Sabarimala Special Trains : శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ రైల్వే అలర్ట్ అందించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు, మరీ ముఖ్యంగా అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి - కొల్లం - చర్లపల్లి మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (రైలు నంబర్లు 07180 / 07181) నడపాలని నిర్ణయించింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు మొత్తం 12 సర్వీసులు (ఇరువైపులా ఆరేసి ట్రిప్పులు) ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
రైళ్ల షెడ్యూల్…
- చర్లపల్లి - కొల్లాం ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (07180) : ఈ రైలు నవంబర్ 20, 27 మరియు డిసెంబర్ 4, 11, 18, 25 తేదీల్లో (ప్రతి శుక్రవారం) రాత్రి 11:45 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణం కొనసాగించి ఆదివారం ఉదయం 7:55 గంటలకు కొల్లాం జంక్షన్‌కు చేరుకుంటుంది.
- కొల్లాం - చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ స్పెషల్ (07181): తిరుగు ప్రయాణంలో ఈ రైలు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి ఆదివారం) ఉదయం 10:40 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే సోమవారం సాయంత్రం 7:00 గంటలకు తిరిగి చర్లపల్లికి చేరుకుంటుంది.
తెలంగాణ, ఏపీలో ముఖ్యమైన హాల్ట్ స్టేషన్లు....

ఈ ప్రత్యేక రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని మొత్తం 30 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టాపుల విషయానికొస్తే.. చర్లపల్లి తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఆ తర్వాత తమిళనాడులోని పెరంబూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్ మీదుగా కేరళలోకి ప్రవేశిస్తుంది. కేరళలో పాలక్కాడ్, త్రిశూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్ (శబరిమల సమీప స్టేషన్), మావెలిక్కర, కాయంకుళం, కరుణాగపల్లి, శాస్తంకోట స్టేషన్లలో ఆగుతూ కొల్లం చేరుకుంటుంది.
ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఈ రైలులో అన్ని రకాల బోగీలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 3 ఏసీ టూ టైర్ (2AC) కోచ్‌లు, 5 ఏసీ త్రీ టైర్ (3AC) కోచ్‌లు, 10 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు 2 లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్లు ఉంటాయి. కార్తీక, మార్గశిర మాసాల్లో శబరిమల వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని..... ముందుగానే ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.