GT vs RR : వైభవ్ సూర్యవంశీని ఔట్ చేస్తే ఫైనల్‌కే! గిల్ వ్యూహం ఏంటి? నేడే ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2
GT vs RR qualifier 2 : నేటి రాత్రి జరగనున్న ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆర్సీబీతో ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో క్వాలిఫైయర్ 2 వెదర్ రిపోర్టు, పిచ్ రిపోర్టు, స్టాట్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
IPL 2026 qualifier 2 : ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 ఎడిషన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అందరి చూపు యంగ్ గన్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఈ 15ఏళ్ల బుడ్డోడి బ్యాటింగ్‌కి అందరు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కీలక మ్యాచ్ వెదర్ రిపోర్టు, పిచ్ రిపోర్టు, ఇరు జట్ల స్టాట్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2- ఎప్పుడు? ఎక్కడ?
చంఢీగఢ్లోని మహారాజ యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జీటీ వర్సెస్ ఆర్ఆర్ మధ్య క్వాలిఫైయర్-2 జరగనుంది. జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2- వెదర్ రిపోర్టు ఏంటి?
చండీగఢ్‌లో వాతావరణం వేడిగా ఉండనుంది. కానీ మధ్యాహ్నం నాటికి స్వల్పంగా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మ్యాచ్ నాటికి పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు అని వెదర్ రిపోర్టు సూచిస్తోంది.
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2- పిచ్ రిపోర్టు ఏంటి?
జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగే ఈ పిచ్ బౌన్స్‌కి, పేస్‌కి సహకరించవచ్చు. పిచ్‌పై స్వల్పంగా ఉన్న గడ్డి వల్ల బౌలర్లకు అధిక పేస్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బాల్ పాతదయ్యే కొద్ది బ్యాటర్లు విజృంభించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2- జీటీ వర్సెస్ ఆర్ఆర్ స్టాట్స్..
గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు 10 మ్యాచులు జరిగాయి. వీటిల్లో జీటీ 7సార్లు, ఆర్ఆర్ 3సార్లు గెలిచాయి. అయితే గత 4 మ్యాచుల్లో మాత్రం రెండు జట్లు 2-2 విజయాలతో సమానంగా ఉన్నాయి.
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2- వైభవ్ సూర్యవంశీని ఆపితే చాలు!
ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 97 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపునకు బాట వేసిన వైభవ్ సూర్యవంశీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది! 15ఏళ్ల పిల్లోడిని కట్టడి చేయడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు డీలా పడ్డారు. మరి గుజరాత్ టైటాన్స్ ఏం చేస్తుందో? అతడిని ఎలా ఔట్ చేస్తుందో? ఎలాంటి వ్యూహం రచిస్తోందో? అన్న ఆసక్తి నెలకొంది. పరిస్థితి ఎలా ఉందంటే.. వైభవ్ సూర్యవంశీని త్వరగా ఔట్ చేస్తే చాలు గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 ఫైనల్‌కి వెళ్లిపోతుంది అని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
అయితే, సూర్యవంశీ ఒక్కడే కాదు.. పేసర్ జోఫ్రా ఆర్చర్ సైతం జట్టు గెలుపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్, వికెట్లతోనే కాదు.. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటింగ్‌తోనూ సత్తా చాటుతున్నాడు.
అటు గుజరాత్ టైటాన్స్ పేపర్ మీద చూసుకుంటే పటిష్టంగానే ఉంది. టాప్-3 బ్యాటర్లు బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు. సిరాజ్, రబాడా, రషీద్‌లతో బౌలింగ్ యూనిట్ సైతం బలంగానే ఉంది.
అయితే, గుజరాత్ టైటాన్స్.. టాప్-3 బ్యాటర్ల మీదే అధికంగా డిపెండ్ అవుతోంది! ఈ లీగ్‌లో ఈ జట్టు సాధించిన స్కోర్‌లో సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్, జాస్ బట్లర్‌ల వాటానే దాదాపు 70శాతం వరకు ఉంటుంది! వీరు త్వరగా ఔట్ అయితే, ఇక జీటీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు. మిడిల్ ఆర్డర్ రాణించడమే లేదు. ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్ 1లో ఇది స్పష్టంగా కనిపించింది.
మరీ ముఖ్యంగా గిల్‌పై ఆర్చర్‌కి మంచి రికార్డే ఉంది. 7 టీ20 ఇన్నింగ్స్‌ల్లో గిల్‌ని ఆర్చర్ మూడుసార్లు ఔట్ చేశాడు. అతనిపై గిల్ స్ట్రైక్ రేట్ 120గా ఉంది. యావరేజ్ కేవలం 7.2! ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి జరగనున్న క్వాలిఫైయర్ 2లో వీరి మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.
ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2- జీటీ వర్సెస్ ఆర్ఆర్ జట్లు (అంచనా)..
రాజస్థాన్ రాయల్స్- యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), దొనొవాన్ ఫెర్రెరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, యష్ రాజ్ పుంజ, బ్రిజేష్ శర్మ, సుశాంత్ మిశ్రా/ తుషార్ దేశ్‌పాండే/ రవి బిష్ణోయి.
గుజరాత్ టైటాన్స్- సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), జాస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/ సాయి కిషోర్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


