Unhealthy snacks : ఏది పడితే అది తింటే అంతే! ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవడం ఎలా?
ప్రయాణాల్లో ఆకలి వేసినప్పుడు, లేదా బోర్ కొట్టినప్పుడు, లేద సులభంగా ఏదైనా తినాలనిపించినప్పుడు.. ప్యాకెట్ స్నాక్స్ కొంటూ ఉంటాము. అయితే అవి కొనే ముందు వాటి పదార్థాలు, నూనె, ప్రోటీన్ వంటి అంశాలను ఎలా పరిశీలించాలో పతంగ్ సీఈఓ శౌర్య గుప్తా వివరించారు.
హడావుడిగా ఇల్లు వదిలి, ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుని, మీటింగ్‌ల మధ్య పరుగులు పెడుతుండగా లేదా విమానం అందుకోవాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేస్తుంది. మనం తరచూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాము. ఇలాంటి సమయంలో దగ్గర్లోని షెల్ఫ్ నుంచి ఏదో ఒక ప్యాకెట్ తీసుకుని తినడం చాలా సులభం. అయితే ప్రయాణాల్లో లేదా హడావుడిలో ఉన్నప్పుడు, లేదా బోర్ కొట్టినప్పుడు తీసుకునే స్నాక్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా?

పతంగ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శౌర్య గుప్తా మనం తినే చిరుతిండిని ఎంచుకునే ముందు ఏయే విషయాలు పరిశీలించాలో కొన్ని సూచనలు చేశారు.
ఆరోగ్యకరమైన స్నాక్ అంటే ఏంటి?
హెల్తీ స్నాక్ అంటే.. కేవలం "హెల్తీ" అని లేబుల్ ఉన్న పదార్థాన్ని వెతకడం మాత్రమే కాదని శౌర్య స్పష్టం చేశారు. ఒక మంచి స్నాక్ అనేది నిజ జీవితంలో మన అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని, అది రుచికరంగా ఉండటంతోపాటు మోసుకెళ్లడానికి సులువుగా ఉండాలని చెప్పారు. ఆకలిని సంతృప్తిపరచడమే కాకుండా, తిన్న తర్వాత మనకు శక్తిని, మంచి అనుభూతిని ఇవ్వాలన్నారు.
స్నాక్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
పదార్ధాల జాబితాను పరిశీలించండి..
ముందుభాగంలో ఉండే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మకుండా వెనక ఉండే పదార్థాల జాబితాను ముందుగా చూడాలని శౌర్య సూచించారు. ధాన్యాలు, గింజలు, పప్పుధాన్యాలు, విత్తనాలు, మసాలాలు వంటి మనకు తెలిసిన పదార్థాలు ఉంటే మంచిది. జాబితా ఎంత చిన్నగా, సులభంగా అర్థమయ్యేలా ఉంటే, మనం అసలు ఏం తింటున్నామో అంత స్పష్టంగా తెలుస్తుంది.
పోషక విలువలు ఉండేలా చూసుకోండి..
స్నాక్ అనేది కేవలం ఇరవై నిమిషాల పాటు ఆకలిని ఆపడం మాత్రమే చేయకూడదు. ప్రోటీన్, ఫైబర్, తృణధాన్యాలు ఉన్న స్నాక్స్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి. అలాగే తర్వాతి భోజనం వరకు మనకు శక్తిని అందిస్తాయి.
ఏ నూనె వాడుతున్నారో గమనించండి..
ప్యాక్ చేసిన స్నాక్స్‌లో ఉపయోగించే కొవ్వు పదార్థం చాలా ముఖ్యమైనదని, ముఖ్యంగా వాటిని తరచూ తింటుంటే ఇది మరింత శ్రద్ధ పెట్టాలని శౌర్య పేర్కొన్నారు. షెల్ఫ్‌లో ఉన్న ప్రతీ స్నాక్ ఒకేలా తయారవుతుందని భావించకుండా, ఏ నూనెను ఉపయోగించారో ఒకసారి తనిఖీ చేయండి.
ఉప్పు, పంచదార మోతాదును గమనించండి..
వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని స్నాక్స్ మనం ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో వీటిని కలిగి ఉంటాయి. పోషకాహార సమాచారాన్ని ఒకసారి పరిశీలిస్తే ఒక్కసారి తిన్నప్పుడు మన శరీరానికి ఎంత అందుతుందో అర్థమవుతుంది.
ప్రయాణానికి అనుకూలంగా ఉందా లేదా చూడండి..
ఆవశ్యకతను బట్టి ఆన్-ది-గో స్నాక్ ఒక నిర్దిష్టమైన పని చేయాలి. అది ప్రయాణ ఒత్తిడిని తట్టుకోవాలి, బ్యాగ్‌లో పట్టాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా తినేలా ఉండాలి. సులభంగా తీసుకెళ్లగలగడం కూడా ఇందులో ఒక భాగమే.
మిమ్మల్ని పూర్తిగా సంతృప్తిపరిచేది ఎంచుకోండి..
స్నాక్ పరిమాణంలో చాలా చిన్నదిగా లేదా కేవలం ఆకలిని ఏదోలా తీర్చేలా ఉండకూడదు. అది తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక సంతృప్తికరమైన అనుభూతిని ఇస్తుంది.
రుచిని కూడా మరచిపోవద్దు..
మెరుగైన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు రుచిని తరచుగా విస్మరిస్తుంటాం. ఆహారం అనేది ఆస్వాదించడానికి మాత్రమే. మన దేశంలో రుచికరమైన చిరుతిళ్లకు ఎప్పుడూ కొదువ లేదు. వేయించిన శనగలు, మఖానా నుంచి ప్రాంతీయ మిశ్రమాలు, మసాలా నూనె గింజలు, లెక్కలేనన్ని ధాన్యాలు , పప్పుధాన్యాల ఆధారిత తయారీలతో మన ఆహార సంప్రదాయం ఎప్పుడూ సాధారణ పదార్థాలను కూడా ఎంతో రుచికరంగా మలచడంలో ముందుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


