Success Story : నీ ఓర్పుకు జోహారు బాస్! 12 రిజెక్షన్ల తర్వాత డ్రీమ్ జాబ్ కొట్టిన టెక్కీ..
టాప్ టెక్ కంపెనీల్లో ఉద్యోగం సాధించడం అంత తేలిక కాదు. ‘12సార్లు గూగుల్ నన్ను రిజెక్ట్ చేసినా వదల్లేదని, 13వ ప్రయత్నంలో అను అనుకున్న కలల ఉద్యోగాన్ని సాధించాన’ని సౌమ్యాదీప్ పౌల్ అనే టెక్కీ వెల్లడించారు. ఈ అసాధారణ ప్రయాణం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది..
సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యున్నత స్థాయి టెక్ కంపెనీ అయిన ‘గూగుల్’లో ఉద్యోగం సాధించాలనేది మిలియన్ల మంది టెక్కీల కల. కానీ, ఎంతటి ప్రతిభ ఉన్నా, అనేక సార్లు తిరస్కారాలు ఎదురవ్వడం సహజం. అయితే, పదే పదే ఎదురయ్యే రిజెక్షన్లను చూసి వెనకడుగు వేయకుండా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని నిరూపించారు సౌమ్యాదీప్ పౌల్.

దాదాపు 12 సార్లు గూగుల్ ఇంటర్వ్యూలలో తిరస్కరణకు గురైన తర్వాత, 13వ ప్రయత్నంలో గూగుల్‌లో ఉద్యోగం దక్కించుకున్న విషయాన్ని పౌల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. "13వ సారి నా అదృష్టం తలుపు తట్టింది," అంటూ పౌల్ పోస్ట్ చేసిన కథనం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
"ఇది పక్కా నంబర్స్ గేమ్.. అధైర్యపడొద్దు"!
ప్రముఖ టెక్ దిగ్గజాల్లో ఉద్యోగాలు సాధించడం అనేది ఒక రకంగా "నంబర్ గేమ్" అని సౌమ్యాదీప్ అభివర్ణించారు. దరఖాస్తుదారులు కష్టపడి పనిచేస్తూనే, అదృష్టం కూడా తమ వైపు ఉండేలా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని సూచించారు.
తన ప్రయాణంలో ఒక్క గూగుల్ మాత్రమే కాదు, అనేక ఇతర దిగ్గజ సంస్థల నుంచి కూడా తీవ్ర నిరాశే ఎదురైందని ఆయన వెల్లడించారు:
మైక్రోసాఫ్ట్: ఏకంగా 16 సార్లు రిజెక్ట్ అయిన తర్వాతే ఆఫర్ లెటర్ వచ్చింది.
అమెజాన్: 3 సార్లు తిరస్కరణ ఎదుర్కొన్న తర్వాత ఉద్యోగం దక్కింది.
యాపిల్, ఒరాకిల్: ఈ రెండు కంపెనీల నుంచి అసలు ఒక్కసారి కూడా రెస్పాన్స్ గానీ, కాల్‌బ్యాక్ గానీ రాలేదు.
షాకింగ్ రిజెక్షన్లు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా, తప్పులను సరిదిద్దుకుంటూ పట్టుదలతో ముందుకు సాగడమే తనను గూగుల్ స్థానానికి చేర్చిందని పౌల్ పేర్కొన్నారు.
ఉద్యోగార్థులకు సౌమ్యాదీప్ పౌల్ ఇచ్చిన ‘గోల్డెన్ టిప్స్’..
కేవలం తన విజయాన్ని జరుపుకోవడమే కాకుండా, విదేశీ, దేశీయ టెక్ రంగానికి పోటీపడుతున్న యువ ఉద్యోగార్థుల కోసం కొన్ని విలువైన చిట్కాలను ఆయన పంచుకున్నారు:
గుడ్డిగా అప్లై చేయకండి: ప్రొఫైల్‌కు సంబంధం లేకుండా వరుసగా అప్లికేషన్లు పంపొద్దు. మీ రెజ్యూమ్‌కి, కంపెనీ కోరుతున్న అర్హతలకు ఖచ్చితమైన మ్యాచ్ ఉందో లేదో సరిచూసుకున్న తర్వాతే అప్లై చేయండి.
రెఫరల్స్ వాడండి: మీరు అప్లై చేయాలనుకుంటున్న కంపెనీలో మీ స్నేహితులు పనిచేస్తుంటే, హెచ్‌ఆర్ ఈమెయిల్స్ తెలుసుకుని జాబ్ ఐడీ, రెజ్యూమ్‌లతో నేరుగా మెయిల్ చేయండి.
లింక్డ్‌ఇన్‌లో నెట్‌వర్కింగ్: మీరు చేరుకోవాలనుకుంటున్న కంపెనీల మేనేజర్లకు లింక్డ్‌ఇన్ వేదికగా నేరుగా సందేశాలు పంపండి. నేను వ్యక్తిగతంగా ఇది చేయకపోయినా, ఈ పద్ధతి ద్వారా చాలామందికి అవకాశాలు వచ్చినట్లు గమనించాను.
నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ..
సౌమ్యాదీప్ పోస్ట్ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పలువురు యువ ఉద్యోగులు, ఫ్రెషర్లు ఆయన పట్టుదలను ప్రశంసిస్తూనే తమ సందేహాలను కూడా పంచుకున్నారు
"ఇది కేవలం నంబర్స్ గేమ్ మాత్రమే కాదు. ఫ్రెషర్లకు మైక్రోసాఫ్ట్, గూగుల్ రావాలంటే టెయిర్-1 కళాశాలలు లేదా ఐసీపీసీ ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఇక అనుభవజ్ఞులకైతే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద బ్రాండ్ పేర్లు రెజ్యూమ్‌లో ఉండాల్సిందే," అని ఒక యూజర్ అభిప్రాయపడ్డారు.
మరొక యూజర్.. "ఫ్రెషర్ల విషయంలో ఇది నిజమే కావొచ్చు. కానీ 2 నుంచి 7 ఏళ్ల అనుభవం ఉన్నవారికి బ్రాండ్ నేమ్స్ పెద్దగా పట్టింపు ఉండదు, సులభంగానే ఎంపిక చేస్తారు," అని కామెంట్ చేశారు.
"మీ ఓర్పు అద్భుతం. కానీ మైక్రోసాఫ్ట్‌లో 16 సార్లు రిజెక్ట్ అయ్యారంటే.. మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీని ముందే రీ-డిజైన్ చేసుకోవాల్సి ఉంది," అని మరొకరు పేర్కొన్నారు.
మొత్తానికి, పదే పదే ఎదురయ్యే వైఫల్యాలే విజయానికి పునాదులని సౌమ్యాదీప్ పౌల్ ప్రయాణం మరొకసారి రుజువు చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


