...
...
Next Story

Trump Tariff on India : మరోసారి టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్- భారత్​పై 25శాతం! కేంద్రం స్పందన ఇలా..

భారత ఎగుమతులపై గరిష్టంగా 25 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్​టీఆర్) ప్రతిపాదించింది. అవసరానికి మించి ఉత్పత్తి చేస్తోందన్న అమెరికా ఆరోపణలను భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, మన పరిశ్రమలపై ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Updated on: Nov 26, 2026, 05:44:16 IST
Advertisement

భారత్​పై అమెరికా తాజాగా ప్రతిపాదించిన 25శాతం టారిఫ్​ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో, భారత్ తన అవసరాలకు మించి వస్తువులను ఉత్పత్తి చేస్తోందంటూ వాషింగ్టన్ చేసిన ఆరోపణలను దిల్లీ తిప్పికొట్టింది. దేశంలోని ఏ రంగంలోనూ అదనపు ఉత్పత్తి సామర్థ్యం లేదని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. తాజా పరిణామాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో భారత ప్రధాని మోదీ..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తో భారత ప్రధాని మోదీ..

భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై గరిష్టంగా 25 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ప్రతిపాదించింది. ఒకవేళ 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తే మన ఫార్మా కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెరగడమే కాకుండా, అమెరికా మార్కెట్లో ఇతర దేశాల కంపెనీలతో పోటీపడటం కష్టమవుతుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువపైనా ఇలాంటి వాణిజ్య ఆంక్షలు పరోక్ష ప్రభావం చూపుతాయి.

సెక్షన్ 301 దర్యాప్తు.. భారత్‌పై అమెరికా ఆరోపణలు ఏంటి?

అమెరికా వాణిజ్య చట్టంలోని 'సెక్షన్ 301' కింద మార్చి నెలలో యూఎస్‌టీఆర్ ప్రారంభించిన దర్యాప్తులో భాగంగా ఈ సుంకాల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారత్ సహా 14 ఆర్థిక వ్యవస్థల తయారీ రంగాలలో నిర్మాణాత్మక అదనపు ఉత్పత్తి సామర్థ్యంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని యూఎస్‌టీఆర్ ఈ నోటీసు జారీ చేసింది.

భారత్ తన అవసరాలకు మించి ఉత్పత్తి చేస్తోందని, విదేశీ సంస్థలు తమ మార్కెట్లోకి ప్రవేశించకుండా కఠిన ఆంక్షలు విధిస్తోందని, కార్మికులకు సరైన రక్షణ కల్పించడం లేదని అమెరికా ఆరోపిస్తోంది. వీటన్నింటి వల్ల అమెరికా కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయని వాషింగ్టన్ వాదిస్తోంది.

కాగా ఈ నోటీసును పరిగణనలోకి తీసుకున్నామన్న భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో ఏ రంగంలోనూ నిర్మాణాత్మక అదనపు సామర్థ్యం లేదు," అని బదులిచ్చింది.

చైనా, వియత్నాం సహా ఇతర దేశాలపై సుంకాల లెక్కలివే..

అమెరికా సుంకాల జాబితాలో కేవలం భారత్ మాత్రమే లేదు. చైనా సహా పలు ఇతర దేశాలపై 20 నుంచి 35 శాతం వరకు సుంకాలను ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు తక్కువ పన్నులు వర్తిస్తాయి. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్ దేశాలకు సాధారణ దిగుమతి సుంకాలతో కలిపి 15 శాతం పన్ను విధిస్తారు. వియత్నాం తన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న తర్వాత 20 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. భారత్ విషయంలోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకం 17 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా- భారత్ దేశాలు ఒక తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. "వాణిజ్య సంబంధిత ఆందోళనలు ఏవైనా ఉంటే వాటిని ఈ చర్చల పరిధిలోనే పరిష్కరించుకోవాలన్నది భారత్ వైఖరి. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది," అని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ ప్రతిపాదిత సుంకాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం జనవరి 25న బహిరంగ విచారణ చేపట్టనుంది. ఆసక్తి గల వారు జనవరి 5 లోగా తమ లిఖితపూర్వక అభిప్రాయాలను పంపాలని కోరింది.

అప్పటివరకు ఈ ప్రతిపాదన చర్చల దశలోనే కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలు సఫలమైతే, భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది.

అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ విధంగా సుంకాలను ప్రతిపాదించడం, అమలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా ట్రంప్ సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిని అగ్రరాజ్యంలోని కోర్టులే కొట్టేస్తుండటం గమనార్హం.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks