...
...
Next Story

Kalvakuntla Kavitha New Party : కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ - పెట్టబోయే పేరు ఇదేనా..?

Kalvakuntla Kavitha New Party : తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ పార్టీకి… 'తెలంగాణ ప్రజా వికాస్ సమితి' పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Published on: Apr 24, 2026, 15:52:04 IST
Advertisement

Kalvakuntla Kavitha New Party : తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై మరో పార్టీకి బీజం పడనుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, జాగృతి వ్యవస్థాపకురాలైన కవిత ఆధ్వర్యంలో ఈ కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. చాలా కాలంగానే ఆ దిశగా కసరత్తు చేస్తుండగా… ఈనెల 25వ తేదీన కవిత అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

కవిత కొత్త పార్టీ
కవిత కొత్త పార్టీ

మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్‌ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమకారులను పెద్ద సంఖ్యలోఈ సభకు ఆహ్వానించారని తెలుస్తోంది.

పార్టీ పేరు ఇదేనా…?

కవిత కొత్త పార్టీ పేరుపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఓ దశగా టీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే తాజాగా పార్టీ ఆవిర్భావ వేదిక జరిగే మునీరాబాద్ ప్రాంతంలో 'తెలంగాణ ప్రజా వికాస్ సమితి' (TPVS) పేరుతో కొన్ని బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించాయి. దీంతో ఈ పేరుతోనే ఆమె పార్టీని ప్రకటిస్తారన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ…. దాదాపుగా ఇదే పేరు ఉండొచ్చని తెలుస్తోంది.

తెలంగాణ అస్థిత్వమే పునాదిగా, అభివృద్ధి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ పార్టీ పని చేయనుందని కవిత చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూనే, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లడమే తమ ఉద్దేశమని అంటున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని ఇటీవలే కాలంలో చెప్పారు.

నియోజకవర్గాల వారీగా బలమైన కేడర్‌ను నిర్మించేందుకు ఇప్పటికే కవిత తన మద్దతుదారులతో చర్చలు జరిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సమీకరణాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కవిత పెట్టబోయే కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు? బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు వెళ్తారు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇటీవలనే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కవితను కలిశారు.జాగృతి కండువాను కప్పుకున్నారు. ఈ లిస్టులో ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఉద్యమ కారులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు వివిద పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరనున్నట్లు జాగృతి ప్రతినిదులు చెబుతున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe