Quick Weight Loss : వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త..! ప్రముఖ వైద్యుడి సూచనలివే
Quick Weight Loss : అతి తక్కువ సమయంలో బరువు తగ్గితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. క్రాష్ డైట్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వివరంగా ఓ పోస్ట్ రాశారు.
Quick Weight Loss : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిదీ వేగంగా జరిగిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. బరువు తగ్గడం విషయంలోనూ ఇదే మాదిరిగా ఆలోచిస్తున్నారు. ఇందుకోసం వేగంగా బరువు తగ్గే పలు పద్ధతులపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే….. ఇలా వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరానికి నష్టం జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదే విషయంపై హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇటీవల నిర్మాత బోనీ కపూర్ జిమ్‌కు వెళ్లకుండానే, రాత్రి భోజనం మానేసి కేవలం పండ్లను తింటూ 26 కిలోల బరువు తగ్గడం చర్చనీయాంశమైన నేపథ్యంలో డాక్టర్ సుధీర్ స్పందించారు.
ఏప్రిల్ 10న 'X' (ట్విట్టర్) వేదికగా డాక్టర్ సుధీర్ కుమార్ బరువు తగ్గడంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. "ఊబకాయం అనేది ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య, కానీ అది హార్ట్ ఎటాక్ లాంటి 'మెడికల్ ఎమర్జెన్సీ' కాదు. వారాల్లోనో, రోజుల్లోనో బరువు తగ్గాలని శరీరాన్ని ఒత్తిడికి గురిచేయాల్సిన అవసరం లేదు. అలా బలవంతంగా బరువు తగ్గించడం వల్ల శరీరంలో ప్రతికూల జీవక్రియలు మొదలవుతాయి" అని ఆయన వివరించారు. క్రాష్ డైట్స్ (Crash Diets) అనుసరించడం వల్ల మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
వేగంగా బరువు తగ్గడం - ప్రధాన సమస్యలు:
బరువు తగ్గటం అనేది స్కేల్ పై కనిపించే అంకెలకు సంబంధించినది మాత్రమే కాదని, అది శరీర అంతర్గత వ్యవస్థపై చూపే ప్రభావం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
కండరాల క్షీణత (Muscle Wasting): వేగంగా బరువు తగ్గినప్పుడు శరీరంలోని కొవ్వు కంటే సన్నని కండరాల (Lean Muscle) నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియ రేటును గణనీయంగా తగ్గిస్తుంది.
హార్మోన్ల మార్పులు: బరువు వేగంగా తగ్గినప్పుడు ఆకలిని పెంచే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల బాడీ ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లు భ్రమ కలిగిస్తుంది, ఫలితంగా అతిగా తినకుండా నియంత్రించుకోవడం కష్టమవుతుంది.
యో-యో ఎఫెక్ట్ (Yo-Yo Effect): వేగంగా తగ్గిన బరువు అంతే వేగంగా తిరిగి పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
సరైన విధానం ఏమిటి?
స్థిరమైన , ఆరోగ్యకరమైన మార్పులను డాక్టర్ సుధీర్ సూచించారు. "నిజమైన విజయం బరువు తగ్గే వేగంలో లేదు.. ఆ తగ్గిన బరువును ఎంతకాలం స్థిరంగా ఉంచుకున్నామనే దానిపైనే ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
ఆయన సూచనల మేరకు… 3 నుంచి 6 నెలల వ్యవధిలో కేవలం 5 నుంచి 10 శాతం బరువు తగ్గడం ఆరోగ్యకరమైన బరువు తగ్గే లక్ష్యం. ఈ తరహా విధానం… కార్డియోమెటబాలిక్ (గుండె మరియు జీవక్రియ) ప్రమాదాలను తగ్గిస్తుంది. దీనిని పాటించడం చాలా సులభమని ఆయన వివరించారు. అందం కోసం శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా… ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
గమనిక: ఈ కథనం సోషల్ మీడియాలో నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది. ఏదైనా డైట్ లేదా బరువు తగ్గే ప్రణాళికను ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

