PM Modi : వర్క్​ ఫ్రమ్ హోమ్ నుంచి కార్​ పూలింగ్​ వరకు.. ఇంధన సంక్షోభం వేళ దేశ ప్రజలకు మోదీ పిలుపు

PM Modi work from home : పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతిన్న నేపథ్యంలో, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు పెట్రోల్, డీజిల్, బంగారం వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. విదేశీ ప్రయాణాలకు బదులు స్వదేశీ పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Published on: May 11, 2026, 05:58:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Work from home Narendra Modi : పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా నిలిచిపోయి, చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారతీయులందరికీ ఒక శక్తిమంతమైన విజ్ఞప్తి చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

దేశభక్తికి కొత్త నిర్వచనం..

“దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు.. ఇలాంటి సంక్షోభ సమయాల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా మన విధులను నెరవేర్చడం కూడా ఒక రకమైన దేశభక్తే,” అని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల తలెత్తిన సరఫరా లోటును, పెరుగుతున్న ధరలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రతి భారతీయుడు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

పెట్రోల్, డీజిల్ ఆదా చేయండి.. మెట్రో ఎక్కండి!

పెరుగుతున్న చమురు దిగుమతి ఖర్చులను తగ్గించేందుకు ప్రధాని మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు:

  • సాధ్యమైనంత వరకు మెట్రోలు, బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించండి.
  • సొంత వాహనాల్లో వెళ్లేవారు ‘కార్ పూలింగ్’ విధానాన్ని అవలంబించాలి.
  • సరైన మౌలిక సదుపాయాలు ఉన్న చోట ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ప్రాధాన్యత ఇవ్వాలి.
  • వ్యాపార సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగ్స్ వంటి కోవిడ్ కాలపు పద్ధతులను మళ్లీ అనుసరించి ఇంధనాన్ని ఆదా చేయాలి.

బంగారం కొనొద్దు.. విదేశీ పెళ్లిళ్లు వద్దు!

దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకమని ప్రధాని నొక్కి చెప్పారు. అందుకే:

కనీసం ఏడాది పాటు అత్యవసరమైతే తప్ప బంగారం కొనకూడదని కోరారు.

విదేశీ విహారయాత్రలు, విదేశాల్లో జరిగే వివాహ వేడుకలకు స్వస్తి పలికి, స్వదేశీ పర్యటనలను ప్రోత్సహించాలని సూచించారు.

వంట నూనె వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలని, ఇది అటు దేశ ఆర్థిక ఆరోగ్యానికి, ఇటు ప్రజల వ్యక్తిగత ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.

రైతులకు, సామాన్యులకు విజ్ఞప్తి..

రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించి, డీజిల్ పంపుల స్థానంలో సోలార్ పంపులను వాడాలని ప్రధాని మోదీ కోరారు. అలాగే, మనం వాడే పాదరక్షలు, బ్యాగులు వంటి నిత్యావసర వస్తువులు కూడా ‘మేడ్ ఇన్ ఇండియా’వే అయి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ఏంటీ ఈ సంక్షోభం? హార్ముజ్ జలసంధిలో ఏం జరుగుతోంది?

ప్రస్తుత చమురు సంక్షోభానికి ప్రధాన కారణం ఇరాన్ యుద్ధం. ప్రపంచానికి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గత రెండు నెలలుగా దిగ్బంధనంలో ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు, ఇరాన్‌కు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల దాదాపు 1500 నౌకలు సముద్రంలో చిక్కుకుపోయాయి. ఇరాన్ ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై పన్ను విధిస్తుండగా, అమెరికా దానిని వ్యతిరేకిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని భావిస్తున్నప్పటికీ, ఇరాన్ హెచ్చరికలతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే, భారత్ ముందస్తు జాగ్రత్తగా తన ఆర్థిక మూలాలను కాపాడుకునేందుకు ప్రధాని ఈ పిలుపునిచ్చారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More