రేపే Budget 2026- ఏ టైమ్‌కి? ఎక్కడ చూడాలి? పూర్తి వివరాలు..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దశాబ్ద కాలంలో ఆదివారం నాడు బడ్జెట్ రావడం ఇదే తొలిసారి. మరి నిర్మల బడ్జెట్ 2026 ఏ టైమ్‌కి ప్రారంభమవుతుంది? ఎక్కడ చూడాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ 2026ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు ఇది వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రసంగం. అంతేకాదు, గత పదేళ్లలో ఒక ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

బడ్జెట్ తయారీ ప్రక్రియలో చివరి ఘట్టమైన 'హల్వా వేడుక' జనవరి 27న నార్త్ బ్లాక్‌లోని బడ్జెట్ ప్రెస్‌లో ఆర్థిక మంత్రి సమక్షంలో జరిగింది. ఈ వేడుక ముగిసిన వెంటనే, బడ్జెట్ రహస్యాలను కాపాడేందుకు అధికారులు 'లాక్-ఇన్' పీరియడ్‌లోకి వెళ్లారు.
అనంతరం, జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిని అనుసరించి జనవరి 29న ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను వివరించే 'ఆర్థిక సర్వే 2026'ను నిర్మలా సీతారామన్ సభ ముందుంచారు.
బడ్జెట్ సమావేశాల మొదటి విడత ఫిబ్రవరి 13తో ముగుస్తుంది. రెండో విడత మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 2న లోక్‌సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడతాయి.
బడ్జెట్ 2026- ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
కేంద్ర బడ్జెట్ 2026ను ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడతారు. బడ్జెట్ 2026 లైవ్ అప్డేట్స్ని, ప్రత్యేక కథనాలను 'హిందుస్థాన్ టైమ్స్ తెలుగు' వెబ్సైట్లో చూడవచ్చు. ప్రత్యక్ష ప్రసారాన్ని హిందుస్థాన్ టైమ్స్, లైవ్‌మింట్ యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు.
అలాగే సంసద్ టీవీ ద్వారా లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను బహుళ భాషల్లో చూడవచ్చు.
ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ (డీడీ) సైతం ఫిబ్రవరి 1న బడ్జెట్ 2026ని ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. వీటితో పాటు కేంద్ర బడ్జెట్ అధికారిక వెబ్‌సైట్ (indiabudget.gov.in), ఆర్థిక మంత్రిత్వ శాఖ, పీఐబీ సోషల్ మీడియా పేజీల్లో కూడా ప్రసంగం అందుబాటులో ఉంటుంది.
బడ్జెట్ 2026- ఈ రంగాలపై ఫోకస్..
ఇక ఈ ఏడాది ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమొబైల్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), రైల్వే, పునరుత్పాదక ఇంధనం, పట్టణాభివృద్ధి వంటి రంగాలపై అందరి దృష్టి నెలకొంది. వీటితో పాటు వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, లాజిస్టిక్స్, పర్యాటక రంగాలకు కూడా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.
బడ్జెట్ 2026- స్టాక్ మార్కెట్ ఓపెన్‌లో ఉంటుందా?
ప్రతి యేటా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం ఆనవాయతీగా వస్తోంది. అయితే, ఈసారి ఫిబ్రవరి 1 అనేది ఆదివారం వచ్చింది. సాధారణంగా ఆదివారం అంటే స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ స్టాక్ మార్కెట్లకు కీలకం. అందుకే ఈసారి ఆదివారం స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఈ విషయాన్ని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు స్పష్టం చేశాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్థిక సర్వే 2026: అంచనాలు ఇవే!
బడ్జెట్ ప్రసంగానికి ముందు ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే 2026 ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.8-7.2 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. బలమైన పునాదులు, నియంత్రణ సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయి. ద్రవ్యోల్బణం గత ఏడాదితో పోలిస్తే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, అది ఆందోళన కలిగించే అంశం కాదని సర్వే పేర్కొంది. నవంబర్ 2025 నాటికి ఆర్థిక లోటు బడ్జెట్ అంచనాల్లో 62.3 శాతంగా ఉంది. 2026 నాటికి దీనిని జీడీపీలో 4.4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
1964 కంటే ముందు ఆర్థిక సర్వే బడ్జెట్‌లో భాగంగానే ఉండేది, కానీ ఆ తర్వాత పార్లమెంటు సభ్యులకు, ప్రజలకు ఆర్థిక వ్యవస్థపై లోతైన అవగాహన కల్పించడం కోసం దీనిని విడిగా విడుదల చేయడం ప్రారంభించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


