High energy foods : మాటిమాటికీ ఎనర్జీ క్రాష్ అవుతోందా? ఈ 5 సూపర్ ఫిడ్స్ మీ డైట్‌లో ఉండాల్సిందే..
Superfoods For Energy : నిరంతర అలసట, నీరసంతో బాధపడుతూ ఎనర్జీ కోసం పదే పదే కాఫీలు తాగుతున్నారా? అయితే నిపుణులు సూచించిన 5 అద్భుతమైన ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే రోజంతా నిలకడైన శక్తిని పొందవచ్చు. అవేంటంటే..
Natural Energy Boosters : ఆఫీసులో సుదీర్ఘమైన పని గంటలు, సరిగ్గా లేని నిద్ర వేళలు, బిజీ లైఫ్‌స్టైల్.. ఇవన్నీ ఈ రోజుల్లో చాలామందిని తీవ్రమైన అలసటకు గురిచేస్తున్నాయి. దీనితో రోజంతా నెట్టుకురావడానికి చాలామంది పదే పదే కాఫీ కప్పులను ఆశ్రయిస్తున్నారు. అయితే కెఫిన్ తాత్కాలికంగా మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచినప్పటికీ, ఆ ఎనర్జీ ఎక్కువసేపు నిలవదు! కాఫీ తాగిన కాసేపటికే ఒంట్లో శక్తి ఒక్కసారిగా పడిపోవడం, నీరసం ఆవరించడం లేదా చిరాకు రావడం వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. అందుకే, ఎనర్జీ కోసం కాఫీపై ఆధారపడకుండా.. సహజమైన ఆహారపు అలవాట్ల ద్వారా రోజంతా యాక్టివ్‌గా ఉండే మార్గాల వైపు జనాలు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజూ తీసుకునే సమతుల్య ఆహారంలో కొన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాలను చేర్చుకుంటే, అవి రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని నిలకడగా అందిస్తాయి.

ఈ నేపథ్యంలో కాఫీ, టీలకు మంచి ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న వారు తమ డైట్‌లో చేర్చుకోవాల్సిన ఆ 5 సూపర్‌ఫుడ్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రోజంతా ఫుల్ ఎనర్జీని ఇచ్చే 5 ఆయుర్వేద సూపర్‌ఫుడ్స్..
1. బాదంపప్పు :
బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని నెమ్మదిగా, స్థిరంగా విడుదల చేయడంలో సహాయపడతాయి. రాత్రిపూట బాదం గింజలను నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే వాటి పొట్టు తీసి తినడం వల్ల జీర్ణక్రియ సులువుగా మారుతుంది వివరించారు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ఫలితంగా భోజనానికి భోజనానికి మధ్యలో అకస్మాత్తుగా ఆకలి వేయడం, నీరసం రావడం వంటి సమస్యలు తలెత్తవు.
2. ఖర్జూరాలు :
ఖర్జూరాలను ప్రకృతి ప్రసాదించిన 'ఎనర్జీ బైట్స్' అని ఊరికే అనలేదు. వీటిలో గ్లూకోజ్ వంటి సహజ సిద్ధమైన చక్కెరలతో పాటు ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు ఉంటాయి. రిఫైన్డ్ షుగర్ (పంచదార)తో పోలిస్తే ఖర్జూరాలు శరీరానికి తక్షణ, సమతుల్యమైన శక్తిని అందిస్తాయి. వీటిని నట్స్‌తో (జీడిపప్పు, బాదం వంటివి) కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శోషణ ప్రక్రియ నెమ్మదించి, ఎక్కువ సమయం పాటు ఎనర్జీ అందుతుంది.
3. నెయ్యి :
మనం తినే ఆహారంలో కొద్దిగా ఆరోగ్యకరమైన కొవ్వును చేర్చుకోవడం వల్ల కూడా రోజంతా అలసట లేకుండా ఉండవచ్చు. అందుకు దేశీ ఆవు నెయ్యి ఉత్తమమైన ఎంపిక. మంచి కొవ్వులు చాలా నిదానంగా జీర్ణమవుతాయి, దీనివల్ల శరీరానికి సుదీర్ఘ కాలం పాటు ఇంధనం లభిస్తుంది. అంతేకాదు, ఈ కొవ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో, ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. నెయ్యి తినని వారు దానికి బదులుగా నట్ బట్టర్స్ (బాదం బట్టర్ లేదా పీనట్ బట్టర్) వంటి ప్రత్యామ్నాయాలను వాడవచ్చు.
4. అశ్వగంధ :
ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. కాలక్రమేణా శరీరం ఒత్తిడిని తట్టుకునేలా చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది, దీనివల్ల పరోక్షంగా మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సాధారణంగా దీనిని పాలతో లేదా ప్లాంట్-బేస్డ్ మిల్క్‌తో కలిపి తీసుకుంటారు. అయితే, అశ్వగంధను వాడే ముందు నిపుణుల లేదా ఆయుర్వేద వైద్యుల సరైన సలహా తీసుకోవడం మంచిదని ఆమె సూచించారు.
5. పచ్చ పెసలు :
పచ్చ పెసలు శరీరానికి చాలా తేలికైనవి. వీటిలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి, ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. వీటిని సూప్‌లు, పప్పులు లేదా సలాడ్‌ల రూపంలో రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, తగ్గడం వంటివి జరగవు. ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల కలయిక వల్ల ఇవి రోజంతా స్థిరమైన శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఎనర్జీ క్రాష్ (నీరసం) బారిన పడకుండా ఉండటానికి సులువైన చిట్కాలు..
రోజంతా యాక్టివ్‌గా ఉండటం అనేది కేవలం ఏదో ఒక "సూపర్‌ఫుడ్" తినడం వల్ల మాత్రమే సాధ్యం కాదు, శరీరానికి నిరంతరం పోషకాలను అందించేలా ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. మనం తినే తిండిలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు లోనై నీరసం వస్తుంది.
రోజంతా స్థిరమైన ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని సాధారణ అలవాట్లను సూచించారు:
ప్లేట్ సమతుల్యత: ప్రతి భోజనంలోనూ ప్రొటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇది జీర్ణక్రియను క్రమబద్ధం చేసి శక్తిని క్రమంగా విడుదల చేస్తుంది.
భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ వద్దు: ఎక్కువ సమయం పాటు ఆకలితో ఉండటం లేదా చాలా ఆలస్యంగా తినడం వల్ల తీవ్రమైన అలసట వస్తుంది. దీనివల్ల ఆ తర్వాత ఎక్కువగా తినే ప్రమాదం కూడా ఉంది.
హైడ్రేటెడ్‌గా ఉండండి: శరీరంలో కొద్దిగా నీటి శాతం తగ్గినా సరే.. తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, అలసట వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.
కెఫిన్‌ను పరిమితం చేయండి: అప్పుడప్పుడు కాఫీ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దాన్నే అలవాటుగా మార్చుకుంటే నిద్రలేమి సమస్యలు వచ్చి, దీర్ఘకాలిక అలసటకు దారితీస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యానికి ప్రాధాన్యత: నానబెట్టిన నట్స్, పెసలు వంటి తేలికపాటి ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది. ఇది స్థిరమైన శక్తికి పునాది వేస్తుంది.
కాఫీ లేదా చక్కెర పదార్థాలు ఇచ్చే తాత్కాలిక జోష్ కాకుండా, రోజంతా అలసిపోకుండా యాక్టివ్‌గా ఉండటానికి ఈ చిన్న చిన్న మార్పులను, పోషకాలతో కూడిన ఆహారాన్ని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి నుంచే వీటిని మీ మెనూలో చేర్చేసుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


