...
...
Next Story

Rains in India : దేశవ్యాప్తంగా వరుణుడి ప్రళయం! మహారాష్ట్ర, ఒడిశాలో భారీ నష్టం- అక్కడ రెడ్​ అలర్ట్..

Mumbai Rains : భారతదేశాన్ని రుతుపవన వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల వల్ల పలు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ వర్షాల ధాటికి మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రాణనష్టం సంభవించగా, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

Published on: Jul 7, 2026, 09:09:11 IST
Advertisement

జూన్​ నెలలో దాదాపు కనిపించని నైరుతి రుతుపవనాలు.. జులైలో మాత్రం ఉగ్రరూపం దాల్చాయి! దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురు గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. సోమవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా, వందలాది ఇళ్లు నీట మునిగాయి. వాతావరణ తీవ్రతను గమనించిన అధికారులు రంగంలోకి దిగి అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ముంబై మహానగరంలో స్తంభించిన జీవనం.. రెడ్ అలర్ట్ జారీ!

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..

మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పుణె జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలకు మరో ముగ్గురు బలవడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 16కు చేరింది. రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాలైన థాణే, రాయగఢ్‌లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలుల ధాటికి వందలాది చెట్లు, భారీ ప్రకటనల బోర్డులు కుప్పకూలాయి. రాబోయే గంటల్లో ముంబై నగరంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

రవాణా వ్యవస్థపైనా ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై కొత్తగా ప్రారంభించిన 'మిస్సింగ్ లింక్' విభాగంలో ఒక కాంక్రీట్ పిల్లర్ రోడ్డుపై కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. దీనితో పాత, కొత్త హైవేలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. పశ్చిమ రైల్వే పరిధిలో పట్టాలపై నీరు చేరడంతో 40కి పైగా రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా మళ్లించడం చేశారు. ముంబై రావాల్సిన ఐదు విమానాలను వేరే విమానాశ్రయాలకు మళ్లించారు.

మరోవైపు విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

ఉత్తరాదిలో కొండచరియల బీభత్సం!

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు సైతం వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. హిమాచల్‌లో రాత్రికి రాత్రే కురిసిన భారీ వర్షాలకు చంబా-తిస్సా, లార్జీ-సాయింజ్ రోడ్లు కొట్టుకుపోయాయి. ఒక ఇల్లు కూలిన ఘటనలో 14 ఏళ్ల బాలిక మరణించింది.

జమ్ముకశ్మీర్‌లోని డోడా-కిష్త్వార్ జాతీయ రహదారిపై ఆకస్మిక వరదలు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మాణంలో ఉన్న క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు సమీపంలో పలు వాహనాలు వరద మట్టిలో పూడుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మధ్య భారతదేశంలో పొంగిపొర్లుతున్న నదులు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా వైపు కదలడంతో మధ్య భారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని శివనాథ్, ఖారున్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం హై అలర్ట్‌లో ఉంది.

మరీ ముఖ్యంగా ఒడిశాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా తకుర్ముండ అనే ప్రాంతంలో గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 2ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సంబల్​పూర్​ శివారులో డ్రైనేజీ పొంగడం వల్ల ఓ 45ఏళ్ల వ్యక్తి గల్లంతయ్యాడు. సంబల్‌పూర్ నగరంలో ఇళ్లలోకి నీరు చేరడంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, సుమారు 270 మంది బాధితులకు ఉచిత భోజన వసతి కల్పించినట్లు జిల్లా కలెక్టర్ సిద్ధేశ్వర్ బాలిరామ్ బోందర్ తెలిపారు.

రానున్న రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్​నారు.

ఇక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, కోటా, భరత్‌పూర్ డివిజన్లలో రాబోయే ఐదారు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe