కార్తీక పౌర్ణమి: ఈరోజు 365 వత్తుల దీపం ఎలా వెలిగించాలి? ఇంట్లో ఈ 6 చోట్ల దీపాలు తప్పక పెట్టండి!

కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం వెలిగించడం విశేషమైన ఆచారంగా భావిస్తారు. ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. 365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి? 

Published on: Nov 24, 2026, 14:50:48 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తీక మాసంలో వచ్చే ముఖ్య పర్వదినాల్లో కార్తీక పౌర్ణమి ఒకటి. కార్తీక మాసంలో ఈ రోజును అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ఏడాది పొడవునా ప్రతిరోజూ దీపం వెలిగించినంత పుణ్యం కలగాలంటే ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది.

కార్తీక పౌర్ణమి: ఈరోజు 365 వత్తుల దీపం ఎలా వెలిగించాలి? ఇంట్లో ఈ 6 చోట్ల దీపాలు తప్పక పెట్టండి! (AI)
కార్తీక పౌర్ణమి: ఈరోజు 365 వత్తుల దీపం ఎలా వెలిగించాలి? ఇంట్లో ఈ 6 చోట్ల దీపాలు తప్పక పెట్టండి! (AI)

సాయంత్రం 365 వత్తుల దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలా వెలిగించాలి? ఈ వత్తులను వెలిగించే విధానంతో పాటు ఇంట్లో ఎక్కడెక్కడ దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? వంటి వివరాలను తెలుసుకుందాం.

365 వత్తుల దీపం ప్రాముఖ్యత

చాలా మంది కార్తీక పౌర్ణమి నాడు దేవాలయాల్లో, ఇళ్లల్లో 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా, ఈరోజు 365 వత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ ఫలితం లభిస్తుందని నమ్ముతారు. శివకేశవుల అనుగ్రహం కలగడానికి కూడా చాలా మంది ఈ దీపాన్ని వెలిగిస్తారు.

365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి?

ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోండి. తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకోవాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసి, శివుడు, విష్ణుమూర్తి చిత్రపటాల ముందు లేదా తులసి కోట ముందు ఈ దీపాన్ని వెలిగించండి. 365 వత్తులను ఒక పెద్ద ప్రమిదలో లేదా వెడల్పుగా ఉండే పాత్రలో అమర్చుకోండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు. దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అగరబత్తితో వెలిగించాలి.

ఆ తర్వాత "దామోదరం ఆవాహయామి" అని కానీ, "త్రయంబకం ఆవాహయామి" అని కానీ చెప్పి పుష్పాలు, అక్షింతలను దీపానికి సమర్పించి నమస్కారం చేసుకోండి. అలాగే విష్ణుమూర్తిని, శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధించండి. దీపం వెలిగించాక శివపంచాక్షరి మంత్రం లేదా విష్ణు నామాలను జపిస్తే కూడా మంచిది.

ఈరోజు సాయంత్రం ఇంట్లో ఈ ప్రదేశాల్లో కూడా దీపాలను పెట్టడం మంచిది

1.ప్రధాన ద్వారం

ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్ముతారు. దీపాలను తెరలకు తగలకుండా చూసుకోండి.

2.గడప దగ్గర

ఇంటి గడప వద్ద కూడా ప్రమిదలో నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించండి. గడపను శుభ్రం చేసి ముగ్గులు వేసుకుంటే మంచిది.

3.పూజా మందిరం

పూజా మందిరంలో కూడా దీపాలను వెలిగించండి. శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చిత్రపటాల ముందు దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శివపంచాక్షరి మంత్రాన్ని జపించండి.

4.తులసి కోట దగ్గర

తులసి కోట దగ్గర కూడా కచ్చితంగా దీపారాధన చేయండి. తులసి మొక్కకు మంట తగలకుండా చూసుకోండి.

5.బాల్కనీ లేదా కిటికీల దగ్గర

ఇంటి బాల్కనీ, కిటికీల దగ్గర సురక్షితమైన ప్రదేశాల్లో దీపాలను పెట్టొచ్చు. దీపాల వెలుగుతో ఇల్లు అందంగా కనిపిస్తుంది. పైగా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగి సానుకూల శక్తి ఏర్పడుతుందని నమ్ముతారు.

6.ఈశాన్య భాగం

ఇంటి ఈశాన్య భాగంలో కూడా దీపాలను వెలిగించండి. దీపాన్ని గాలి తగిలే ప్రదేశంలో లేదా మండే వస్తువుల దగ్గర పెట్టకుండా జాగ్రత్త వహించండి.

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు