Ranabaali Review: రణబాలి రివ్యూ- ఓవైపు కరువు మరోవైపు బ్రిటీషర్స్ అరాచకం- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?

Ranabaali Review And Rating: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి తర్వాత జంటగా నటించిన సినిమా రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామా ఇవాళ విడుదలైంది. 1876 నాటి కరువు నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకుందా? లేదా? అనేది నేటి రణబాలి రివ్యూలో చూద్దాం.

Published on: Oct 16, 2026, 12:30:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ranabaali Movie Review And Rating In Telugu: టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాలతో విజయ్, రష్మిక అలరించారు. అలాంటి ఈ జంట పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా రణబాలి.

రణబాలి రివ్యూ- ఓవైపు కరువు మరోవైపు బ్రిటీషర్స్ అరాచకం- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?
రణబాలి రివ్యూ- ఓవైపు కరువు మరోవైపు బ్రిటీషర్స్ అరాచకం- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?

పీరియాడిక్ యాక్షన్ డ్రామా

‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల తర్వాత డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన సినిమానే ఈ రణబాలి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్-రష్మిక, రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంతో రణబాలిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలాంటి రణబాలి సినిమా ఇవాళ (అక్టోబర్ 16) థియేటర్లలో విడుదలైంది. బ్రిటిష్ పాలనా కాలంలో సాగే కథతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో నేటి రణబాలి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

1876–1878 మధ్యకాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో సంభవించిన భయంకరమైన కరువు, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ ధాన్యపు ఎగుమతి విధానాలు భారతీయ సమాజాన్ని ఎలా దెబ్బతీశాయనే నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) తను పుట్టిన నేలను, గ్రామీణ ప్రజలను బ్రిటిష్ కమిషనర్ సర్ థియోడోర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) అరాచకాల నుంచి కాపాడటానికి పోరాటం ప్రారంభిస్తాడు. భద్ర మల్లన్న దేవత ఆశీస్సులతో, ధాన్యం ఎగుమతులను అడ్డుకుంటూ రణబాలి చేసిన సాయుధ పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం.

విశ్లేషణ: ప్లస్, మైనస్‌లు

దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఎంచుకున్న 1876 కరువు నేపథ్యం, బ్రిటిష్ వారి దోపిడీ విధానాల కాన్సెప్ట్ బాగుంది. సినిమా మొదటి భాగం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. విజయ్-రష్మిక మధ్య ఉన్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్, రెండో భాగం ప్రారంభంలో వచ్చే కేవ్ (గుహ)లోని ఫైట్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.

అయితే గుహ ఫైట్ పూర్తయిన తర్వాత కథనంలో వేగం తగ్గుతుంది. రొటీన్, ఊహించదగ్గ సీన్లతో సెకండాఫ్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ చివరిలో 'కొబలి' పేరుతో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే, కొన్ని చోట్ల మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్ర ఛాయలు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో ఇంకాస్త బలం ఉండి ఉంటే 'రణబాలి' రేంజ్ మరోలా ఉండేది.

నటీనటుల ప్రదర్శన

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో ఒదిగిపోయాడు. కడప యాసను చాలా చక్కగా పలికారు. రష్మిక మందన్నాతో వచ్చే సన్నివేశాలలో ఆయన నటన ఎంతో సహజంగా ఉంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలలో, యాక్షన్ సీన్లలో విజయ్ మెప్పించాడు.

ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ని ఎంతో పరిణతితో పండించారు. 'ది మమ్మీ' ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ కమిషనర్‌గా తనదైన శైలిలో భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించారు. ఆయన హావాభావాలు, కోపం భయపెడతాయి. ఈశ్వరీ రావు తల్లి పాత్రలో తన అనుభవాన్ని చూపించగా, వినోద్ సాగర్ ఇతర నటీనటులు తమ పరిధి మేర మెప్పించారు.

సాంకేతిక బలం

బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. "ఎందయ్యా సామీ" పాట వినసొంపుగా ఉండి, వెండితెరపై కంటికి హాయిగా అనిపిస్తుంది. జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా అందించిన సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది. పీరియడ్ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు.

గుహలో జరిగే ఫైట్ సీన్‌లో కెమెరా పనితనం మెప్పిస్తుంది. అయితే రెండో భాగంలో ఎడిటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. దాదాపు 15 నిమిషాల నిడివి తగ్గించి ఉంటే బాగుండేది. మద్రాస్ పోర్ట్ సన్నివేశాలలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యత తగ్గింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా రిచ్‌గా ఉన్నాయి.

తీర్పు

మొత్తంగా చూస్తే, పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో 'రణబాలి' మంచి ప్రయత్నం. ఆకట్టుకునే ఫస్టాఫ్, లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్. కానీ రెండో భాగంలో స్లో నెరేషన్, ఊహించగలిగే సీన్లు కొంతమేర ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారు రణబాలిని ఎంచక్కా చూసేయొచ్చు.

రేటింగ్: 3/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More