దట్టమైన పొగమంచులో డ్రైవింగ్- మీ భద్రత కోసం ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి..
చలికాలం అంటే పొగమంచు గురించి వార్తలు వింటూనే ఉంటాము. మరీ ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో డ్రైవింగ్ అనేది ప్రమాదకరంగా మారుతుంది. అందుకే పొగమంచు మధ్య డ్రైవింగ్ కోసం కొన్ని టిప్స్ పాటించాలి. వాటిని వివరంగా ఇక్కడ తెలుసుకోండి..
ప్రతి చలికాలంలో, దట్టమైన పొగమంచు (Fog) కారణంగా రోడ్డుపై విజిబులిటీ తీవ్రంగా పడిపోతుంది! ఇది మనం నిత్యం తిరిగే దారులను కూడా ప్రమాదకరంగా మారుస్తుంది. విజిబులిటీ తక్కువగా ఉన్నప్పుడు, అడ్డంకులు, ఎదురుగా వచ్చే వాహనాలను సకాలంలో గుర్తించడం కష్టమవుతుంది. ఫలితంగా హైవేలు, పట్టణ రోడ్లపై ప్రమాదాలు జరుగుతుంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకుండా ఉండటం ఉత్తమం. కానీ తప్పనిసరిగా డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు, జాగ్రత్తగా ఉండే అలవాట్లను అలవర్చుకోవడం, నిరూపితమైన భద్రతా చర్యలను పాటించడం చాలా అవసరం. ప్రమాదాలు లేకుండా గమ్యాన్ని చేరుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. పొగమంచులో సురక్షితంగా డ్రైవింగ్ చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన టిప్స్ మీ కోసం అందిస్తున్నాము..
1. నెమ్మదిగా డ్రైవ్ చేయండి, డిస్టెన్స్ పాటించండి..
పొగమంచులో డ్రైవ్ చేసేటప్పుడు చేయాల్సిన అత్యంత తెలివైన పని వేగాన్ని తగ్గించడం. విజిబులుటీ తగ్గినప్పుడు డిస్టెన్స్‌ని అంచనా వేయడం, ప్రమాదాలను సకాలంలో గుర్తించడం కష్టం. కాబట్టి తక్కువ వేగంతో డ్రైవ్ చేయడం మీకు వాహనంపై ఎక్కువ నియంత్రణను ఇస్తుంది, తద్వారా వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా, ముందు వెళుతున్న వాహనానికి, మీ వాహనానికి మధ్య ఎక్కువ గ్యాప్ పాటించడం చాలా ముఖ్యం. అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినా, ఊహించని పరిస్థితికి స్పందించాల్సి వచ్చినా ఈ అదనపు గ్యాప్ చాలా కీలకం అవుతుంది.
2. ఓవర్‌టేక్ చేయడం మానుకోండి..
పొగమంచు డెప్త్ పర్సెప్షన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల దూరాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్‌టేక్ చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్యగా మారుతుంది.
ఈ వాతావరణంలో సహనం చాలా కీలకం. విజిబులుటీ మెరుగుపడే వరకు, సురక్షితమైన దూరాన్ని పాటిస్తూ ముందు వాహనం వెనుకనే ఉండటం ఉత్తమం. పూర్తిగా ఓవర్‌టేక్ చేయకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా ఓవర్‌టేక్ చేయాల్సి వస్తే, ముందు రోడ్డు స్పష్టంగా కనిపించినప్పుడు మాత్రమే, అది కూడా అత్యంత జాగ్రత్తగా చేయాలి. స్థిరమైన, మితమైన వేగాన్ని కొనసాగించండి. ఆకస్మికంగా వేగాన్ని పెంచడం లేదా బ్రేక్ వేయడం చేయకుండా సున్నితంగా నడపండి. దీనివల్ల మీకు, మీ వెనుక వచ్చే డ్రైవర్లకు సురక్షితంగా స్పందించడానికి తగినంత సమయం ఉంటుంది.
3. డీఫాగర్ ఉపయోగించండి..
పొగమంచు, చల్లని వాతావరణం కారణంగా తరచుగా విండ్‌స్క్రీన్‌పై తేమ పేరుకుపోతుంది. ఇది దృష్టిని మరింత పరిమితం చేస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి, వెహికిల్ డీఫాగర్‌ను ఆన్ చేసి, విండ్‌షీల్డ్ వైపు గాలిని మళ్లించండి. మీ కారులో రేర్ డీఫాగర్ ఉంటే, దాన్ని కూడా ఆన్ చేయండి.
విండ్‌షీల్డ్ వెలుపల ఏర్పడిన మంచును వైపర్‌లను ఉపయోగించి తొలగించండి. గ్లాస్ అన్ని వేళలా స్పష్టంగా ఉండేలా చూసుకోవడం మంచి విజిబులుటీని, సురక్షితమైన డ్రైవింగ్‌ను కొనసాగించడానికి అత్యవసరం.
4. లో- బీమ్, ఫాగ్ ల్యాంప్స్ వాడండి..
పొగమంచు పరిస్థితుల్లో హై బీమ్ వల్ల మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుంది! ఆ తీవ్రమైన కాంతి గాలిలోని చిన్న నీటి బిందువులపై పడి వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి, ప్రతిదీ మెరుస్తూ కనిపిస్తుంది. ఇది విజిబులుటీని మరింత తగ్గిస్తుంది.
లో- బీమ్ హెడ్‌లైట్‌లు ఉపయోగించడం మంచిది. మీ వాహనంలో ఫాగ్ ల్యాంప్స్ ఉంటే, వాటిని కూడా ఆన్ చేయండి. ఈ లైట్లు దట్టమైన పొగమంచులో విజిబులుటీని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా తయారయ్యాయి. అలాగే, కొన్ని కార్లలో రేర్ ఫాగ్ ల్యాంప్ ఉంటుంది. ఇది కాంతి తీవ్రత టైల్ ల్యాంప్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది వెనుక వస్తున్న వాహనదారులు మీ కారును మరింత మెరుగ్గా గుర్తించడానికి సహాయపడుతుంది.
5. ఆకస్మిక లేన్ మార్పులు వద్దు..
పొగమంచులో డ్రైవ్ చేసేటప్పుడు సరైన లేన్ డిసిప్లీన్ పాటించడం కీలకం. ముఖ్యంగా వాహనాలు అధిక వేగంతో కదులుతున్న హైవేలపై, ఆకస్మిక లేన్ మార్పులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.
దృష్టి తక్కువగా ఉన్నప్పుడు, స్థిరమైన మార్గంలో ఉండటానికి లేన్ లైన్స్, రోడ్డు మార్కింగ్‌లపై ఆధారపడండి. మీ లేన్‌లోనే ఉండండి. మీరు నగరంలో డ్రైవింగ్ చేస్తున్నా, లేదా బహిరంగ రోడ్లపై డ్రైవ్ చేస్తున్నా, మీ లేన్‌కు కట్టుబడి ఉండటం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పరిస్థితులు మెరుగుపడే వరకు రోడ్డు సిగ్నల్స్‌ని దృశ్య మార్గదర్శకాలుగా ఉపయోగించి మీ వాహనాన్ని వాటి మధ్య ఉంచండి.
విశ్రాంతి ఉత్తమం..
వీటన్నింటికి మించి, సూచించగలిగే అత్యుత్తమ భద్రతా టిప్.. వాతావరణం మెరుగుపడే వరకు వాహనాన్ని పెట్రోల్ పంపు, ఛార్జింగ్ స్టేషన్ లేదా ఏదైనా రెస్టారెంట్ వద్ద నిలిపివేసి వేచి ఉండటం! దట్టమైన పొగమంచులో డ్రైవింగ్ చేయడానికి విపరీతమైన ఏకాగ్రత అవసరం. దీనివల్ల త్వరగా అలసట వచ్చి, పొరపాట్లు చేసే ప్రమాదం పెరుగుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


