...
...
Next Story

Tyrese Gibson: గుడిలో శివుడికి, వినాయకుడికి పూజలు చేసిన హాలీవుడ్ స్టార్ నటుడు, సింగర్ టైరీస్ గిబ్సన్- అలా ఎందుకో తెలుసా?

Tyrese Gibson Pooja To Lord Shiva Ganesh India Trip: హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు, సింగర్ టైరీస్ గిబ్సన్ ముంబైలోని దేవాలయాలను సందర్శించి గణేషుడికి హారతి ఇచ్చి, శివలింగానికి పాలాభిషేకం చేసిన వీడియోలను ఆయన పంచుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 28, 2026, 18:30:22 IST
Advertisement

Tyrese Gibson Pooja To Lord Shiva Ganesh India Trip: హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'లో రోమన్ పియర్స్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ స్టార్ నటుడు, సింగర్ టైరీస్ గిబ్సన్ ప్రస్తుతం భారతదేశంలో సందడి చేస్తున్నారు.

ఆధ్యాత్మిక విరామం

గుడిలో శివుడికి, వినాయకుడికి పూజలు చేసిన హాలీవుడ్ స్టార్ నటుడు, సింగర్ టైరీస్ గిబ్సన్- అలా ఎందుకో తెలుసా?
గుడిలో శివుడికి, వినాయకుడికి పూజలు చేసిన హాలీవుడ్ స్టార్ నటుడు, సింగర్ టైరీస్ గిబ్సన్- అలా ఎందుకో తెలుసా?

ఆయన కేవలం విహారయాత్ర కోసం కాకుండా, మానసిక ప్రశాంతత కోసం 'ఆధ్యాత్మిక విరామం' (Spiritual Sabbatical) తీసుకుని ఇక్కడికి రావడం విశేషం. ముంబై నగరంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న ఆయన, ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి ముగ్ధులయ్యారు. తన పర్యటనకు సంబంధించిన అపురూప క్షణాలను, భావోద్వేగపూరిత అనుభవాలను టైరీస్ గిబ్సన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

హాలీవుడ్ ప్రముఖులు మానసిక ప్రశాంతత కోసం, ధ్యానం నేర్చుకోవడానికి భారతదేశానికి రావడం కొత్తేమీ కాదు. గతంలో బీటిల్స్ సంగీత బృందం, యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ వంటి దిగ్గజాలు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక శోధన చేశారు. ఇప్పుడు అదే బాటలో టైరీస్ గిబ్సన్ కూడా నడవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

సాంప్రదాయ దుస్తుల్లో వినాయకుడి హారతి, శివాభిషేకం

శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టైరీస్ కొన్ని ఫోటోలు, వీడియోల సమాహారాన్ని పోస్ట్ చేశారు. ఇందులో ఆయన అచ్చమైన భారతీయ సాంప్రదాయ దుస్తులైన కుర్తా ధరించి కనిపించారు. ఒక వీడియోలో వినాయకుడి విగ్రహం ముందు నిలబడి ఎంతో భక్తిశ్రద్ధలతో హారతి ఇస్తుండగా, మరో వీడియోలో ముంబైలోని ఒక శివాలయంలో శివలింగానికి పాలాభిషేకం చేస్తూ కనిపించారు.

భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని కొనియాడుతూ టైరీస్ ఒక సుదీర్ఘమైన నోట్ రాశారు. 1959లో అమెరికా పౌరహక్కుల నేత డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భారత్‌ను ఒక యాత్రికుడిగా సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

"మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మహాత్మా గాంధీ బోధనలను, అహింసా సిద్ధాంతాన్ని అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చారు. యేసుక్రీస్తు తనకు ప్రేమను చూపిస్తే, గాంధీ ఆ ప్రేమను ఆచరించే మార్గాన్ని చూపించారని కింగ్ అప్పట్లో చెప్పారు" అని టైరీస్ గిబ్సన్ పేర్కొన్నారు. ఆనాటి పర్యటన చరిత్రను మార్చేసిందని ఆయన రాసుకొచ్చారు.

ధ్యానం, మానసిక ప్రశాంతత కోసమే ఈ అన్వేషణ

తన జీవితంలో ధ్యానం నేర్చుకోవాలని, మనసులోని ఆందోళనలను దూరం చేసుకుని ప్రశాంతతను పొందాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు టైరీస్ వెల్లడించారు. జంతు సంరక్షణ కోసం అద్భుతంగా పనిచేస్తున్న ఒక స్థానిక సంస్థను (AMA) కలుసుకున్నానని, అక్కడి నిర్వాహకుడికి భవిష్యత్తులో నోబెల్ శాంతి బహుమతి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనలో తనతో పాటు చిన్ననాటి స్నేహితుడు కెన్యాట్టా కూడా ఉన్నారని చెప్పారు. ఎనిమిదేళ్ల వయసు నుంచి తమ మధ్య ఉన్న స్నేహాన్ని, కష్టకాలంలో కెన్యాట్టా కుటుంబం తనకు అందించిన మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

క్రైస్తవ నమ్మకాలపై విమర్శలకు కౌంటర్

హిందూ దేవుళ్లకు పూజలు చేయడంపై కొందరు నెటిజన్లు ఆయన మతాన్ని, నమ్మకాలను ప్రశ్నించగా, టైరీస్ వారికి గట్టి సమాధానమిచ్చారు. తనకు యేసుక్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. ఇది తనకు భారతదేశానికి రెండో పర్యటన అని, కానీ ఆధ్యాత్మిక శోధన చేయడం మాత్రం ఇదే తొలిసారని చెప్పారు.

"భారతదేశ సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసిన తర్వాత నాలో ఒక తెలియని ప్రశాంతత, సానుకూల శక్తులు ప్రవహించాయి. దాదాపు 40 నిమిషాల పాటు కదలకుండా స్థిరంగా కూర్చుండిపోయాను. నా ప్రభువైన యేసుక్రీస్తును నేను ఎల్లప్పుడూ సగర్వంగా ప్రతిబింబిస్తాను, నా నమ్మకాలను ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు" అని టైరీస్ విమర్శకులకు బదులిచ్చారు.

నటుడిగా, రచయితగా, సింగర్‌గా గుర్తింపు

ప్రస్తుతం తన భాగస్వామి జెలీ తిమోతి, స్నేహితుడితో కలిసి మరో ఐదు రోజుల పాటు ఇండియాలోనే గడపనున్నట్లు స్పష్టం చేశారు. 1990ల చివరలో ఆర్‌అండ్‌బీ (R&B) సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన టైరీస్, ఆ తర్వాత 'బేబీ బాయ్' (2001) చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆపై 'ట్రాన్స్‌ఫార్మర్స్' సిరీస్‌లోనూ రాబర్ట్ ఎప్స్ పాత్రతో మెప్పించారు. నటుడిగానే కాకుండా రచయితగా, రాపర్‌గా ఆయనకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe