Cancer injection : క్యాన్సర్ వైద్యంలో విప్లవం- భారత్‌లోకి వచ్చేసిన సరికొత్త ఇంజెక్షన్! ధర మాత్రం..
భారతదేశంలో క్యాన్సర్ చికిత్సను మరింత సులభతరం చేస్తూ రోచ్ ఫార్మా సంస్థ ‘టెసెంట్రిక్’ అనే సరికొత్త 7 నిమిషాల క్యాన్సర్ ఇంజెక్షన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడే రోగులకు గంటల కొద్దీ ఐవీ థెరపీ ఇచ్చే అవసరం లేకుండా, చర్మం కింద ఇచ్చే ఈ ఇంజెక్షన్ పెద్ద ఉపశమనం కలిగించనుంది.
భారతదేశ క్యాన్సర్ చికిత్స రంగంలో ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన రోగుల కోసం కేవలం ఏడు నిమిషాల్లోనే ఇచ్చేలా ఒక విప్లవాత్మక క్యాన్సర్ ఇంజెక్షన్‌ను దేశంలోకి వచ్చింది. రోచ్ ఫార్మా ఇండియా సంస్థ ఈ ‘టెసెంట్రిక్’ (Tecentriq) అనే డ్రగ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనివల్ల క్యాన్సర్ ఇమ్యునోథెరపీ చికిత్స మరింత వేగంగా, సౌకర్యవంతంగా మారనుంది. సాధారణంగా ఆసుపత్రుల్లో నరాల ద్వారా ఇచ్చే సాంప్రదాయ ఇంట్రావీనస్ (ఐవీ) చికిత్సకు కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ, ఈ సరికొత్త ఇంజెక్షన్‌ను చర్మం కింద వ్వడం వల్ల కేవలం 7 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుంది. భారతదేశంలో అత్యంత సాధారణంగా కనిపించే ‘నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్’ బాధితులకు ఈ చికిత్స అందించనున్నారు.

ఈ కొత్త పద్ధతి వల్ల రోగులకు ఆసుపత్రిలో గడపాల్సిన సమయం తగ్గడమే కాకుండా, హాస్పిటల్స్ పై కూడా ఒత్తిడి తగ్గుతుందని వైద్యులు భావిస్తున్నారు. అయితే, ఈ మందు ధర చాలా ఎక్కువగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?
క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలపై నేరుగా దాడి చేస్తుంది. ఈ ప్రక్రియలో శరీరంలోని మంచి కణాలు కూడా దెబ్బతింటాయి. కానీ ఇమ్యునోథెరపీ అలా కాదు, ఇది శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తుంది. కీమోథెరపీతో పోలిస్తే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) చాలా తక్కువగా ఉంటాయి.
ఈ కొత్త ఇంజెక్షన్‌లో ‘అటెజోలిజుమాబ్’ అనే మందు ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ‘పీడీ-ఎల్1’ అనే ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. సాధారణంగా క్యాన్సర్ కణాలు ఈ పీడీ-ఎల్1 ప్రోటీన్ వెనుక దాక్కుని రోగనిరోధక వ్యవస్థ కంటికి పడకుండా తప్పించుకుంటాయి. ఈ ఇంజెక్షన్ ద్వారా ఆ ప్రోటీన్‌ను బ్లాక్ చేయగానే, శరీరంలోని రోగనిరోధక కణాలు క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించి వాటిని నాశనం చేస్తాయి. ముఖ్యంగా ట్యూమర్లలో పీడీ-ఎల్1 స్థాయిలు ఎక్కువగా ఉన్న రోగులకు ఈ చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ సరికొత్త ఇంజెక్షన్ ప్రత్యేకతలు..
వేగం, సౌకర్యం: గంటల తరబడి బెడ్‌పై పడుకుని ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకునే బాధ తప్పుతుంది. ఈ సబ్‌క్యుటేనియస్ ఇంజెక్షన్‌ను నేరుగా చర్మం కింద (సాధారణంగా తొడ భాగంలో) కేవలం 7 నిమిషాల్లో ఇచ్చేయవచ్చు. దీనివల్ల ఆసుపత్రుల్లో వెయిటింగ్ టైమ్, రద్దీ తగ్గుతాయి.
వృద్ధులకు మేలు: సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, ఆసుపత్రిలో ఎక్కువ సమయం గడపలేక అలసిపోయే వృద్ధ రోగులకు ఈ వేగవంతమైన ప్రక్రియ ఎంతో ఊరటనిస్తుంది.
ఎవరు అర్హులు?: లంగ్ క్యాన్సర్ బాధితుల్లో దాదాపు సగం మంది (ఎన్‌ఎస్‌సీఎల్‌సీ రోగులు) ఈ చికిత్సకు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే, రోగి శరీరంలో పీడీ-ఎల్1 ప్రోటీన్ స్థాయిలు ఎంత ఉన్నాయనేది పరీక్షించిన తర్వాతే వైద్యులు ఈ థెరపీని నిర్ణయిస్తారు. క్యాన్సర్ స్టేజ్ ఆధారంగా దీనిని విడిగా లేదా ఇతర చికిత్సలతో కలిపి ఇస్తారు.
ధర ఎంత? సామాన్యులకు అందుబాటులో ఉందా?
ఈ చికిత్సలో ఉన్న ఏకైక, అతిపెద్ద సవాలు దీని ధర. ఒక్క డోస్ ఇంజెక్షన్ ధర సుమారు రూ. 3.7 లక్షలు! సాధారణంగా ఒక పేషెంట్‌కు చికిత్స కాలంలో దాదాపు 6 డోస్‌లు అవసరమవుతాయి! అంటే మొత్తం ఖర్చు కొన్ని లక్షల రూపాయలవుతుంది. మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది మోయలేని భారం. అధునాతన పరిశోధనలు, టెక్నాలజీ కారణం వల్లే ఇమ్యునోథెరపీ మందులు ఇంత ఖరీదైనవిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇండియాలో ఇమ్యునోథెరపీ సైకిల్ ధరలు రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉన్నాయి.
రోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రోచ్ సంస్థ ‘బ్లూ ట్రీ’ అనే పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అలాగే ఈ మందును కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద చేర్చారు, దీనివల్ల కొంతమందికి రీఇంబర్స్‌మెంట్ లభిస్తుంది. అయినప్పటికీ, ఇలాంటి అధునాతన వైద్యం సామాన్యులందరికీ అందాలంటే ప్రభుత్వం మరిన్ని రాయితీలు ఇవ్వాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధర ఎక్కువైనా, క్యాన్సర్ రోగుల జీవన ప్రమాణాలను పెంచడంలో ఈ 7 నిమిషాల ఇంజెక్షన్ ఒక అద్భుత వైద్య ఆవిష్కరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


