Delhi Blast : కారు నడిపిన వ్యక్తి ఇతనే! ఉగ్ర కుట్ర భగ్నం అవ్వడంతో భయపడి..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ పేలుడు ఘటనలో హ్యుందాయ్ ఐ20 నడిపిన వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. అతను సూసైడ్ బాంబర్‌గా అనుమానిస్తున్నారు. పేలుడులో అతను మరణించాడని అధికారులు భావిస్తున్నారు.
దిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌కి సంబంధించిన మొదటి చిత్రం తాజాగా బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిపోయి, 8మంది మందిని బలిగొని, 20 మందికి పైగా ప్రజలను గాయపరిచిన హ్యుందాయ్ ఐ20 కారుకు యజమాని ఈ డాక్టర్ ఉమర్!

ఉమర్ మొహమ్మద్ నేపథ్యం, ఉగ్రవాద సంబంధాలు
ఉమర్ మొహమ్మద్ 1989 ఫిబ్రవరి 24న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జన్మించాడు. అతను అల్ ఫలా మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. జమ్ముకశ్మీర్, హరియాణా పోలీసు బృందాలు ఛేదించిన “వైట్ కాలర్” ఉగ్రవాద మాడ్యూల్‌లో సోమవారం అరెస్టు అయిన డాక్టర్ అదీల్ అహ్మద్ రథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌కు ఉమర్ అత్యంత సన్నిహితుడు.
దర్యాప్తు అధికారులు తమ మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేసి, గత కొద్ది రోజుల్లో 2,900 కిలోల అనుమానాస్పద పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న వెంటనే డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుంచి పారిపోయాడు. అరెస్టుకు లొంగిపోకుండా, నిరాశతో ఉమర్ ఉద్దేశపూర్వకంగానే ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 సమీపంలో పేలుడు పదార్థాలు నింపిన హ్యుందాయ్ ఐ20 కారును పేల్చివేసి ఉంటాడని మీడియా వర్గాలు తెలిపాయి.
పేలుడుకు వాడిన పదార్థాలు, కుట్ర కోణం
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఘటనను ఉగ్రదాడి అని భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇది ఫిదాయీన్ తరహా ఉగ్రదాడిగా ఉందని మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి.
"పారిశ్రామిక పేలుడు పదార్థాలలో సర్వసాధారణంగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ అనే అత్యంత మండే మిశ్రమాన్ని ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు ఈ దాడిలో ఉపయోగించి ఉండవచ్చు," అని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ దాడి ఫిదాయీన్ తరహా ఆపరేషన్ లక్షణాలను కలిగి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
ఉమర్ ఈ పేలుడును మరో ఇద్దరితో కలిసి ప్లాన్ చేసి, అమలు చేశాడని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
ప్రధాన అనుమానాలు, తదుపరి చర్యలు..
పేలుడు సంభవించిన సమయంలో డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఐ20 కారులోనే ఉండి ఉంటాడని అగ్రశ్రేణి ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి కొన్ని గంటల ముందు కారులో ముగ్గురు ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైందని ఓ జాతీయ మీడియా తెలిపింది. కానీ పేలుడు జరిగినప్పుడు కారులో ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి, అతనే ఉమర్ అని వర్గాలు పేర్కొన్నాయి.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ దిల్లీలో పేలిన హ్యుందాయ్ ఐ20 కారు అనేకమార్లు చేతులు మారింది. ఈ కారు మొదటి ఓనర్ పేరు సల్మాన్. 2025 మార్చ్‌లో కారు దేవందర్ చేతుల్లోకి వెళ్లింది. అనంతరం ఈ కారును జమ్మకశ్మీర్‌లోని పుల్వామా నివాసి అయిన తారిఖ్ కొనుగోలు చేశాడని ఆరోపణ. అతన్ని ప్రస్తుతం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో తారిఖ్‌కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది.
కారులో నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహం ఉమర్‌దేనా? అని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఉమర్ కొద్ది నెలలుగా పరారీలో ఉన్నాడని, ఉత్తర భారతదేశంలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించిన పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని సమాచారం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


