Chiranjeevi: దశాబ్దాల కష్టాన్ని క్షణాల్లో దెబ్బతీస్తున్నారు.. కేంద్రమంత్రికి చిరంజీవి వినతిపత్రం.. 3 ప్రధాన వినతులతో!

Chiranjeevi Submits Memo To Kishan Reddy: కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి కఠిన చట్టాలు తేవాలని మెగాస్టార్ చిరంజీవి కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఆ వివరాలను ఇవాళ తెలిపారు.

Published on: Nov 16, 2026, 17:00:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Chiranjeevi Submits Memo To Kishan Reddy: సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, డీప్‌ఫేక్ భూతంపై మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. నటీనటుల ముఖాలు, గొంతులను అనుకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న డిజిటల్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దశాబ్దాల కష్టాన్ని క్షణాల్లో దెబ్బతీస్తున్నారు.. కేంద్రమంత్రికి చిరంజీవి వినతిపత్రం.. 3 ప్రధాన వినతులతో!
దశాబ్దాల కష్టాన్ని క్షణాల్లో దెబ్బతీస్తున్నారు.. కేంద్రమంత్రికి చిరంజీవి వినతిపత్రం.. 3 ప్రధాన వినతులతో!

సమగ్ర వినతిపత్రంపై

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచన మేరకు, శనివారం (నవంబర్ 14) కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన చిరంజీవి ఈ మేరకు ఒక సమగ్ర వినతిపత్రాన్ని అందించారు. కేంద్ర హోంశాఖతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఉద్దేశించి రాసిన ఈ లేఖ వివరాలను ఆయన సోమవారం (నవంబర్ 16) తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ నెల 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వచ్చారు. ఆ సమయంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ సినీ రంగానికి ఎదురవుతున్న ఏఐ ముప్పు గురించి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని అమిత్ షా సూచించడంతో, చిరంజీవి తదుపరి కార్యాచరణ చేపట్టారు.

"గౌరవనీయ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో ఇటీవల జరిగిన భేటీలో ఆయన ఇచ్చిన సలహా మేరకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశాను. ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డిజిటల్ అనుకరణల నుంచి కఠిన రక్షణ కల్పించాలని కోరాను. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు" అని చిరంజీవి పేర్కొన్నారు.

దశాబ్దాల కష్టాన్ని క్షణాల్లో దెబ్బతీస్తున్నారు

సాంకేతికత సృజనాత్మకతను పెంచాలే తప్ప, మనుషుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి భద్రతతో పాటు కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. '#UniteAgainstDigitalAbuse' అనే హ్యాష్‌ట్యాగ్‌తో డిజిటల్ వేధింపులపై అందరూ ఏకం కావాలని కోరారు.

కేంద్ర హోంశాఖకు పంపిన వినతిపత్రంలో చిరంజీవి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. "ఏఐ సాంకేతికత సృజనాత్మక రంగానికి అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. కానీ డీప్‌ఫేక్ టెక్నాలజీ, అనుమతి లేని డిజిటల్ అనుకరణ, వాయిస్ క్లోనింగ్, మార్ఫింగ్ వీడియోల వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారింది" అని చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు.

"కళాకారులు దశాబ్దాల తరబడి కష్టపడి సంపాదించుకున్న పేరుప్రతిష్టలను, గుర్తింపును ఇలాంటి నకిలీ కంటెంట్ క్షణాల్లో నాశనం చేస్తోంది. నటీనటుల అనుమతి లేకుండా వారి ముఖాలను, గొంతులను వాడుకోవడం వల్ల తీవ్ర మానసిక వేదనతో పాటు ఆర్థిక నష్టం, ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది అత్యంత సున్నితమైన సమస్య కాబట్టి తక్షణమే పరిష్కారం చూపాలి" అని చిరంజీవి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

కేంద్రానికి చిరంజీవి చేసిన మూడు ప్రధాన వినతులు

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి మూడు ముఖ్యమైన వినతులు చేశారు:

గుర్తింపు, రూపం రక్షణ: ఒక వ్యక్తి ముఖం, గొంతు, రూపాన్ని అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు లేదా దురుద్దేశంతో ఏఐ ద్వారా వాడుకోకుండా స్పష్టమైన చట్టపరమైన రక్షణ కల్పించాలి.

తప్పనిసరి అనుమతి: చట్టపరమైన మినహాయింపులు ఉంటే తప్ప, ఒక కళాకారుడి రూపాన్ని కానీ, గొంతును కానీ డిజిటల్ రూపంలో మార్చే ముందు వారి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలి.

కఠిన శిక్షలు: హానికరమైన డీప్‌ఫేక్‌లను సృష్టించే వారిపై, వాటిని వ్యాప్తి చేసే వారిపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను పటిష్టం చేయాలి.

దక్షిణాది తారలను వణికిస్తున్న డీప్‌ఫేక్ భూతం

ఇటీవలి కాలంలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు కథానాయికలు ఏఐ మార్ఫింగ్ వీడియోల బారిన పడ్డారు. రష్మిక మందన్నా, కీర్తి సురేష్, శ్రీలీల, రుక్మిణి వసంత్, జాన్వీ కపూర్, సునయన వంటి నటీమణులు తమపై వస్తున్న నకిలీ వీడియోలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో చిరంజీవి సైతం తన వ్యక్తిగత హక్కుల (Personality Rights) రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చట్టపరమైన చర్యల కోసం మెగాస్టార్ చొరవ తీసుకోవడంతో తెలుగు సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More