వెలుగుమట్లలో పేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది - మంత్రి పొంగులేటి
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం చేసే బాధ్యత తమదేనని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే పేదల ఆశీర్వాదంతోనని చెప్పారు. నష్టపోయిన వారికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తామన్నారు.
ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి స్థలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం, వివేక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఆ బాధ్యత నాదే - మంత్రి పొంగులేటి
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… పేదల ఆశీర్వాదంతో నిలబడిన ప్రభుత్వం తమదని చెప్పారు. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. వెలుగుమట్లలో పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నాం అని బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2023 జూలై 15న వెలుగుమట్లలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. అంతేగాక వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు.
“తెలంగాణలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు అసూయతో పసలేని ఆరోపణల చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడుతున్న తీరు అత్యంత హాస్యాస్పదం. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో సార్లు స్పష్టంగా చెప్పారు” అని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.
కమీషన్ల కోసమే రీడిజైనింగ్ - బీఆర్ఎస్ పై పొంగులేటి ఫైర్
“దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో పేదవాడి కష్టాలను చూసి చలించిపోయారు. గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పంట పొలాలకు మళ్లించాలని జలయజ్ఞం చేపట్టారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే తుమ్మిడిహట్టి (ప్రాణహిత-చేవెళ్ల) ప్రాజెక్టును రూపకల్పన చేశారు. గత పదేళ్ల దొరల పాలనలో కేవలం కమిషన్ల కోసం, సొంత అకౌంట్లు నింపుకోవడం కోసం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు. 196 టిఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టీఎంసీలకు పరిమితం చేసి, అందులో కూడా 50 టీఎంసీలు సముద్రం పాలు చేశారు” అని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రూ. 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసినా, నాలుగు ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 112 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారు. నిర్వహణ కోసం 8500 మెగావాట్ల విద్యుత్ ఖర్చుతో నిర్మించిన ఈ ఎనిమిదో వింత ఏడాదికే కుంగిపోయింది, లీకేజీలతో దర్శనమిస్తుండడం నిజంగా దురదృష్టకరం. మా ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేశాం, అసెంబ్లీలో చర్చించాం, విచారణ చేశాం, కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరాం. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించిన ప్రధాని, కేంద్ర మంత్రులు.. నేడు విచారణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఘోష్ కమిటీ నివేదికను మేము సీబీఐకి అందజేసినా, నేటికీ స్పందన లేదు. కేంద్రం తీరు వల్ల బీజెపీ -బిఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతోంది” అని మంత్రి పొంగులేటి కామెంట్స్ చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం 15 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. రాష్ట్రం నెత్తిన రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం పడిందన్నారు. అయినా కూడా రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజాప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు.
“పెయిడ్ ఆర్టిస్టులతో, పింక్ యూట్యూబ్ ఛానళ్లతో విషప్రచారం చేయడం మానుకోవాలి. అటువంటి దిగజారుడు రాజకీయాలు తెలంగాణకు మేలు చేయవు. వచ్చే మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తోపాటు, కేటీఆర్, హరీశ్ రావు కూడా హాజరుకావాలి. ప్రాజెక్టుల విధ్వంసంపై, నీటి వాటాలపై ముఖాముఖి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతిపక్ష నేతలకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, విషం చిమ్మడం ఆపి.. మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి” అని మంత్రి పొంగులేటి హితవు పలికారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

