vitamin D supplements : విటమిన్ డీ సప్లిమెంట్లు వాడేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి!

vitamin D supplements : విటమిన్-డీ సప్లిమెంట్లు వాడుతున్నా మీలో నీరసం తగ్గట్లేదా? ఎముకల నొప్పులు అలాగే ఉన్నాయా? అయితే మీరు విటమిన్-డీ తీసుకునే పద్ధతిలో లోపం ఉండవచ్చు. ఈ విటమిన్ సరిగ్గా అందాలంటే పాటించాల్సిన సూత్రాలు ఇక్కడ చూసేయండి..

Published on: Apr 15, 2026 3:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vitamin D tablets : మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు ఉక్కులా మారాలన్నా, మనసు ఉల్లాసంగా ఉండాలన్నా విటమిన్-డీ చాలా అవసరం. దీనినే మనం 'సన్‌షైన్ విటమిన్' అని కూడా పిలుస్తాం. అయితే, చాలా మంది విటమిన్-డీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా, వారి రక్త పరీక్షల్లో ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటం లేదు. విటమిన్-డీ మన ఒంటికి పట్టకపోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణమని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ షబానా పర్వీన్ వివరిస్తున్నారు.

విటమిన్​ డీ సప్లిమెంట్లు వాడుతున్నారా?
విటమిన్​ డీ సప్లిమెంట్లు వాడుతున్నారా?

ఈ నేపథ్యంలో విటమిన్-డీ మీ శరీరానికి సరిగ్గా అందాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

1. మెగ్నీషియం లేకపోతే అది వృథానే!

చాలా మంది విటమిన్-డీ సప్లిమెంట్లపైనే దృష్టి పెడతారు కానీ, మెగ్నీషియం గురించి పట్టించుకోరు. శరీరంలో మెగ్నీషియం తగినంత లేకపోతే, మీరు ఎంత విటమిన్-డీ తీసుకున్నా ఉపయోగడం ఉండదు. అమెరికా వంటి దేశాల్లో దాదాపు 50 శాతం మందిలో విటమిన్-డీ లోపానికి మెగ్నీషియం కొరతే ప్రధాన కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఏం చేయాలి?: మీ డైట్‌లో పాలకూర, బాదం పప్పులు, డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు ఉండేలా చూసుకోండి. అవసరమైతే డాక్టర్ సలహాతో మెగ్నీషియం సప్లిమెంట్లు వాడండి.

2. విటమిన్ కే2, కాల్షియం కలయిక

విటమిన్-డీ అనేది కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. కానీ, శరీరంలో విటమిన్ కే2 తగినంత లేకపోతే, ఆ కాల్షియం ఎముకల్లోకి చేరడానికి బదులు రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

నిపుణుల సూచన: "విటమిన్-డీ, కేే2లను కలిపి తీసుకోవడం వల్ల కాల్షియం నేరుగా ఎముకలకు చేరుతుంది. తద్వారా ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రావు," అని షబానా పర్వీన్ పేర్కొన్నారు. చీజ్, కోడిగుడ్డు సొన వంటి వాటిలో కే2 లభిస్తుంది.

3. ఖాళీ కడుపుతో అస్సలు వద్దు!

విటమిన్-డీ అనేది 'ఫ్యాట్ సొల్యూబుల్' (కొవ్వులో కరిగే) విటమిన్. అంటే, ఇది మన శరీరంలోకి చేరాలంటే మనం తినే ఆహారంలో కొంచెం కొవ్వు ఉండాలి.

సరైన పద్ధతి: ట్యాబ్లెట్లను ఖాళీ కడుపుతో వేసుకోవడం వల్ల వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే పెరుగు, గుడ్లు లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్న తర్వాతే విటమిన్-డీ తీసుకోవాలి. లో-ఫ్యాట్ లేదా కొవ్వు లేని ఆహారంతో దీనిని తీసుకుంటే ఆశించిన ఫలితం ఉండదు.

4. ఎండతో స్నేహం.. ఏడాది పొడవునా!

కేవలం ఎండాకాలంలో ఎండలో తిరిగితే విటమిన్-డీ సరిపోతుందనేది ఒక అపోహ. మన చర్మంపై నేరుగా సూర్యరశ్మి పడటం చాలా ముఖ్యం.

సమయం: రోజుకు కనీసం 10 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల శరీరం విటమిన్-డీని సహజంగా ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే, చర్మం కమిలిపోకుండా జాగ్రత్త వహించాలి. ఆఫీసుల్లో ఉండేవారు, ఎండ తగలని వారు ఏడాది పొడవునా సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

5. సరైన మోతాదు తెలుసుకోండి

ఎంత పడితే అంత విటమిన్-డీ వాడటం ప్రమాదకరం. వయసును బట్టి దీని మోతాదు మారుతుంది:

0-12 నెలల పిల్లలకు: 400 IU (10 mcg)

1-70 ఏళ్ల వారికి: 600 IU (15 mcg)

71 ఏళ్లు పైబడిన వారికి: 800 IU (20 mcg)

గర్భిణీలు: 600 IU (15 mcg)

విటమిన్-డీ సప్లిమెంట్లు మొదలుపెట్టే ముందు ఒకసారి రక్త పరీక్ష చేయించుకుని, వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఆరోగ్యపరమైన విషయాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. విటమిన్-డీ వేసుకోవడానికి ఉత్తమ సమయం ఏది?

సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విటమిన్-డీ తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారంతో దీనిని తీసుకుంటే గ్రహణ శక్తి పెరుగుతుంది.

2. ఎండలో ఎంతసేపు ఉండాలి?

సహజంగా విటమిన్-డీ అందాలంటే రోజుకు 10 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. అయితే, చర్మ రంగు, వాతావరణాన్ని బట్టి ఈ సమయం మారవచ్చు.

3. కేవలం ఆహారం ద్వారానే విటమిన్-డీ పొందవచ్చా?

చేపలు, గుడ్లు వంటి కొన్ని ఆహారాల్లో విటమిన్-డీ ఉంటుంది. కానీ మన శరీరానికి అవసరమైన పూర్తి మోతాదు కేవలం ఆహారం ద్వారా అందడం కష్టం. అందుకే ఎండ, అవసరమైతే సప్లిమెంట్లు అవసరం.

4. విటమిన్-డీ లోపిస్తే ఏమవుతుంది?

ఎముకలు బలహీనపడటం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడటం, వెన్నునొప్పి, జుట్టు రాలడం, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More