'గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు... రియల్ ఎస్టేట్ ఎక్స్​పోలా ఉంది' - హరీశ్ రావ్ తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్ చేశారంటూ ధ్వజమెత్తారు.విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదని… దాన్ని చేరుకునే మిషన్ లేదని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ ను రియల్ ఎస్టేట్ ఎక్స్ పో నిర్వహించారని విమర్శించారు.

Published on: Dec 10, 2025, 12:26:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెట్టుబడుల కట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్‌ఫ్లాప్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌లో విజన్ లేదని… దాన్ని చేరుకునే మిషన్ లేదని దుయ్యబట్టారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ అని విమర్శించారు.

మాజీ మంత్రి హరీశ్ రావ్
మాజీ మంత్రి హరీశ్ రావ్

శ్వేతపత్రం విడుదల చేయాలి - హరీశ్ రావ్

గ్లోబల్ సమ్మిట్‌లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు అని హరీశ్ రావ్ మండిపడ్డారు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి…? అని ప్రశ్నించారు. అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయని నిలదీశారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనేది దానిపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

“రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు. భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉంది. ఫ్యూచర్‌ సిటీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నది.• అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యింది. రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్” అని హరీశ్ రావు ఆరోపించారు.

“ఫార్మా సిటీ పక్క భూములు ముందుగానే మీ బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నావు. ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టీ, ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశావు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాం కు తెరతీశావు.పెట్టుబడులు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రెండేళ్లుగా పెట్టుబడుల పేరిట కట్టు కథలు తప్ప చేసింది ఏం లేదు” అని సీఎం రేవంత్ పై హరీశ్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“దావోస్ పెట్టుబడులు, అమెరికా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ కంపెనీలు ఎక్కడకు పోయాయి..? పెట్టుబడులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? విదేశీ పర్యటనలు, గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం చూస్తే, ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల వలే ఉన్నాయి. మీ చెత్త విధానాలను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి” అని హరీశ్ రావ్ చెప్పారు.

త్వరలోనే అన్నీ బయటపెడుతాం…

“సీఎం రేవంత్, కాంగ్రెస్ ముఖ్య నేతల బినామీలతోనే ఒప్పందాలు జరిగాయి. ఆ పూర్తి వివరాలు త్వరలో బయటపెడుతాం. గుజరాత్ సమ్మిట్ అయినా, కేరళ సమ్మిట్ అయినా, కర్ణాటక సమ్మిట్, వెస్ట్ బెంగాల్ సమ్మిట్ అయినా గతంలో పీఆర్ స్టంట్లు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాబట్టే, రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పీఆర్ స్టంట్ గా భావించి రాహుల్, ప్రియాంక, ఖార్గేలు ముఖం చాటేశారని” అన్నారు.

“మీరు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో, మీ సమక్షంలోనే పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో జరిగిన రికార్డు స్థాయి తెలంగాణ అభివృద్ధి గురించి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వివరించారు. తెలంగాణ ఒక మాడల్‌ అంటూ పొగడ్తలు కురిపించారు. అదే వేదిక నుండి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు .. కేసీఆర్ పాలనలో వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు.కేసీఆర్ పదేళ్ళ పాలన గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో” అంటూ హరీశ్ రావు హితవు పలికారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More