...
...
Next Story

Janhvi Kapoor: బాలీవుడ్ కంటే టాలీవుడ్ బెటర్, దీపికా పదుకొణె పని గంటల వివాదం, తెలుగు ఇండస్ట్రీపై జాన్వీ కపూర్ కామెంట్స్

Janhvi Kapoor About Work Culture In Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైతో పోలిస్తే టాలీవుడ్‌లో సమయపాలన, టెక్నీషియన్లకు ఇచ్చే గౌరవం అద్భుతంగా ఉన్నాయని కొనియాడింది.

Published on: May 31, 2026, 17:26:18 IST
Advertisement

Janhvi Kapoor About Work Culture In Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ తాజాగా టాలీవుడ్ పనితీరు (Work Culture)పై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

క్రమశిక్షణ, సమయపాలన ఆకట్టుకున్నాయి

బాలీవుడ్ కంటే టాలీవుడ్ బెటర్, దీపికా పదుకొణె పని గంటల వివాదం, తెలుగు ఇండస్ట్రీపై జాన్వీ కపూర్ కామెంట్స్
బాలీవుడ్ కంటే టాలీవుడ్ బెటర్, దీపికా పదుకొణె పని గంటల వివాదం, తెలుగు ఇండస్ట్రీపై జాన్వీ కపూర్ కామెంట్స్

ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగు సినీ పరిశ్రమలో కనిపించే క్రమశిక్షణ, సమయపాలన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని జాన్వీ కపూర్ వెల్లడించింది. 'టైమ్స్ నౌ' ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ టాలీవుడ్ సెట్స్‌పై తన అనుభవాలను పంచుకుంది.

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ కపూర్‌కు ఇది రెండో తెలుగు సినిమా. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా దక్షిణాది చిత్రాలపై ఆమెకు మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీలో కేవలం నటీనటులకే కాకుండా సెట్స్‌పై రాత్రింబగళ్లు శ్రమించే ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు, క్రూ మెంబర్లకు ఇచ్చే గౌరవం అద్భుతమని ప్రశంసించింది.

సమయపాలనకు పెద్దపీట

తెలుగు సినిమా సెట్స్‌పై సమయాన్ని చాలా కచ్చితంగా పాటిస్తారని జాన్వీ కపూర్ తెలిపింది. "షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ చూపించే నిబద్ధత నాకు బాగా నచ్చింది. కేవలం నటీనటుల గురించే కాకుండా లైట్‌మెన్‌ నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ పని గంటలను ఇక్కడ గౌరవిస్తారు" అని జాన్వీ కపూర్ పేర్కొంది.

ఇదే సమయంలో బాలీవుడ్ పనితీరును టాలీవుడ్‌తో పోలుస్తూ జాన్వీ కపూర్ కొన్ని కీలక విషయాలను పంచుకుంది. ముంబైలోని ఫిల్మ్ సెట్స్‌లో ఒక్కో ప్రొడక్షన్ ఒక్కోలా పనిచేస్తుందని, అయితే అక్కడ పని గంటల విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుందని అంగీకరించింది. అక్కడ ఒక్కోసారి సమయపాలన సరిగ్గా ఉండదని ఆవేదన వ్యక్తం చేసింది.

నైట్ షూటింగ్స్ విషయంలోనూ టాలీవుడ్‌లో స్పష్టమైన ప్లానింగ్ ఉంటుందని జాన్వీ కపూర్ స్పష్టం చేసింది. "తెలుగు సినిమాల్లో నైట్ షిఫ్ట్ ఉంటే కచ్చితంగా రాత్రి 2 గంటలకల్లా ప్యాకప్ చెప్పేస్తారు. దీనివల్ల అందరికీ తగినంత విశ్రాంతి దొరుకుతుంది. కానీ, ముంబైలో పరిస్థితి వేరు. అక్కడ ఏ సమయానికి షూటింగ్ ముగుస్తుందో చెప్పలేం" అని జాన్వీ వివరించింది.

టాలీవుడ్‌లో రోజుకు 12 గంటల పాటు పనిచేసిన సందర్భాలు చాలా తక్కువని, దాదాపు అన్ని షూటింగ్స్ 9 నుంచి 10 గంటల్లోనే ముగిసిపోతాయని జాన్వీ కపూర్ చెప్పింది. అయితే, ఇటీవలి కాలంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని గంటలు, ఆర్టిస్టుల శ్రమపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

బాలీవుడ్‌లో రేగుతున్న పని గంటల వివాదం

కొద్దిరోజుల క్రితమే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె 'స్పిరిట్', 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ ప్రాజెక్టుల నుంచి పని గంటల సర్దుబాటు కుదరకపోవడం వల్లే తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి.

బాలీవుడ్ సెట్స్‌పై విపరీతమైన పని ఒత్తిడి ఉంటోందని, కఠినమైన కార్మిక సంస్కరణలు తీసుకురావాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం పరిశ్రమ స్వభావాన్ని సమర్థిస్తున్నారు. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ వర్క్ కల్చర్‌ను సమర్థించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో 'పెద్ది'

రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న 'పెద్ది' చిత్రం ఒక భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ 'అచియమ్మ' అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పెద్ది చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పెద్ది సినిమా జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe