Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డో ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. ఆ ఒక్క విషయంలో చాలా స్ట్రిక్ట్!
Cristiano Ronaldo fitness : 41ఏళ్ల వయసులోనూ చిరుతపులిలా మైదానంలో పరుగెడుతుంటాడు దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో! ఇదెలా సాధ్యం? ఆయన డైట్ ఏంటి? ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..
ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో ఒక సంచలనం! 41 ఏళ్ల వయసులో కూడా తనకంటే సగం వయసున్న కుర్రాళ్లతో పోటీపడుతూ మైదానంలో చిరుతపులిలా దూసుకెళుతుంటాడు. ఆయన అద్భుతమైన ఫిజిక్ వెనుక ఉన్న రహస్యం ఏంటని అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే, రొనాల్డో ఫిట్‌నెస్ వెనుక ఎలాంటి 'మాయా మంత్రాలు' లేవని, కేవలం కఠినమైన క్రమశిక్షణ మాత్రమే ఉందని ఆయన మాజీ పర్సనల్ చెఫ్ జార్జియో బరోన్ వెల్లడించారు.

విలాసవంతమైన భోజనం కాదు.. సింపుల్ డైట్!
సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఖరీదైన ఆహారం తీసుకుంటారని మనం అనుకుంటాము. కానీ రొనాల్డో విషయంలో అది తప్పు అని బరోన్ పేర్కొన్నారు. జువెంటస్ క్లబ్ తరపున ఆడుతున్న సమయంలో రొనాల్డోకు చెఫ్‌గా పనిచేసిన ఆయన, రొనాల్డో ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఏమి తింటారు?: రొనాల్డో ప్రధానంగా అవకాడో, గుడ్లు, తాజా కూరగాయలు, చికెన్, చేపలు వంటి లీన్ ప్రొటీన్లను తీసుకుంటారు. పాలిష్ చేసిన బియ్యానికి బదులు నలుపు లేదా ఎరుపు రంగు బియ్యాన్ని వాడతారు.
సూపర్ ఫుడ్స్: కాలేయం వంటి ఆర్గాన్ మీట్స్‌ను ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తక్కువ మసాలాలతో ఇంట్లో వండిన ఆహారానికే రొనాల్డో మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
విషంతో సమానం: పంచదారకు నో!
క్రిస్టియానో రొనాల్డో పాటించే నియమాల్లో అత్యంత కఠినమైనది చక్కెరను పూర్తిగా పక్కన పెట్టడం. కాఫీలో కూడా ఆయన అస్సలు షుగర్ తీసుకోరు. "చక్కెర అనేది మన శరీరానికి ఒక విషం" అనేది రొనాల్డో నమ్మకం. అలాగే కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, మైదాతో చేసిన పిజ్జా, పాస్తా వంటి ఆహార పదార్థాలకు ఆయన ఆమడ దూరంలో ఉంటారు.
60 శాతం ఆహారం.. 40 శాతం శిక్షణ!
"చాలా మంది అథ్లెట్లు రాత్రిపూట వీడియో గేమ్స్ ఆడుతూ నిద్రను పాడు చేసుకుంటారు. కానీ రొనాల్డో అలా కాదు" అని బరోన్ తెలిపారు. రొనాల్డో రాత్రిపూట చాలా త్వరగా భోజనం చేస్తారు. నిండు కడుపుతో పడుకుంటే నిద్ర సరిగ్గా పట్టదని, అది రికవరీని దెబ్బతీస్తుందని ఆయన భావిస్తారు. రొనాల్డో విజయంలో 60 శాతం పాత్ర ఆహారానిదే అయితే, 40 శాతం మాత్రమే కఠినమైన శిక్షణది అని ఆయన చెఫ్ వివరించారు.
క్రమశిక్షణే అసలైన రహస్యం..
రొనాల్డో డైట్‌లో 'చీట్ డేస్' (ఇష్టమొచ్చినట్టు తినే రోజులు) అసలు ఉండవు. తన శరీరం ఎంత కష్టపడుతుందో దానికి తగినంత పోషకాలను మాత్రమే అందిస్తారు తప్ప అనవసరమైన క్యాలరీల లెక్కలు వేసుకోరు. 41 ఏళ్ల వయసులో కూడా ఆయన యువకుడిలా ఉండటానికి కారణం.. సరైన పనులను ప్రతిరోజూ అలసత్వం లేకుండా చేయడమే.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. రొనాల్డో తీసుకునే ప్రధాన ఆహారం ఏంటి?
తాజా కూరగాయలు, చికెన్, చేపలు, గుడ్లు, ఆలివ్ ఆయిల్ రొనాల్డో డైట్‌లో ప్రధానంగా ఉంటాయి.
2. రొనాల్డో పంచదార ఎందుకు తీసుకోరు?
పంచదార శరీరానికి విషం వంటిదని ఆయన భావిస్తారు. అది ఫిట్‌నెస్‌ను మరియు స్టామినాను తగ్గిస్తుందని ఆయన నమ్మకం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


