'అక్రమ కేసులకు భయపడం... మోదీ, అమిత్ షాపై ఎంతవరకైనా పోరాడుతాం' - సీఎం రేవంత్
సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ప్రధాని మోదీపై పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నామని తెలిపారు.
మనీ ల్యాండరింగ్ కేసు పేరుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంతో ఆవిషయాన్ని దృష్టి మరల్చేందుకు మళ్లీ కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నామని చెప్పారు.సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తెలంగాణ ప్రజలంతా అండగా నిలుస్తామని… అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తామని వ్యాఖ్యానించారు.

పోరాడేందుకు సిద్ధం - సీఎం రేవంత్
మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పాత, కొత్త డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన పీసీసీ కార్యనిర్వాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.దేశం కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను, భారత స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసింది. గాంధీ కుటుంబం తమ సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించి దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించింది. నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంతో కృషి చేశారు.పేపర్ నడపడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఉపయోగించలేదు. నెహ్రూకు వారసత్వంగా వచ్చిన ఆస్తులతో ఆ వార్తాపత్రిక నడుస్తోంది” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అండగా నిలుస్తామని… అవసరమైతే దేనికైనా పోరాడతామని ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి సందేశం ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించడం వంటి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు.
“సంక్షోభంలో మనకు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే… సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ముందుకు నడిపిస్తున్నాం. కోర్ అర్బన్ లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని CURE చేయాలని నిర్ణయించుకున్నాం. కోర్ అర్బన్ రీజియన్ లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తాం. రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) ప్రాంతంలో పరిశ్రమలకు ఏర్పాటు చేసుకోబోతున్నాం. రీజినల్ రింగ్ రోడ్ బయట రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ (RARE) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోబోతున్నాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని సీఎం రేవంత్ చెప్పారు. గ్రామస్థాయి కమిటీల సమన్వయంతో చీరల పంపిణీ బాధ్యత తీసుకోవాలని కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను సీఎం ఆదేశించారు. డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తామన్నారు. మార్చిలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలు పంపిణీ చేయాలని… ప్రజా ప్రభుత్వం అందించే సంక్షేమం, పరిపాలనపై గ్రామాల నుంచి గ్రామం వరకు చర్చ జరపాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ ఆదేశాలను పాటించడంలో డీసీసీ అధ్యక్షులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. డీసీసీ అనేది పెద్ద బాధ్యత అని… రాజకీయాల్లో సవాళ్లు సర్వసాధారణమని, ప్రతి నాయకుడు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
“ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ఈ సమ్మిట్ లో 'తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్' ఆవిష్కరించుకోబోతున్నాం. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో చాలా మంది హేమా హేమీలు భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాం. గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొంటారు” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

