SCR Charlapalli Tiruchanur Special Trains : రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని చార్లపల్లి నుంచి తిరుపతి సమీపంలోని తిరుచానూరు వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక సర్వీసుల వల్ల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, కోస్తాంధ్ర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.
ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు :
- రైలు నంబరు 07025 (చర్లపల్లి – తిరుచానూరు) : ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 4, 2026 (శుక్రవారం) రోజున చర్లపల్లి స్టేషన్ నుంచి తిరుచానూరుకు బయలుదేరుతుంది. ఈ మార్గంలో ఒక సర్వీసును అందుబాటులో ఉంచారు.
- రైలు నంబరు 07026 (తిరుచానూరు – చర్లపల్లి) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 5, 2026 (శనివారం) రోజున తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయలుదేరుతుంది. ఇది కూడా ఒక సర్వీసుగా అందుబాటులో ఉంటుంది.
హాల్టింగ్స్ వివరాలు…..

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణికులకు అనువుగా పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు. ఫలితంగా నల్గొండ జిల్లా వాసులతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రయాణికులకు కూడా నేరుగా తిరుపతి పరిసర ప్రాంతాలకు చేరుకోవడానికి మంచి అవకాశం లభించింది.
ప్రయాణికుల అందరి అవసరాలను తీర్చే విధంగా ఈ ప్రత్యేక రైళ్లలో బోగీలను ఏర్పాటు చేశారు. వీటిలో 1ఏసీ ప్లస్ 2ఏసీ, స్లీపర్ క్లాస్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.