AP TG Temperatures : నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు - రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు, వడదెబ్బతో 20 మందికిపైగా మృతి
AP Telangana High Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. ఏపీలో 45 నుంచి 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా… తెలంగాణలో వడదెబ్బకు 22 మంది మృతి చెందారు. రాగల రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP Telangana High Temperatures : భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఎండ తీవ్రత, వడగాలుల తాకిడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాస్తూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రాబోయే సోమవారం వరకు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని…. ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

నిప్పుల కొలిమిలా ఏపీ…!
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పిడుగురాళ్లలో 48 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీవ్యాప్తంగా 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
అంచనాలు ఇలా….
- 45°C నుంచి 47°C వరకు (అత్యధిక ఉష్ణోగ్రతలు) : ఈ లిస్టులో అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లా ఉన్నాయి.
- 43°C నుంచి 45°C వరకు : కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదవుతాయి.
- 40°C నుంచి 43°C వరకు : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది.
ఎండలు మండిపోతున్నప్పటికీ మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు పడే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో మండుతున్న ఎండలు:
తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గురువారం నాటి ఎండలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. రాష్ట్రంలో ఒకేసారి 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటడం ఇదే మొదటిసారి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణ వాతావరణ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత 2019లో రామగుండంలో (47 డిగ్రీలు) నమోదైంది. ఆ ఒక్క రికార్డు మినహా గురువారం నాటి ఉష్ణోగ్రతలు గతంలోని అన్ని రికార్డులను తిరగరాశాయి.
మరోవైపు తెలంగాణలో గురువారం వీచిన తీవ్రమైన వడగాడ్పుల కారణంగా వడదెబ్బ తగిలి వేర్వేరు ప్రాంతాల్లో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 9 గంటల నుంచే మొదలవుతున్న వేడి తీవ్రత, రాత్రి పొద్దుపోయే వరకు వేడిగాలుల రూపంలో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
తెలంగాణలో ఇవాళ, రేపు కూడా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న పలు జిల్లాలకు ‘రెడ్’ ఎలర్ట్ జారీ అయింది. పొడిగాలుల కారణంగా గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోయిందని…. దీనికి తోడు గాలి వేగం కూడా ఎక్కువగా ఉండటంతో వడగాలుల తీవ్రత మరింత పెరిగిందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- శుక్రవారం(మే 22) : ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది.
- శనివారం(మే 23) : పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వేడిగాలులు తీవ్రంగా వీస్తాయి.
ఎండలు అధికంగా ఉండటంతో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

