...
...
Next Story

Healthy snacks : మిల్లెట్ చిప్స్, ప్రోటీన్ బార్స్.. ఈ హెల్తీ స్నాక్స్ ఎంత హెల్తీ? అసలు విషయం తెలిస్తే షాక్!

సూపర్ మార్కెట్లలో 'హెల్తీ' అని కనిపించే మిల్లెట్ చిప్స్, రాగి బిస్కెట్లు, వెజ్ చిప్స్ నిజంగా ఆరోగ్యకరమైనవేనా? ప్యాకెట్ ముందు భాగం చూసి మోసపోకుండా, వెనుక ఉన్న అసలు న్యూట్రిషన్ లేబుల్ చూసి నిజాలను ఎలా గ్రహించాలో నిపుణులు అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ..

Published on: Sep 13, 2026, 07:29:44 IST
Advertisement

ఈ మధ్య కాలంలో సూపర్ మార్కెట్‌కు వెళ్తే చాలు.. 'హెల్తీ స్నాక్స్' పేరుతో చాలా ప్యాకెట్లు దర్శనమిస్తాయి. మిల్లెట్ చిప్స్, జొన్న పఫ్స్, బీట్‌రూట్ చిప్స్, ప్రోటీన్ బార్స్, రాగి కుకీస్.. ఇలా జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. చిరుధాన్యాలు తింటున్నాం కదా అని చాలామంది వీటిని ఎంతో ఆశగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ ప్యాకెట్లపై 'హెల్తీ' అని రాసి ఉన్నంత మాత్రాన అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా? అంటే కాదనే చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మి కాళే!

చిరుధాన్యాల చిప్స్.. ప్రాసెస్ చేస్తే పోషకాలు ఉఫ్!

ఈ హెల్తీ స్నాక్స్ ఎంత హెల్తీ? (Unsplash)
ఈ హెల్తీ స్నాక్స్ ఎంత హెల్తీ? (Unsplash)

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ చిరుధాన్యాల (మిల్లెట్స్) వాడకం పెరుగుతోంది. ఇళ్లలో జొన్న రొట్టెలు, రాగి అంబలి చేసుకోవడం మంచి అలవాటే. కానీ, అదే మిల్లెట్స్‌ను ప్రాసెస్ చేసి, నూనె, ఉప్పు, రసాయన ఫ్లేవర్లు కలిపి చిప్స్ రూపంలోకి మార్చినప్పుడు దానిలో అసలు పోషకాలే ఉండవు!

"పోషకాలున్న పదార్థాన్ని ఒక స్నాక్ తయారీలో వాడినంత మాత్రాన.. ఆ ప్యాకెట్ మొత్తం ఆరోగ్యకరమైనదిగా మారిపోదు," అని న్యూట్రిషన్ ఇన్ సింక్ హెడ్ న్యూట్రిషనిస్ట్ లక్ష్మి కాళే స్పష్టం చేశారు. జొన్న పఫ్స్, రాగి స్నాక్స్, మల్టీగ్రెయిన్ క్రాకర్స్ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు.

వెజిటేబుల్ చిప్స్.. కూరగాయల పేరుతో నూనె బాదుడు!

బీట్‌రూట్ చిప్స్, క్యారట్ చిప్స్, బెండకాయ చిప్స్, పాలకూర చిప్స్ చూసినప్పుడు.. మనం కూరగాయలు తింటున్నామనే భావన కలుగుతుంది. ఇక్కడే వినియోగదారులు పెద్ద పొరపాటు చేస్తున్నారు. వీటి తయారీలో కూరగాయలు వాడినప్పటికీ, అవి నూనెలో వేగడం లేదా అధిక వేడి వద్ద ప్రాసెస్ అవ్వడం వల్ల నూనె, ఉప్పు శరీరంలోకి భారీగా చేరుతాయి. ప్యాకెట్ మీద 'వెజిటేబుల్' అని రాసి ఉన్నంత మాత్రాన అది ఆరోగ్యకరమైన కూరగాయల సర్వింగ్‌తో సమానం కాదు.

రాగి కుకీస్, ప్రోటీన్ బార్ల మాయాజాలం..

సాధారణ బిస్కెట్ల కంటే వీటిలో కొద్దిగా మంచి విషయాలు ఉండవచ్చు, కానీ వీటిని స్నాక్‌గానే పరిగణించాలి తప్ప ఆరోగ్యకరమైన ఆహారంగా రోజూ తినకూడదు. ఇక ప్రోటీన్ బార్స్, గ్రెనోలా బార్ల విషయానికి వస్తే.. డ్రై ఫ్రూట్స్, గింజలు ఉన్నప్పటికీ, వాటి రుచి కోసం వాడే షుగర్ సిరప్‌లు, కొవ్వులు ఆరోగ్యానికి హాని చేస్తాయి.

'హై ప్రోటీన్' అని ఉంటే గుడ్డిగా నమ్మకండి!

ప్రస్తుతం మార్కెట్లో ఏదైనా ప్యాకెట్‌పై 'హై ప్రోటీన్' అని కనిపిస్తే జనాలు ఎగబడి కొంటున్నారు. కానీ, ప్రోటీన్ ఒక్కటే ఆహారంలో ముఖ్యం కాదు. ఒక పదార్థంలో ప్రోటీన్ ఉన్నప్పటికీ.. దానిలో కేలరీలు, సోడియం (ఉప్పు), సాచురేటెడ్ ఫ్యాట్, చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే అవకాశముంది.

ప్యాకెట్ కొనేముందు ఏం చేయాలి?

ఒక్కొక్కరి శరీర తత్వానికి, అవసరాలకు అనుగుణంగా 'ఆరోగ్యకరమైన ఆహారం' నిర్వచనం మారుతుంది. జిమ్‌కు వెళ్లేవారికి ప్రోటీన్ స్నాక్ అవసరం కావచ్చు. కానీ సామాన్యులకు గుప్పెడు వేపిన శనగలు, పల్లీలు లేదా పండ్లు తినడమే ఎంతో మేలు.

ఇక సూపర్ మార్కెట్‌లో ఏదైనా ప్యాకెట్ కొనేముందు దాన్ని తిప్పి వెనుక ఉన్న ‘న్యూట్రిషన్ లేబుల్’ చూడటం అలవాటు చేసుకోవాలి. అందులో ఎంత సోడియం, షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్ ఉందో గమనించాలి.

అన్నింటికంటే ముఖ్యం.. ‘సర్వింగ్ సైజ్’. ప్యాకెట్‌లో ఒక సర్వింగ్ అని రాసి ఉన్న పరిమాణానికి, మనం ఒకేసారి తినే పరిమాణానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్యాకేజ్డ్ హెల్తీ స్నాక్స్ కంటే ఇంట్లో చేసుకునే గుప్పెడు శనగలు లేదా పల్లీ పట్టీ వంటి సాంప్రదాయ తినుబండారాలే ఎప్పుడూ సురక్షితం!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON