తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భానుడి ప్రతాపానికి తోడు… హీట్ వల్ల తీవ్రమైన ఉక్కపోత ఏర్పడి ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో గురువారం నాటికి పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాటేశాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే…. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 36.2 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని చాలా ఏరియాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది.
రుతుపవనాల నిష్క్రమణ…!
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ వేగవంతమైంది. గురువారం నాటికి ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 50 శాతం మేర రుతుపవనాలు వెనక్కి మళ్లాయి. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా రేపటికల్లా (శుక్రవారానికి) రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మొత్తంగా రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణ అంతటా రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 15 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
వాతావరణ నిపుణుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 25వ తేదీ నాటికే తెలంగాణలో వర్షాకాలం ప్రభావం దాదాపు ముగిసింది. ఇకపై రాష్ట్రంలో వర్ష సూచన ఏమాత్రం లేదని…. ఆకాశం పొడిగా ఉండనుంది. వర్షాలు తగ్గుముఖం పట్టి, పొడి గాలులు వీయడంతో రాబోయే రోజుల్లో మధ్యాహ్నం వేళ ఎండ దెబ్బ ఎక్కువగా ఉండే సూచనలున్నాయి.