Fitness habits : సంపూర్ణ ఆరోగ్యానికి ఏ అలవాటు ఎంత ముఖ్యం? టాప్-10 హెల్త్ హాబిట్స్‌..

Fitness habits ranking : ఫిట్‌నెస్, డైటింగ్, లైఫ్‌స్టైల్ చిట్కాలపై గందరగోళం వద్దంటున్నారు ప్రముఖ డాక్టర్ అలోక్ చోప్రా. నిద్ర, స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ నుంచి రన్నింగ్ వరకు 10 ఆరోగ్య అలవాట్లకు ఆయన ఇచ్చిన 1-10 ర్యాంకింగ్‌లతో కూడిన విశ్లేషణ ఇక్కడ చూడండి..

Published on: Jul 28, 2026, 07:29:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తినాలి? ఏ అలవాట్లు పాటిస్తే ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పుకోవచ్చు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో, ఎన్నెన్నో! వాటికి తగ్గట్టుగానే ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు.. రోజుకో రకమైన హెల్త్ టిప్స్ కనిపిస్తుంటాయి. ఏది చేయాలో, ఏది మానాలో తెలియక చాలామంది గందరగోళంలో పడిపోతుంటారు.

నిద్ర నుంచి రన్నింగ్ వరకు- టాప్ 10 ఫిట్​నెస్​ హాబిట్స్..
నిద్ర నుంచి రన్నింగ్ వరకు- టాప్ 10 ఫిట్​నెస్​ హాబిట్స్..

ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతూ దిల్లీకి చెందిన సీనియర్ డాక్టర్ అలోక్ చోప్రా ఇన్​స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. మన రోజువారీ ఆరోగ్యకర అలవాట్లను పరిశీలించి, శరీరంపై వాటి ప్రభావం ఆధారంగా 1 నుంచి 10 వరకు ర్యాంకింగ్‌లు కేటాయించారు. "కొన్ని అలవాట్లు మన ఆరోగ్యంపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే అత్యంత ముఖ్యమైన వాటి నుంచి తక్కువ ప్రాధాన్యం ఉన్నవాటి వరకు ఈ కౌంట్‌డౌన్ ఇస్తున్నాను," అని ఆయన వివరించారు.

అగ్రస్థానంలో నిద్ర, స్ట్రెంత్ ట్రెయినింగ్..

సామాజిక మాధ్యమాల్లో రకరకాల కొత్త ట్రెండ్లు రాజ్యమేలుతున్నప్పటికీ.. మనిషి ప్రాథమిక శరీర అవసరాలకే డాక్టర్ అలోక్ చోప్రా ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. మన ఆరోగ్యానికి అత్యంత కీలకమైనది ఏది అని ప్రశ్నించగా, ఆయన ఏమాత్రం ఆలోచించకుండా 'మంచి నిద్ర'కు నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు. శరీరం తేరుకోవడానికి, రీఛార్జ్ అవ్వడానికి నిద్రను మించినది లేదని స్పష్టం చేశారు.

ఆ తర్వాతి స్థానంలో బలాన్ని పెంచే వ్యాయామాలకు (Resistance/Strength Training) 2వ స్థానం కేటాయించారు. ఇది కండరాల బలానికి, ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఇక సరియైన సమయానికి భోజనం చేయడాన్ని నంబర్ 3 స్థానంలో నిలిపారు. ఎప్పుడు పడితే అప్పుడు తినే క్రాష్ డైట్ల కంటే, శరీర జీవక్రియలకు అనుగుణంగా వేళకు తినడమే చాలా ముఖ్యమని సీనియర్ డాక్టర్ చెప్పారు. జీర్ణక్రియ సరిగ్గా సాగడానికి వేళపాళా పాటించడం చాలా అవసరమని వివరించారు. అలాగే రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడానికి 4వ స్థానం ఇచ్చారు.

యోగా నుంచి ఐస్ బాత్ వరకు..

ప్రాచీన జీవన విధానాలు, వాతావరణ మార్పులకు సంబంధించిన విషయాలకు డాక్టర్ అలోక్ చోప్రా మధ్యస్థ ర్యాంకింగ్‌లు కేటాయించారు:

నంబర్ 5 - యోగా: శరీరం సులువుగా కదలడానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఒక అద్భుతమైన సమగ్ర సాధనమని చెబుతూ ఐదో స్థానం ఇచ్చారు డాక్టర్ అలోక్ చోప్రా.

నంబర్ 6 - ఐస్ బాత్, పెప్టైడ్స్: చల్లటి నీటి స్నానాలు చేయడం కొంచెం కష్టమైనప్పటికీ శరీరానికి మంచివేనని పేర్కొంటూ ఆరో స్థానం ఇచ్చారు. అలాగే శారీరక సమస్య రకాన్ని బట్టి పెప్టైడ్స్ థెరపీ చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నారు.

నంబర్ 7 - ఉదయాన్నే సూర్యరశ్మి: ఉదయాన్నే ఎండ తగలడం వల్ల శరీర సర్కాడియన్ రిథమ్ సమతుల్యంగా ఉండి, హార్మోన్ల నియంత్రణ సరిగ్గా జరుగుతుందన్నారు.

నంబర్ 8 - భోజనం తర్వాత నడక: భోజనం చేశాక కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ బాగుపడటంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని వివరించారు.

మద్యం, రన్నింగ్ విషయాల్లో ఊహించని విశ్లేషణ!

ఈ ర్యాంకింగ్స్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం మద్యం, రన్నింగ్‌లకు ఆయన ఇచ్చిన స్థానాలు.

మద్యాన్ని లేదా దానికి దూరంగా ఉండటాన్ని ఆయన 9వ స్థానంలో ఉంచారు. మద్యం అనేది శరీరానికి ఎలాంటి మేలూ చేయదని స్పష్టం చేస్తూనే.. "కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతూ అప్పుడప్పుడు పరిమితంగా డ్రింక్ చేయడంలో పెద్ద ముప్పేమీ ఉండదు," అని సామాజిక అనుబంధాలకు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.

ఇక గుండె ఆరోగ్యానికి మంచిదని అందరూ భావించే ‘రన్నింగ్’ను చివరిగా 10వ స్థానంలో నిలిపారు. రన్నింగ్ మంచిదే అయినప్పటికీ, అది అందరికీ సరిపడదని ఆయన వ్యాఖ్యానించారు. కొందరికి పరుగు మేలు చేస్తే, మరికొందరి శరీర తత్వానికి అది అంతగా ఉపయోగపడదని, కాబట్టి శారీరక సామర్థ్యాన్ని బట్టి వ్యాయామం ఎంచుకోవాలని సూచించారు.

ఎవరీ డాక్టర్ అలోక్ చోప్రా?

డాక్టర్ అలోక్ చోప్రా వైద్య రంగంలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ వైద్యులు. దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన ఆయన.. లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ సభ్యుడిగా ఉన్నారు. దిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లో పనిచేసిన అనంతరం లండన్‌లోని రాయల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్కూల్‌లో లెక్చరర్‌గా కూడా సేవలు అందించారు.