Hanuman Jayanthi: రేపే హనుమాన్ జయంతి.. నవధాన్యాల దీపం, హనుమాన్ శ్లోకాలతో పాటు పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు!

Hanuman Jayanthi: ధైర్యానికి, విజయానికి మారుపేరుగా నిలిచే హనుమంతుని ఆరాధన మనకు కొండంత అండ. ఈ ఏడాది మే 12న వచ్చే హనుమాన్ జయంతి విశిష్టత, పూజా విధానం మరియు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలపై ప్రత్యేక కథనం.

Published on: May 11, 2026, 12:10:48 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో హనుమంతుడిని సంకట మోచనుడిగా కొలుస్తాం. సాధారణంగా హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం మన ఆచారం. ఏప్రిల్ నెలలో చైత్ర పౌర్ణమి నాడు ఒకసారి వేడుకలు జరుపుకోగా, తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రేపు, అంటే మే 12వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్ర పర్వదినం వచ్చింది. మంగళవారం ఆంజనేయుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఈసారి జయంతికి మరింత ప్రాముఖ్యత చేకూరింది.

Hanuman Jayanthi: రేపే హనుమాన్ జయంతి.. నవధాన్యాల దీపం, హనుమాన్ శ్లోకాలతో పాటు పూజా విధానం (pinterest)
Hanuman Jayanthi: రేపే హనుమాన్ జయంతి.. నవధాన్యాల దీపం, హనుమాన్ శ్లోకాలతో పాటు పూజా విధానం (pinterest)

ముహూర్తం, తిథి వివరాలు

2026 వైశాఖ బహుళ దశమి తిథి మే 11 సోమవారం ఉదయం 10:17 గంటలకు ప్రారంభమై, మే 12 మంగళవారం ఉదయం 09:54 గంటల వరకు ఉంది. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యోదయ సమయంలో ఉన్న తిథినే పరిగణనలోకి తీసుకోవాలి. పైగా హనుమంతుడి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం మంగళవారం నాడే వస్తోంది. అందుకే మే 12వ తేదీనే హనుమాన్ జయంతిగా నిర్ణయించారు.

పూజా విధానం: ఇలా చేస్తే స్వామి అనుగ్రహం మీ సొంతం

హనుమాన్ జయంతి రోజున స్వామివారిని పూజించే వారు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

ఇంటి అలంకరణ: ముందుగా ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి.

చిత్రపట స్థాపన: పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫొటో ఉంటే పూజకు శ్రేష్ఠం. ఒకవేళ అది లేకపోతే శ్రీరామ పట్టాభిషేక పటాన్ని పెట్టుకుని పూజించవచ్చు.

రామ నామ జపం: హనుమంతుడిని పూజించే ముందు ఆయన ఇష్టదైవమైన శ్రీరాముడిని స్మరించడం మర్చిపోకండి. 'శ్రీరామ రక్షా స్తోత్రం' లేదా కనీసం 'శ్రీరామ' అనే నామాన్ని జపించి ఆ తర్వాతే హనుమాన్ పూజ మొదలుపెట్టాలి.

స్తోత్ర పఠనం: హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, అష్టోత్తర శతనామావళిని భక్తితో పఠించండి.

అఖండ ఐశ్వర్యం కోసం ప్రత్యేక పరిహారాలు

మీ జీవితంలోని గ్రహ దోషాలు తొలగిపోయి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ క్రింది పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి:

తమలపాకుల పూజ: హనుమంతుడికి తమలపాకులు అంటే ప్రాణం. 108 తమలపాకులతో అష్టోత్తరం చదువుతూ స్వామివారికి పూజ చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి.

నవధాన్యాల దీపం: తమలపాకు పైన నవధాన్యాలు పోసి, దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెలో సింధూరం కలిపి, 5 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. దీని వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

సింధూర అక్షింతలు: బియ్యంలో ఆవు నెయ్యి, సింధూరం కలిపి స్వామివారికి సమర్పించండి. దీని వల్ల హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.

పారాయణం: సుందరాకాండ పారాయణం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది.

పాటించాల్సిన నియమాలు మరియు దానాలు

హనుమాన్ జయంతి నాడు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం మంచిది. రాత్రి వేళ ఒక్కసారి మాత్రమే భుజించి (ఏకభుక్తం), బ్రహ్మచర్యం పాటించాలి. శక్తి మేరకు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీరు చేసే పూజకు పూర్తి ఫలితం లభిస్తుంది.

జపించాల్సిన శక్తివంతమైన శ్లోకాలు

పూజ సమయంలో ఈ క్రింది శ్లోకాలను పఠించడం శ్రేయస్కరం:

అంజనానందనం వీరం జానకీ శోక నాశనం

కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి

యత్ర యత్ర రఘునాధ కీర్తనం

తత్ర తత్ర కృతమస్తకాంజలిం

భాష్పవారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రాక్షసాంతకం

ఆంజనేయ మతి పాటలాలనం

కాంచనాద్రికమనీయ విగ్రహం

పారిజాతతరుములవాసినం

బావయామి పవమాననందనం..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More