Iran Israel War : ముదురుతున్న యుద్ధ జ్వాలలు- నెతన్యాహుతో ప్రధాని మోదీ కీలక చర్చలు..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, తాజా దాడుల నేపథ్యంలో పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి స్థాపనే లక్ష్యంగా భారత్ తన గళాన్ని వినిపించింది.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరంగా కీలక అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్జమిన్ నెతన్యాహుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిస్థితులపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ముఖ్యంగా అమాయక పౌరుల భద్రతే తమకు పరమావధి అని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చర్చల అనంతరం ప్రధాని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. తాజా పరిణామాలపై భారత ఆందోళనలను వారికి వివరించాను. పౌరుల రక్షణే మొదటి ప్రాధాన్యత అని నొక్కి చెప్పాను. యుద్ధం తక్షణమే ముగియాలని భారత్ కోరుకుంటోంది," అని పేర్కొన్నారు.
యూఏఈ అధ్యక్షుడికి మోదీ హామీ..
అంతకుముందు ఆదివారం రాత్రి ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ ఎప్పుడూ యూఏఈకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా యూఏఈలో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రత, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్న మోదీ, భారతీయుల పట్ల చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తుందని వివరించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ఉద్రిక్తతల వెల్లువ
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై జరిపిన భారీ స్థాయి వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అల్ ఖమేనీ (86) మరణించారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఇర్నా’, ఇరాన్ స్టేట్ టెలివిజన్ ఈ విషయాన్ని ఆదివారం ఉదయం ధృవీకరించాయి.
ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించింది. దీనికి సమాధానంగా ఆదివారం ఇజ్రాయెల్ మరోసారి టెహ్రాన్‌పై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడులు ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతమంతా అట్టుడుకుతోంది. షిప్పింగ్, ఏవియేషన్, చమురు రవాణా వంటి కీలక రంగాలపై ఈ యుద్ధ ప్రభావం పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం సహా వాణిజ్య పరంగా తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదొక "గొప్ప అవకాశం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకోకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, వారి క్షిపణి కార్యక్రమాలను అణచివేసేందుకు, అమెరికా-దాని మిత్రదేశాలకు ఉన్న ముప్పును తొలగించేందుకు ఈ దాడులు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. అవసరమైతే వారం రోజుల పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈ దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు.
దాడుల బీభత్సం: దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలపై ప్రభావం..
గత రెండు రోజులుగా ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల వల్ల యూఏఈలో ముగ్గురు మరణించగా, 58 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన 165 బాలిస్టిక్ క్షిపణుల్లో 152 క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నారు. అలాగే 541 డ్రోన్లలో 506 డ్రోన్లను కూల్చివేశారు. అయితే కొన్ని డ్రోన్ల శిథిలాలు నివాస ప్రాంతాలపై పడటంతో దుబాయ్‌లోని ప్రసిద్ధ 'పామ్ జుమేరా', 'బుర్జ్ అల్ అరబ్' హోటల్ వంటి చోట్ల మంటలు చెలరేగాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు కువైట్ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలకు కూడా ఆటంకం కలిగింది.
భారత్‌లో నిరసనలు.. రంగంలోకి సీసీఎస్..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి నిరసనగా ఆదివారం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న షియా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో సంతాప కార్యక్రమాలు నిర్వహించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న ఈ వ్యూహాత్మక పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఆదివారం రాత్రి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యుద్ధం కారణంగా భారత్‌పై పడే ఆర్థిక ప్రభావం, భారతీయుల భద్రతపై ఈ ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది.

E-Paper












