OTT: పెళ్లి బంధంలో భాగస్వామి మోసం చేయడం పెద్ద తప్పు కాదు: ఓటీటీ షోలో నటుడు రామ్ కపూర్- తిప్పికొట్టిన తోటి కంటెస్టెంట్
Ram Kapoor On Cheating In OTT Show Lock Upp 2: ప్రముఖ ఓటీటీ షో 'లాక్ అప్ సీజన్ 2' వేదికగా నటుడు రామ్ కపూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వైవాహిక బంధంలో భాగస్వామి మోసం చేయడం అనేది బంధాన్ని తెంచుకునేంత పెద్ద తప్పు కాదంటూ రామ్ కపూర్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Ram Kapoor On Cheating In OTT Show Lock Upp 2: బుల్లితెరపై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు రామ్ కపూర్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఓటీటీలో ప్రసారమవుతున్న 'లాక్ అప్: సచ్ యా సజా' రియాలిటీ షోలో ఆయన ప్రవర్తన, వ్యాఖ్యలు మొదటి నుంచీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి.

గతంలో గ్యాంగ్ రేప్ అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, టాస్క్ సమయంలో నీళ్లు ఇవ్వలేదని రచ్చ చేయడం లాంటి ఘటనలతో వార్తల్లో నిలిచిన రామ్ కపూర్.. ఇప్పుడు వైవాహిక బంధం, వివాహేతర సంబంధాలపై చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంటే భాగస్వామి మోసం చేసినా బంధాన్ని తెంచుకోవాల్సిన అవసరం లేదంటూ రామ్ కపూర్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
అసలేం జరిగింది?
ఓటీటీ షోలో భాగంగా తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా.. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేసినట్లు తెలిస్తే, మీరు ఇంకో బంధాన్ని వెతుక్కుంటారా? అని రామ్ కపూర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. "లేదు, మళ్లీ ఆ బంధాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మీ భాగస్వామిని మీరు నిజంగా ప్రేమిస్తే ఏదీ డీల్ బ్రేకర్ (బంధాన్ని ముగించేది) కాకూడదు. వైవాహిక జీవితం అనేది ఒక కష్టమైన ప్రయాణం, దానికోసం ప్రతిరోజూ శ్రమించాలి" అని చెప్పారు.
మరింత వివరణ ఇస్తూ.. 20-25 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. "కలిసి సాగే ప్రయాణంలో కష్టకాలం ఎదురైనప్పుడు.. పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే, ఆ తర్వాత భాగస్వామి లేకుండా, పిల్లలు లేకుండా బతకలేమని గుర్తిస్తే కాలమే అన్ని గాయాలను నయం చేస్తుంది. కొన్నిసార్లు తప్పులు అనుకోకుండా జరిగిపోతాయి" అని రామ్ కపూర్ వ్యాఖ్యానించారు.
తిప్పికొట్టిన తోటి నటి
రామ్ కపూర్ వ్యాఖ్యలను తోటి కంటెస్టెంట్, నటి ఆకాంక్ష చమోలా తీవ్రంగా వ్యతిరేకించారు. శారీరక సాన్నిహిత్యం అనేది ఎప్పుడూ 'పొరపాటున' జరగదని ఆమె గట్టిగా వాదించారు. అది పూర్తిగా ఒక వ్యక్తి ఆలోచించి తీసుకునే నిర్ణయమని, అది కేవలం ఒక ఛాయిస్ మాత్రమే తప్ప అనుకోకుండా జరిగే ప్రమాదం కాదంటూ రామ్ కపూర్‌కు ముఖం మీదే చెప్పేశారు.
ఈ చర్చకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు రామ్ కపూర్ తీరును ఎండగడుతున్నారు. "మనం ఆరాధించే వ్యక్తులు లోపల ఎంత సమస్యాత్మకంగా ఉన్నారో ఇలాంటి అన్‌స్క్రిప్టెడ్ షోల వల్లే బయటపడుతోంది" అని ఒకరు కామెంట్ చేశారు.
మరికొందరు ఆయనకు పిచ్చి పట్టిందని, మోసం చేయడాన్ని సమర్థించే ఇలాంటి వ్యక్తులు తీవ్రమైన స్వార్థపరులని మండిపడుతున్నారు. కుటుంబం అంత ముఖ్యమైనప్పుడు అసలు మోసం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
లాక్ అప్ అప్‌డేట్
ప్రస్తుతం ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది. ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి సునీతా అహుజా, హర్షద్ చోప్డా, ఆకాంక్ష చమోలా సురక్షితంగా బయటపడగా.. మిగిలిన వారు సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు పోరాడుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ కంటెస్టెంట్ల ఆట తీరును సమీక్షించి, కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న ఈ షోలో మొత్తం 15 మంది సెలబ్రిటీలు పోటీపడుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రతి శనివారం నుంచి బుధవారం వరకు రాత్రి 8 గంటలకు ఈ లాక్ అప్ 2 సరికొత్త ఎపిసోడ్లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


