బీపీ, షుగర్ ఉన్నాయా? అయితే డెంగ్యూతో ప్రాణానికే ప్రమాదం

మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి డెంగ్యూ సోకితే ప్రాణాపాయం పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు ఉన్నవారిలో తీవ్రమైన డెంగ్యూ లక్షణాలు ఎందుకు కనిపిస్తాయో న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ వర్దాని వివరించారు.

Published on: Jun 16, 2026, 14:24:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో దశాబ్దాలుగా డెంగ్యూ జ్వరం ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, సుదీర్ఘమైన దోమల వ్యాప్తి కాలం వల్ల ఇప్పుడు ఏడాది పొడవునా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. 'ప్రపంచ డెంగ్యూ దినోత్సవం 2026' సందర్భంగా న్యూఢిల్లీలోని బీఎల్‌కే-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ వర్దాని హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి డెంగ్యూ సోకితే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.

బీపీ, షుగర్ ఉన్నాయా? అయితే డెంగ్యూతో ప్రాణానికే ప్రమాదం
బీపీ, షుగర్ ఉన్నాయా? అయితే డెంగ్యూతో ప్రాణానికే ప్రమాదం

డెంగ్యూ ప్రాథమిక లక్షణాలు - తీవ్రత

డెంగ్యూ వైరస్‌ను మోసుకెళ్లే ఈడెస్ దోమలు సాధారణంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఎక్కువగా కుడతాయని డాక్టర్ తెలిపారు. ఈ జ్వరం వస్తే మొదట్లో 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు తీవ్రమైన జ్వరం రావచ్చు. దాంతో పాటు తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక భాగంలో నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, గ్రంథుల వాపు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే ప్లాస్మా లీకేజీ, అంతర్గత రక్తస్రావం, బాడీ షాక్‌కు గురికావడం, అవయవాల వైఫల్యం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి.

"మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులు ఉన్నవారిలో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధుల వల్ల డెంగ్యూ ముప్పు పెరిగితే, డెంగ్యూ ఇన్ఫెక్షన్ వల్ల ఆయా వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువవుతుంది" అని డాక్టర్ వర్దాని పేర్కొన్నారు.

మధుమేహం, రక్తపోటుతో రెట్టింపు ముప్పు

మధుమేహం (షుగర్) ఉన్న రోగులకు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వచ్చే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వర్దాని వెల్లడించారు. "డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు కూడా ఉంటే, సాధారణ ప్రజలతో పోలిస్తే శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఏకంగా ఎనిమిది రెట్లు పెరుగుతుంది" అని ఆయన వివరించారు.

ఇక హైబీపీ (రక్తపోటు) ఉన్న రోగులకు డెంగ్యూ సోకితే, తీవ్రమైన లక్షణాలు బయటపడే అవకాశం 1.5 నుండి రెండు రెట్లు పెరుగుతుంది. ఇలాంటి వారికి ఐసీయూ (ICU) చికిత్స అవసరమయ్యే అవకాశాలు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇది శరీరంలో వాపును (Inflammation) పెంచి, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరం వైరస్‌ను త్వరగా నిర్మూలించలేకపోతుంది. ఫలితంగా ప్లాస్మా లీకేజీ, రక్తస్రావం, అవయవాల పనితీరు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. రక్తపోటు వల్ల రక్తనాళాలు ఇప్పటికే బలహీనపడి సున్నితంగా మారతాయి. గుండె జబ్బులు ఉన్నవారిలో, డెంగ్యూ వల్ల వచ్చే వాపును, ప్లాస్మా లీకేజీని తట్టుకునే శక్తి గుండెకు తగ్గుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గుండెపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.

ఊబకాయం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త

ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఉన్నవారికి కూడా డెంగ్యూ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని డాక్టర్ వర్దాని హెచ్చరించారు. "ఊబకాయం రోగనిరోధక శక్తిని దెబ్బతీసి శరీరంలో దీర్ఘకాలిక వాపునకు కారణమవుతుంది. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది" అని ఆయన వివరించారు.

అధిక బరువు వల్ల రక్తనాళాల పనితీరు దెబ్బతిని ప్లాస్మా లీకేజీ ప్రమాదం పెరుగుతుంది. సాధారణ బరువు ఉన్నవారితో పోలిస్తే, ఊబకాయం ఉన్నవారికి డెంగ్యూ వల్ల తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం దాదాపు 50 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరోవైపు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఉన్న రోగులు డెంగ్యూ బారిన పడితే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎక్కువగా వస్తుంది. అంతేకాదు, వీరిలో మరణాల ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ వర్దాని స్పష్టం చేశారు. కిడ్నీల పనితీరు మందగించడం వల్ల శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది రోగి షాక్‌కు గురికావడానికి లేదా అవయవాల వైఫల్యానికి దారితీస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More