంధించిన పరిశోధన పత్రం తాజాగా ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’లో ప్రచురితమైంది. పాత పేరు వల్ల రోగుల్లో తప్పుడు అవగాహన ఏర్పడుతోందని, సరైన చికిత్స అందడం లేదని నిపుణులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

పేరు ఎందుకు మార్చారు?

చాలా మంది పీసీఓఎస్ అంటే కేవలం 'అండాశయాల్లో నీటి బుడగలు' (క్రిస్ట్స) మాత్రమే అని పొరపడుతుంటారు. వాస్తవానికి అండాశయాల్లో ఉండేవి బుడగలు కావు, అవి ఎదగకుండా ఆగిపోయిన ఫాలికల్స్.

పాత పేరు వల్ల ఇది కేవలం అండాశయాలకు సంబంధించిన సమస్యగా మాత్రమే అని అనుకుంటున్నారు. కానీ, ఇది శరీరంలోని హార్మోన్లు, మెటబాలిజం, మానసిక ఆరోగ్యం, శరీరానికి సంబంధించిన సంక్లిష్ట సమస్య.

కొత్త పేరు ‘పీఎమ్ఓఎస్’ ద్వారా ఇది ఒక హార్మోన్ల, జీవక్రియ సంబంధిత వ్యాధి అని స్పష్టమవుతుంది. దీనివల్ల డాక్టర్లు మరింత సమగ్రంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

పీఎమ్​ఓఎస్ లక్షణాలు - ఎలా గుర్తించాలి?

పీఎమ్ఓఎస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి, అందుకే దీనిని గుర్తించడం డాక్టర్లకు కూడా కష్టమవుతుంది:

అధిక ఆండ్రోజన్లు: శరీరంలో పురుష హార్మోన్లు పెరగడం వల్ల తీవ్రమైన మొటిమలు, ముఖం లేదా ఛాతీపై అవాంఛిత రోమాలు రావడం లేదా జుట్టు పల్చబడటం.

టీనేజ్ అమ్మాయిల్లో: అమ్మాయిల్లో ఈ సమస్యను నిర్ధారించాలంటే అటు నెలసరి సమస్యలు, ఇటు ఆండ్రోజన్లు ఎక్కువగా ఉన్నట్లు రక్తపరీక్షల్లో గానీ, శారీరక లక్షణాల్లో గానీ కనిపించాలి.

సంతానలేమి, గర్భధారణ సమస్యలు..

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నిపుణుల ప్రకారం, మహిళల్లో సంతానలేమికి పీఎమ్ఓఎస్ ప్రధాన కారణం.

అండం సరిగ్గా విడుదల కాకపోవడం వల్ల గర్భం దాల్చడం కష్టమవుతుంది.

ఈ సమస్య ఉన్న గర్భిణుల్లో గెస్టేషనల్ డయాబెటిస్ లేదా నెలలు నిండకుండానే ప్రసవం వంటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకుంటే పీఎమ్ఓఎస్ ఉన్నవారు కూడా విజయవంతంగా గర్భం దాల్చవచ్చు.

చికిత్స మార్గాలు - ఇన్సులిన్ పాత్ర కీలకం!

పీఎమ్ఓఎస్ నియంత్రణకు మొదటి ప్రాధాన్యత జీవనశైలి మార్పులకే ఇవ్వాలి:

ఆహారం, వ్యాయామం: ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం అత్యవసరం.

సైన్స్ ఏంటి? : ఈ సమస్య ఉన్న మహిళల్లో ‘ఇన్సులిన్’ హార్మోన్ అధికంగా ఉంటుంది. ఈ ఇన్సులిన్ అండాశయాలను తప్పుదోవ పట్టించి ఎక్కువ ‘టెస్టోస్టెరాన్’ (పురుష హార్మోన్) ఉత్పత్తి చేసేలా చేస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ వల్లే అన్ని లక్షణాలు కనిపిస్తాయి.

మందులు: మెట్‌ఫార్మిన్ వంటి ఇన్సులిన్ మందులు, ఆండ్రోజన్లను అడ్డుకునే మందులు, హార్మోనల్ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడవచ్చు. అయితే, గర్భం దాల్చాలనుకునే వారు సంతానోత్పత్తి చికిత్సలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

పీసీఓఎస్​ని పీఎమ్​ఓఎస్​గా మార్పడం కేవలం అక్షరాల మార్పు మాత్రమే కాదు, మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి,ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులకు ఒక దిశానిర్దేశం చేయడానికి తీసుకున్న గొప్ప నిర్ణయం అని వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe