...
...
Next Story

‘భారత్​కు మించిన మిత్రదేశం అమెరికాకు లేదు’- ఇండియాలో ట్రంప్ పర్యటన!

భారత్-అమెరికా సంబంధాలపై అమెరికా రాయబారి సెర్గే గోర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​కు మించిన మిత్రదేశం అమెరికాకు లేదని ఆయన అన్నారు. ట్రంప్​ సైతం ఇండియాలో పర్యటించే అవకాశం ఉందని వివరించారు.

Published on: Jan 13, 2026, 09:10:34 IST
Advertisement

భారతదేశం అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, ఇండియాకు మించిన దేశం మరొకటి లేదని అమెరికా రాయబారిగా నామినేట్ అయిన సెర్గియో గోర్ వెల్లడించారు. మంగళవారం (జనవరి 13) నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన తదుపరి విడత చర్చలు పునఃప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా రాయబార కార్యాలయంలో దక్షిణాసియా, మధ్య ఆసియా ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న గోర్.. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని కీలక సంకేతాలిచ్చారు.

ప్రధాని మోదీ- ట్రంప్​..
ప్రధాని మోదీ- ట్రంప్​..

దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో మాట్లాడిన గోర్.. ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఉన్న స్నేహం "నిజమైనది" అని అభివర్ణించారు. నిజమైన మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజమని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడంలోనే గొప్పతనం ఉందని ఆయన పేర్కొన్నారు.

భారత్-అమెరికా: 'నిజమైన మిత్రులు..'

"అమెరికా, భారత్ కేవలం ఉమ్మడి ప్రయోజనాల కోసమే కాదు.. అత్యున్నత స్థాయి గౌరవంతో కూడిన బలమైన బంధంతో ముడిపడి ఉన్నాయి. నిజమైన మిత్రుల మధ్య విబేధాలు రావచ్చు, కానీ చివరికి వారు వాటిని పరిష్కరించుకోగలరు," అని గోర్ తన ప్రసంగంలో వెల్లడించారు.

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశమని, ఇలాంటి దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కొలిక్కి తీసుకురావడం అంత సులభమైన పని కాదని ఆయన అంగీకరించారు. అయితే దీన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదలతో తాము ఉన్నామని గోర్ తెలిపారు. కేవలం వాణిజ్యమే కాకుండా భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఇంధనం, సాంకేతికత, విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని వివరించారు.

ఇండియాలో ట్రంప్​ పర్యటన..!

ఒక కీలక ప్రకటన చేస్తూ.. ‘పాక్స్ సిలికా’ కూటమిలో సభ్యత్వం పొందాల్సిందిగా భారత్‌ను ఆహ్వానిస్తున్నట్లు గోర్ తెలిపారు. వచ్చే నెలలో భారత్ ఈ కూటమిలో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరుతుందని ఆయన వెల్లడించారు.

సురక్షితమైన, పటిష్టమైన, సరికొత్త ఆవిష్కరణలతో కూడిన 'సిలికాన్ సప్లై చైన్' (చిప్స్ తయారీ సరఫరా వ్యవస్థ)ను నిర్మించడం కోసం అమెరికా నేతృత్వంలో ఈ వ్యూహాత్మక కూటమి ఏర్పాటైంది.

వ్యాపార ఒప్పందంపై పట్టుదల..

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆయన సానుకూలంగా స్పందించారు. "చాలామంది నన్ను ట్రేడ్ డీల్ గురించి అడుగుతున్నారు. ఇరు పక్షాలు ప్రస్తుతం చురుగ్గా చర్చిస్తున్నాయి. నిజానికి మంగళవారం వాణిజ్య అంశంపై తదుపరి చర్చలు జరగనున్నాయి," అని గోర్ పేర్కొన్నారు. ప్రపంచ నాయకత్వంలో భారత్ పాత్ర అత్యంత కీలమని, వ్యూహాత్మక భాగస్వాములుగా ఇరు దేశాలు పరస్పర గౌరవంతో ముందుకు సాగుతాయని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks