Idupu Kayitham: ఇడుపు కాయితం రచ్చ- కమెడియన్ కౌంటర్- తెలంగాణ సినిమాకు ప్రత్యేక గుర్తింపు దక్కాలన్న నిర్మాత మధుర శ్రీధర్
Idupu Kayitham Title Controversy: ప్రియదర్శి కొత్త సినిమా 'ఇడుపు కాయితం' టైటిల్‌పై సోషల్ మీడియాలో రాజుకున్న ప్రాంతీయ వివాదంపై ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బలగం' వంటి సినిమాలు తెలంగాణ మట్టి కథల సత్తాను చాటాయని, స్థానిక భాషను అవహేళన చేయడం సరికాదన్నారు.
Idupu Kayitham Title Controversy: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ ప్రధాన పాత్రల్లో వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఇప్పుడు ఈ సినిమా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఇడుపు కాయితం భాషా వివాదం
చిత్ర యూనిట్ ఇడుపు కాయితం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ చుట్టూ భాషా వివాదం, ప్రాంతీయ అస్తిత్వంతో ముడిపడిన పెద్ద చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు తెలంగాణ వాడుక భాషలో ఉన్న ఈ టైటిల్‌ను ఎగతాళి చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది.
"ఈ సినిమాను ఆంధ్రా భాషలోకి డబ్ చేస్తారా?", "తెలుగులో సబ్‌టైటిల్స్ ఉంటాయా", "సర్ తెలుగు భాషలో డబ్ చేస్తారా?..లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా?. సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్లమ్", "ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా?" అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేయడంతో వివాదం రాజుకుంది.
ఇది అసలు అచ్చమైన తెలుగు కాదంటూ మరికొందరు వాదించడం తెలంగాణ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దశాబ్దాలుగా కోస్తా ఆంధ్ర యాసలోనే సినిమాలు వస్తున్నప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు ఒక తెలంగాణ పదాన్ని వాడితే ఎందుకు వస్తోందంటూ స్థానిక నెటిజన్లు ఘాటుగా ఎదురుదాడికి దిగారు. చిత్తూరు (పుష్ప), శ్రీకాకుళం (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో) యాసలో సినిమాలు వస్తే చూడలేదా అంటూ తెలంగాణ నెటిజన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు.
రాహుల్ రామకృష్ణ కౌంటర్
అంతేకాకుండా చాలా వరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, పలువురు యాక్టివిస్టులు సైతం తెలంగాణ భాషను చులకన చేయడంపై విమర్శిస్తున్నారు. నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం తనదైన స్టైల్‌లో కౌంటర్స్ వేశారు.
"నాలుగు ప్రశ్నలు అడిగితే కుదరదు.. మన సినిమాలని, మన కథలని యాక్సెప్ట్ చేయలేరు. ఏం పర్వాలేదు.. మా ప్రియదర్శి గాడు చింపేస్తాడు. మేం ఇలాగే ముందుకు వెళ్తాం, మా కథల్ని మాకు నచ్చిన స్టైల్‌లో చెప్తాం" అని రాహుల్ రామకృష్ణ పోస్ట్ కూడా పెట్టారు.
ఆ పాత గాయాలను రేపడం అనవసరం: మధుర శ్రీధర్
ఈ సోషల్ మీడియా లొల్లి కాస్తా ప్రాంతీయ వివాదంగా మారుతున్న తరుణంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ వివాదంపై మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరంగా ఈ టైటిల్‌ను ఆంధ్రా-తెలంగాణ వివాదంగా మార్చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం అని అర్థం. తెలంగాణలో ఇది సర్వసాధారణంగా వాడుకలో ఉన్న పదం. ఒకవేళ ఆ పదానికి అర్థం తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి కానీ, ఇలా వెటకారంగా మాట్లాడటం సరికాదు. ఈ కామెంట్లు పాత ప్రాంతీయ విభేదాలను మళ్లీ రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి పోలికలు పూర్తిగా అనవసరం" అని మధుర శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇలాంటి చేదు అనుభవాలే
గతంలో తాను నిర్మించిన 'దొరసాని' సినిమా సమయంలోనూ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కూడా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో సోషల్ మీడియాలో కొందరు చౌకబారు కామెంట్లు చేశారని, అయితే సినిమా ఆత్మను ప్రతిబింబించే టైటిల్ కాబట్టే తాను వాటిని పట్టించుకోలేదని స్పష్టం చేశారు.
విమర్శలకు భయపడి అచ్చమైన కథలు చెప్పడం ఆపకూడదని, ఈ తరహా కామెంట్లు చేసేది కొద్దిమందే అయినా వారి సంకుచిత ఆలోచనా విధానాన్ని ఇది చూపిస్తుందని అన్నారు. సినిమాలో ఏదైనా ఆక్షేపణీయమైన అంశం ఉంటే విమర్శించవచ్చు కానీ, ఒక ప్రాంతీయ పదాన్ని అవహేళన చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని శ్రీధర్ రెడ్డి హితవు పలికారు.
బాక్సాఫీస్ వద్ద తెలంగాణ కథల ప్రభంజనం
స్థానిక యాస, సంస్కృతితో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారో గత కొన్ని విజయాలు నిరూపించాయని మధుర శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు. రూటెడ్ కథలకు థియేటర్లలో కాసుల వర్షం కురుస్తోందని స్పష్టం చేశారు.
"సుమారు రూ. 3 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో రూపొందిన 'బలగం' సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 20 కోట్ల వసూళ్లు సాధించి ఒక సాంస్కృతిక సంచలనంగా నిలిచింది. అలాగే ఇటీవల కేవలం రూ. 2 కోట్ల వ్యయంతో వచ్చిన 'రాజు వెడ్స్ రాంభాయ్' చిత్రం కూడా దాదాపు రూ. 10 కోట్ల కలెక్షన్లను రాబట్టింది" అని ఆయన గణాంకాలతో సహా వివరించారు.
ఈ విజయాలు తెలంగాణ మట్టి కథలకు ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని, సాంస్కృతిక ఆదరణను స్పష్టం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ జానపదాల్లో, గ్రామీణ జీవితాల్లో వందలాది అపరిచిత కథలు దాగి ఉన్నాయని, వాటిని వెండితెరకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. స్థానిక పదాలను హేళన చేయడం మాని, ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించాలని కోరారు.
'తెలంగాణ సినిమా'కు ప్రత్యేక గుర్తింపు దక్కాలి
భారతీయ చిత్రసీమలో మరాఠీ, పంజాబీ, భోజ్‌పురి సినిమాలు తమదైన ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఇండస్ట్రీలో భాగమయ్యాయని, అదే తరహాలో తెలంగాణ సంస్కృతి, కథలకు కూడా గుర్తింపు దక్కాలని మధుర శ్రీధర్ ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రాంతీయ కథలను, యాసను కాపాడుకోవడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనకు తెలుగు సినిమా ఎంత అవసరమో, అదే సమయంలో ఒక విశిష్ట సాంస్కృతిక గుర్తింపుగా 'తెలంగాణ సినిమా'ను కూడా అంతే గౌరవంగా సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


