Fasting : వరుసగాా 5 రోజులు.. ఏం తినకపోతే శరీరానికి ఏమవుతుంది? షాకింగ్ రిజల్ట్స్..

Extreme Fasting : ఐదు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా పూర్తిగా ఫాస్టింగ్​ చేస్తే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడానికి ఓ కంటెంట్ క్రియేటర్ క్రేజీ ప్రయోగం చేశాడు! ఆ ఎక్స్​పరిమెంట్​, దాని ఫలితాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Jun 6, 2026, 07:28:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

DCT EATS : ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌ సాధించడానికి రకరకాల డైట్ ప్లాన్స్, ఫాస్టింగ్ (ఉపవాసం) ఛాలెంజ్‌లు చేయడం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారింది. కొందరు తమ శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడానికి అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన పద్ధతులను కూడా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డీసీటీ ఈట్స్’ అనే పేరుతో పాపులర్ అయిన ఒక కంటెంట్ క్రియేటర్.. ఏకంగా ఐదు రోజుల పాటు తిండి తినకుండా ఒక క్రేజీ ప్రయోగాన్ని చేశాడు!

వరుసగా 5 రోజులు.. ఏం తినకపోతే ఏమవుతుంది? (AI generated image)
వరుసగా 5 రోజులు.. ఏం తినకపోతే ఏమవుతుంది? (AI generated image)

ఈ ఐదు రోజుల్లో తన శరీరంలో వచ్చిన ఎనర్జీ లెవెల్స్, ఆకలి, నిద్ర, వర్కవుట్స్, రక్త పరీక్షల్లో వచ్చిన మార్పులను ప్రతిరోజూ రికార్డ్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను షేర్ చేశాడు. జూన్ 4న పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. "నేను ఐదు రోజుల పాటు ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నా అనుభవాన్ని డాక్యుమెంట్ చేశాను," అని అతను పేర్కొన్నాడు.

మొదటి రెండు రోజుల్లో తలనొప్పి, నీరసం రావడం నుంచి.. ఆ తర్వాత శరీరం కొవ్వును కరిగించే 'కీటోసిస్' స్థితికి చేరుకునే వరకు ఈ ఐదు రోజుల ప్రయాణం అతనికి అస్సలు సులువుగా సాగలేదు. ఆ రోజువారీ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము..

మొదటి రోజు: ముందస్తు ఏర్పాట్లు, బ్లడ్ టెస్ట్

5 రోజుల ఫాస్టింగ్ ప్రారంభించడానికి ముందే అతను తన శరీరంలో అంతర్గతంగా వచ్చే మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం బరువు చూసుకోవడంతో పాటు కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. "ఈ ప్రయోగం మొదలుపెట్టే సమయానికి నా బరువు 82.5 కిలోలుగా ఉంది. అంతర్గత మార్పులను ట్రాక్ చేయడానికి పూర్తి బ్లడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించాను," అని అతను చెప్పాడు. మొదటి రోజు చిన్నపాటి వర్కవుట్ చేయడంతో పాటు సాధారణం కంటే ఎక్కువ సమయం నిద్రపోయినట్లు అతను వివరించాడు.

రెండో రోజు: మొదలైన తలనొప్పి, అలసట!

ఆహారం లేకపోవడంతో రెండో రోజుకు వచ్చేసరికి శరీరంపై ఉపవాస ప్రభావం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. "రెండో రోజు నుంచే నాకు విపరీతమైన తలనొప్పి మొదలైంది," అని అతను తెలిపాడు. అయినప్పటికీ అతను పడకకే పరిమితం కాకుండా నడక సాగిస్తూ యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత కొద్దిగా తల తిరిగినట్లు (లైట్‌హెడెడ్‌నెస్) అనిపించడంతో, ఎలక్ట్రోలైట్స్- నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఆ సమస్యను మేనేజ్ చేశాడు.

మూడు, నాల్గొవ రోజులు: మాయమైన ఆకలి, మారిన శక్తి!

ఆశ్చర్యకరంగా, మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడు, నాల్గొవ రోజులు అతనికి చాలా తేలికగా అనిపించాయి. "నేను వర్కవుట్ చేశాను, బాడీ మసాజ్ చేయించుకున్నాను. నా శరీరం శక్తి కోసం లోపల ఉన్న కొవ్వును కరిగించడం ప్రారంభించడంతో ఆకలి అనేది పూర్తిగా మాయమైపోయింది," అని అతను పేర్కొన్నాడు.

కానీ, శారీరక ఆకలి కంటే చుట్టుపక్కల వాతావరణం వల్ల వచ్చే ఇబ్బందులే తనను ఎక్కువగా వేధించాయని అతను ఒప్పుకున్నాడు. "అన్నింటికంటే కష్టమైన విషయం ఏంటంటే.. మా ఇంట్లో, మా నానమ్మ ఇంట్లో వండే కమ్మని వంటకాల సువాసనలు నా ముక్కుకు తగలడం. అది నన్ను ఒక నరకంలా వేధించింది," అని అతను చెప్పుకొచ్చాడు. ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి, ఆహారం గురించి పదే పదే ఆలోచించకుండా ఉండటానికి వర్కవుట్లు చేయడం, చిన్న చిన్న పనులపై దృష్టి పెట్టడం లాంటి వ్యాపకాలతో తనను తాను బిజీగా ఉంచుకున్నాడు.

ఐదో రోజు: ఫాస్టింగ్ ముగింపు!

ఎలాగోలా ఐదో రోజును విజయవంతంగా పూర్తి చేసి తన ఉపవాస దీక్షను ముగించాడు. "నేను ఎట్టకేలకు ఐదో రోజుకు చేరుకున్నాను. ఒక మంచి హెల్తీ గోల్డెన్ బ్రోత్ తాగి నా ఫాస్టింగ్​ని విరమించాను. అది చాలా అద్భుతంగా అనిపించింది," అని సంతోషం వ్యక్తం చేశాడు.

ఊహించని ఫలితాలు ఇవి..

ఐదు రోజుల పాటు అసలు తిండే తినకపోవడం వల్ల అతని బరువు ఏకంగా 5 కిలోల వరకు తగ్గింది. "ఐదు రోజుల పాటు సున్నా ఆహారం తీసుకున్న తర్వాత నా బరువు చూసుకుంటే 5 కిలోలు తగ్గిపోయాను. కానీ అసలైన సర్ప్రైజ్ అది కాదు," అంటూ ఉపవాసం ముగిసిన తర్వాత చేయించుకున్న బ్లడ్ టెస్ట్ రిపోర్టుల్లో ఎవరూ ఊహించని మార్పులు వచ్చాయని అతను హింట్ ఇచ్చాడు.

నిపుణుల హెచ్చరిక..

ఇలాంటి కఠినమైన ఫాస్టింగ్ ప్రయోగాలు సోషల్ మీడియాలో చూడటానికి ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, వీటిని ఇంట్లో సొంతంగా ప్రయత్నించడం అస్సలు మంచిది కాదు. వైద్యుల పర్యవేక్షణ, సలహాలు లేకుండా సుదీర్ఘ కాలం పాటు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడటమే కాకుండా ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. బరువు తగ్గాలనుకునే వారు తమ వైద్యులు, ఫిట్​నెస్​ ట్రైనర్లను సంప్రదించాల్సి ఉంటుంది.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More