...
...
Next Story

Secunderabad Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లుక్ మారుతోంది! ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు - వేగంగా పనులు

Secunderabad Railway Station Redevelopment : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 65 శాతం పూర్తయ్యాయి. రూ. 714.73 కోట్లతో ఎయిర్ కాంకోర్స్, మల్టీ-లెవెల్ పార్కింగ్, మెట్రో స్కైవాక్ వంటి ప్రపంచ స్థాయి వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.

Published on: Aug 5, 2026, 12:32:13 IST
Advertisement

Secunderabad Railway Station Redevelopment : హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన, దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలోనే సరికొత్త రూపంలో ప్రయాణికులకు దర్శనమివ్వనుంది. ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి సౌకర్యాలను అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రపంచ స్థాయి అత్యాధునిక పునరాభివృద్ధి (రిడెవలప్‌మెంట్) పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే 65 శాతం పూర్తి కావొచ్చాయి.

శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు
శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు

ప్రతిరోజూ ఈ స్టేషన్ నుంచి సుమారు 180 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సగటున 1.5 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ స్టేషన్‌పైనే ఆధారపడతారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, రాబోయే ఐదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమగ్ర పునర్నిర్మాణాన్ని ప్లాన్ చేశారు. పనులు శరవేగంగా పూర్తి చేసి…. త్వరలోనే ఈ నూతన టెర్మినల్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్ ఆధునికీకరణ కోసం రూ. 714.73 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. పాత కట్టడాల స్థానంలో సుందరమైన, అత్యంత ఆకర్షణీయమైన నూతన స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నారు.

ప్రాజెక్ట్ విశేషాలు:

  • ప్లాట్‌ఫారమ్‌లన్నింటినీ కవర్ చేస్తూ అత్యాధునిక డిజైన్‌తో కూడిన రూఫ్ టాప్‌ల ఏర్పాటు.
  • ప్రయాణికులు ప్రశాంతంగా వేచి ఉండేందుకు వీలుగా విశాలమైన రెండు అంతస్తుల ఎయిర్ కాంకోర్స్ నిర్మాణం.
  • స్టేషన్‌కు వచ్చే వాహనాల రద్దీని నివారించేందుకు బహుళ అంతస్తుల పార్కింగ్ సదుపాయం.
  • వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారుల సౌకర్యార్థం 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లతో పాటు వేగంగా నడవడానికి ట్రావలేటర్ల ఏర్పాటు.
  • సమీపంలోని మెట్రో స్టేషన్‌తో నేరుగా అనుసంధానించేలా ప్రత్యేక స్కైవాక్‌ల నిర్మాణం.
  • క్లీన్ ఎనర్జీ కోసం సోలార్ పవర్ ప్లాంట్లు, విద్యుత్ వాహనాల కోసం ఈవీ (EV) ఛార్జింగ్ పాయింట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రం (STP).
  • ప్రయాణికుల రక్షణ కోసం అత్యాధునిక నిఘా, భద్రతా వ్యవస్థలు.

ఇప్పటికే పూర్తయిన పనులు….

ప్రస్తుతం ఉత్తరం (నార్త్) వైపు మల్టీ-లెవెల్ పార్కింగ్ భవనం, నార్త్ స్టేషన్ ప్రధాన భవనం పనులు జోరుగా సాగుతున్నాయి. ప్లాట్‌ఫారమ్‌ల పైన నిర్మించే భారీ ఎయిర్ కాంకోర్స్ పనులు, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంటున్నాయి. వీటితో పాటు ట్రావలేటర్లు, నీటి అవసరాల కోసం వాటర్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి కేంద్రం , మెట్రోను నేరుగా కలిపే స్కైవాక్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలను సమగ్రంగా ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగర మౌలిక వసతుల రంగానికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక మకుటాయమానంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe