SRH vs RCB : ఆర్సీబీని అల్లాడించిన సన్‌రైజర్స్- కాటేరమ్మ కొడుకుల విధ్వంసం! కానీ..
Yesterday match winner : ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 256 టార్గెట్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేదించలేక 200 దగ్గరే ఆగిపోయింది. అయితే, ఈ మ్యాచ్ అనంతరం పాయింట్స్ టేబుల్లో ఎలాంటి మార్పు లేదు.
2026 IPL point table : ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు చేరిన రెండు బలమైన జట్ల మధ్య శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాస్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన 67వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎస్‌ఆర్‌హెచ్ చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్యాట్ కమిన్స్ సేన.. ఉప్పల్ పిచ్‌పై బౌండరీల వర్షం కురిపిస్తూ భారీ స్కోరును బోర్డుపై ఉంచి, ప్రత్యర్థిని కట్టడి చేసింది.

ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ- అభిషేక్, ఇషాన్ కిషన్ ఊచకోత..
మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పవర్‌ప్లేలోనే అదిరిపోయే స్టార్ట్ లభించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 56 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను అవుట్ అయిన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.
చివర్లో హెన్రిక్ క్లాసెన్ తన మార్క్ హిట్టింగ్‌తో 24 బంతుల్లోనే 51 రన్స్ చేయగా.. నితీష్ కుమార్ రెడ్డి (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దీనితో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ దార్ 2 వికెట్లు తీసినప్పటికీ 52 పరుగులు సమర్పించుకున్నాడు. సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది.
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ- పోరాడినా తప్పని ఓటమి..
256 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (19 బంతుల్లో 44) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే మిడిల్ ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బకొట్టారు. విరాట్ కోహ్లీ 15 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 39 బంతుల్లో 56 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15) జట్టును గెలిపించలేకపోయారు. దీనితో బెంగళూరు 20 ఓవర్లలో 200/4 స్కోరుకే పరిమితమైంది.
సన్‌రైజర్స్ బౌలర్లలో ఈషన్ మలింగ అద్భుతమైన బౌలింగ్‌తో 2 వికెట్లు పడగొట్టగా.. సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్‌లు చెరో వికెట్ సాధించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలర్లను సమర్థవంతంగా రొటేట్ చేస్తూ డెత్ ఓవర్లలో రన్ రేట్ పెరగకుండా కట్టడి చేశాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
ప్లేఆఫ్స్ సమీకరణాలు..
అయితే, ఈ మ్యాచ్ ఫలితంతో ప్లేఆఫ్స్ స్థానాల్లో, ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో ఎలాంటి మార్పు లేదు! ఎందుకంటే రెండు జట్లు ఇదివరకే క్వాలిఫై అయ్యాయి. అయితే, ఈ భారీ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ నెట్ రన్ రేట్‌ను +0.524 కు పెంచుకుంది. మరోవైపు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ (+0.783) కారణంగా ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.
విరాటో కోహ్లీ వర్సెస్ ట్రావిస్ హెడ్..
కాగా రెండో ఇన్నింగ్స్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మధ్య వాడీవేడీ వాతావరణం కనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో శివంగ్ కుమార్ తన తొలి ఓవర్‌ని వేస్తున్నప్పుడు.. వెంకటేష్ అయ్యర్ విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు సాధించాడు.
ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. హెడ్‌వైపు పదేపదే సైగలు చేస్తూ కనిపించాడు. “నువ్వు వచ్చి బౌలింగ్ చెయ్యి” అని ఆ సైగలకు అర్థం అని కామెంటేటర్లు భావించారు. మరి హెడ్ ఏమైనా చేశాడో లేదో తెలియదు కానీ కోహ్లీ మాత్రం కాస్త అగ్రెసివ్‌గానే బిహేవ్ చేశాడు.
ఇది ఇక్కడితో ఆగలేదు! మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. కోహ్లీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ- స్కోర్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 20 ఓవర్లలో 255/4 (ఇషాన్ కిషన్ 79, అభిషేక్ శర్మ 56, హెన్రిక్ క్లాసెన్ 51; రసిక్ సలామ్ 2/52).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 20 ఓవర్లలో 200/4 (రజత్ పాటిదార్ 56, వెంకటేష్ అయ్యర్ 44, కృనాల్ పాండ్యా 41*; ఈషన్ మలింగ 2/33).
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


