సోమవతి అమావాస్య వేళ మిథున రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులకు లాభాలు.. మిథున సంక్రాంతి నాడు వేటిని దానం చెయ్యాలి?
ఈ ఏడాది సోమవతి అమావాస్య, మిథున సంక్రాంతి ఒకే రోజు వచ్చాయి. జూన్ 15న సూర్యుడి రాశి మార్పు వల్ల బుధాదిత్య రాజయోగం కలగనుంది. దీనివల్ల ఏయే రాశుల వారికి అదృష్టం పడుతుందో, ఎలాంటి పరిహారాలు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
సోమవతి అమావాస్య రోజే మిథున సంక్రాంతి రావడం అత్యంత అరుదైన, పవిత్రమైన ఘట్టంగా పండితులు భావిస్తున్నారు. ఈ రెండు ఒకే రోజు కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతానికి వృషభ రాశిలో ఉన్న సూర్య భగవానుడు జూన్ 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే రాశిలో అప్పటికే బుధుడు ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడనుంది.

"ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన ధనలాభాన్ని, కెరీర్‌లో ఊహించని పురోగతిని తెచ్చిపెడుతుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. అయితే, ఈ యోగం ఎక్కువ రోజులు ఉండదు. జూన్ 22వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోకి మారడం వల్ల ఈ బుధాదిత్య రాజయోగం ముగుస్తుంది. ఆ తర్వాత జూలై వరకు బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు.
మిథున సంక్రాంతి రోజున చేయాల్సిన పరిహారాలు
మిథున సంక్రాంతి రోజున సూర్య ఆరాధన చేయడం, దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఈ పవిత్ర దినాన చాలా మంది ఇళ్లలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి దానాలు చేయడం ఉత్తమం. అలాగే పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలమైనది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే కాలం కాబట్టి.. ఈ రోజున అన్నదానంతో పాటు విసనకర్రలు, గొడుగులు, చల్లని నీరు, మట్టి కుండలు, కాలకనుగుణంగా దొరికే పండ్లను దానం చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి.
బుధాదిత్య రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులు
మిథున రాశి
మీ రాశిలోనే సూర్య, బుధుల కలయిక జరుగుతోంది. బుధుడి ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. కెరీర్, వ్యాపార రంగాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి. లాభాలు కూడా ఆశించిన స్థాయిలో ఉంటాయి.
సింహ రాశి
సింహ రాశికి సూర్యుడే అధిపతి. అందువల్ల బుధుడి కలయిక మీకు విశేష ప్రయోజనాలను ఇస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయి, నిమిషాల్లో పనులు పూర్తవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.
కన్యా రాశి
సూర్యుడు, బుధుడి అనుగ్రహం వల్ల కన్యా రాశి వారికి వృత్తిపరంగా తిరుగుండదు. ఉద్యోగంలో పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి, వ్యక్తిగత జీవితంలో ఉన్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరగడమే కాకుండా సమాజంలో హోదా కూడా పెరుగుతుంది.
తులా రాశి
ఈ కాలంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. గతంలో మిమ్మల్ని వేధించిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సమసిపోతాయి. మిథున రాశిలో గ్రహాల అనుకూలత వల్ల మీరు తీసుకునే సరైన నిర్ణయాలతో ఆస్తులను విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నమ్మకాలు, పౌరాణిక గ్రంథాలపై ఆధారపడి ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


